వర్షమొస్తే రోడ్ల పంచాయతీ
close
Published : 30/07/2021 03:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వర్షమొస్తే రోడ్ల పంచాయతీ

ధ్వంసమవుతున్న పల్లె రహదారులు 

ప్రతిపాదనలతోనే కాలం వెళ్లదీత

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌


గుంతలమయంగా మారిన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జానంపేట- లక్ష్మిపల్లి దారి

గ్రామీణ రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. గతేడాదితోపాటు ఈ నెలలో పడిన వర్షాలకు పలు చోట్ల పంచాయతీరాజ్‌ శాఖ రోడ్లు కంకరతేలి గుంతలు పడ్డాయి. దీంతో గ్రామాల నుంచి మండల కేంద్రాలతోపాటు ఇతర గ్రామాలకు వెళ్లాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 8,921 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు (పంచాయతీరాజ్‌) ఉన్నాయి. గతేడాది పడిన వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 121 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. వీటి కోసం తాత్కాలిక మరమ్మతులకు ఆ శాఖ రూ.4.45 కోట్ల మేర అంచనాలు వేసి రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించింది. చాలా చోట్ల మరమ్మతుల పనులు మాత్రం చేయలేదు. ఈ నెలలో పది రోజులపాటు పడిన వర్షాలకు గ్రామీణ రోడ్లు మరింత దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 రోడ్లు ధ్వంసం కాగా వాటి విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుంది. వీటికి కూడా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేవలం నారాయణపేట జిల్లాలోనే రూ.15 కోట్ల విలువైన 17 గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయి. నిధుల లేమితో గ్రామీణ రహదారులు రోజురోజుకు మరింత అధ్వానంగా మారుతున్నాయి. చాలా చోట్ల స్థానికులు మొరం మట్టిని వేసి రోడ్ల గుంతలను పూడ్చుతున్నారు. చిన్నచిన్న పనులకు పంచాయతీరాజ్‌ శాఖ నిధులు కేటాయించి మరమ్మతులు చేయగా పెద్ద పనులు మాత్రం పెండింగ్‌లోనే ఉంటున్నాయి.


జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం అమరవాయి గ్రామం నుంచి నారాయణపురం వెళ్లే రహదారి ఇది. 2010లో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.60 లక్షలతో ఏడు కిలోమీటర్ల మేర బీటీ వేశారు. గతేడాది వర్షాలతోపాటు నాసిరకం పనులు వెరిసి ఈ రోడ్డుపై పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. ఈ దెబ్బతిన్న రహదారిని బాగు చేయడానికి రూ.30 లక్షలు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రోడ్డు మరింత దెబ్బతింది.


వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం తూంకుంట నుంచి గోవర్ధనగిరికి ఏర్పాటు చేయనున్న రెండు వరసల రహదారి ఇది. మొత్తం 12 కిలోమీటర్ల దూరం ఏర్పాటు చేయాల్సి ఉండగా 2 కిలోమీటర్ల మేర రెండు వరసల రహదారి, ఒక కిలోమీటర్‌ ఒక వరస రహదారి వేసి వదిలిలేశారు. 2016లోనే ఈ రోడ్డు పనులకు రూ.22 కోట్లు మంజూరయ్యాయి. 2018 నాటికి ఈ పనులు పూర్తి కావాలి. గుత్తేదారు పనులు చేయకపోవడంతో ఈ రోడ్డు అధ్వానంగా మారింది. వర్షం పడితే ఈ రోడ్డు వెంట రాకపోకలు సాగించే వాహనదారులు నరకం చూస్తారు.


ఈ చిత్రంలో కనిపిస్తున్న రోడ్డు నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రం నుంచి పాతపల్లికి వెళ్లేది. 2009 సంవత్సరంలో రూ.1.90 కోట్లను ఖర్చు చేసి 6 కిలోమీటర్ల మేర నిర్మించారు. గతేడాది కురిసిన వర్షాలకు అక్కడక్కడా గుంతలు పడింది. ఇటీవల పడిన వర్షాలతో మరింత గుంతలు ఏర్పడ్డాయి. మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు కావడంతో నిత్యం వందల సంఖ్యలో వాహనదారులు ఈ రోడ్డు వెంబడి ప్రయాణిస్తుంటారు. ప్రధానంగా రాత్రిళ్లు తాము ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


గతేడాది నుంచే..

* పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలోని 79 రహదారులు  గతేడాది పడిన వర్షాలకు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటి వరకు నిధులు రాకపోవడంతో చాలా గ్రామీణ రహదారులు గుంతలు పడి రాకపోకలకు ఆటంకంగా మారాయి.  
* జోగులాంబ గద్వాల జిల్లాలో ధరూరు, రాజోలి, ఉండవెల్లి, మానవపాడు, కేటీదొడ్డి మండలాల పరిధిలో 42.82 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు దెబ్బతిన్నాయి.

* మహబూబ్‌నగర్‌ జిల్లాలో సీసీకుంట, దేవరకద్ర, అడ్డాకుల, మూసాపేట, జడ్చర్ల, నవాబుపేట, రాజాపూర్‌, బాలానగర్‌, మిడ్జిల్‌, మహబూబ్‌నగర్‌, హన్వాడ మండలాల పరిధిలో 210.09 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయి.  
* నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో 12 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్‌ రోడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.
*నాగర్‌కర్నూల్‌  జిల్లాలో కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, తాడూరు, అచ్చంపేట మండలాల పరిధిలో 12.70 కిలోమీటర్లు.  
* వనపర్తి జిల్లాలో చిన్నంబావి, పానగల్‌, కొత్తకోట, పెద్దమందడి, పెబ్బేరు, గణపూర్‌, వనపర్తి మండలాల పరిధిలో 93.46 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు ధ్వంసమయ్యాయి.


ఈ నెలలో పడిన వర్షాలకు దెబ్బతిన్న రహదారులు

* నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి నుంచి డిండి వరకు 2.50 కిలోమీటర్లు.
* నారాయణపేట జిల్లా ఊట్కూరు, నర్వ, మద్దూరు మక్తల్‌, ధన్వాడ, నారాయణపేట మండలాల పరిధిలో మొత్తం 69.40 కిలోమీటర్లు.
* మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలోని పుట్టపల్లి నుంచి రాచాల, సీసీకుంట మండలంలోని నెల్లికొండి నుంచి సీతారాంపేట వరకు 6.05 కిలోమీటర్లు.
* వనపర్తి జిల్లాలోని పెద్దమందడి, పెబ్బేరు, కొత్తకోట, ఘనపురం మండలాల పరిధిలో 13 కిలోమీటర్లు.
* జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం  ఈ వర్షాలు గ్రామీణ రోడ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెద్దకారుపాముల నుంచి అంబడిపల్లి గ్రామీణ రహదారి ఇలా..


మరమ్మతులు చేపడుతున్నాం

 నెలలో పడిన వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రహదారుల వివరాలు సేకరించి మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపించాం. చిన్నచిన్న మరమ్మతులు ఉంటే స్థానిక నిధుల నుంచి బాగు చేస్తున్నాం. గతేడాది వర్షాలకు కొన్ని చోట్ల మరమ్మతులు చేపట్టాం. బాగా దెబ్బతిని అధిక నిధులు అవసరయ్యే చోట ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే పనులు పూర్తి చేస్తాం. కొన్ని చోట్ల టెండరు పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.

- శివకుమార్‌, ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌ శాఖ, మహబూబ్‌నగర్‌


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని