రభళా...ఇదీ దారుల వరుస !
close
Published : 30/07/2021 04:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రభళా...ఇదీ దారుల వరుస !

అడుగడుగునా గోతులతో అవస్థలు

ప్రమాదాల బారిన వాహన చోదకులు

తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్న అధికారులు

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, జమ్మలమడుగు, కమలాపురం, పులివెందుల, బద్వేలు, సుండుపల్లి : జిల్లాలో రహదారులు, భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ ఆధ్వర్యంలోని పలు రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. అడుగడుగునా గోతులమయంగా మారడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి. కనీసం గోతులు కూడా పూడ్చకపోవడంతో వాహనచోదకులకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఫలితంగా జిల్లావ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారులు, భవనాలశాఖ సర్కిల్‌ పరిధిలో కడప, రాజంపేట, ప్రొద్దుటూరు, పులివెందుల డివిజన్లు ఉన్నాయి. వీటిల్లో మొత్తంగా 4791.116 కిలోమీటర్ల పొడవునా రహదారులు ఉన్నాయి. గతేడాది నివర్‌ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు 147 రహదారుల్లో 521.38 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. తాత్కాలికంగా గోతులు పూడ్చినా ఇటీవల కురిసిన వర్షాలకు మళ్లీ దెబ్బతిన్నాయి. శాశ్వత మరమ్మతులకు రూ.231.38 కోట్లు అవసరం కాగా, నిధుల కొరతతో ప్రభుత్వం మంజూరు చేయట్లేదు. గత రెండేళ్లలో రహదారుల నిర్వహణ పనులు చేపట్టిన గుత్తేదారులకు ఇప్పటివరకు డబ్బులు చెల్లించని పరిస్థితి నెలకొంది. మొత్తం రూ.2 కోట్లకుపైగా బకాయిలున్నట్లు సమాచారం. మిగతా జిల్లాలతో పోలిస్తే కొత్తగా పనులకు టెండర్లు పిలిస్తే కొందరు గుత్తేదారులు ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో త్వరగా డబ్బులు రాబట్టుకోవచ్చుననే ఉద్దేశంతో వారు ఆసక్తి చూపుతున్నారు.

మా దృష్టికి తీసుకొస్తే చర్యలు

జిల్లాలో ఏటా రహదారుల నిర్వహణ పనులు చేపడుతున్నాం. మా శాఖ పరిధిలోని రహదారులు చాలావరకు బాగున్నాయి. ఎక్కడా గోతులేర్పడిన పరిస్థితి లేదు. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందులుంటే మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. - మాధవి, డిప్యూటీ ఎస్‌ఈ, రహదారులు, భవనాలశాఖ, కడప 

మూడేళ్లుగా ఇబ్బందులే

ఎక్కడి నుంచి ఎక్కడికి : జమ్మలమడుగు మండల కేంద్రం నుంచి తాడిపత్రి వరకు

ఎన్ని కిలోమీటర్లు :  45

తాజా పరిస్థితి :  కడప జిల్లా పరిధిలో 25 కిలోమీటర్ల రహదారి ఉంది. ఇందులో సుమారు 15 కిలోమీటర్ల మేర దెబ్బతింది. గత మూడేళ్లుగా ఈ పరిస్థితి ఉండడంతో జమ్మలమడుగు, మైలవరం, తాడిపత్రి మండలాల మధ్య రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది.

మంజూరైన నిధులు : మరమ్మతులకు రూ.7 కోట్లు మంజూరయ్యాయి. సుమారు నెలరోజుల కిందట టెండర్లు పూర్తి చేసినా ఇంకా పనులు ప్రారంభించలేదు. గతంలో పలుమార్లు తాత్కాలిక మరమ్మతులు చేశారు.

రెండు మండలాలకూ అవస్థలే

ఎక్కడి నుంచి ఎక్కడికి :● సింహాద్రిపురం మండలం బలపనూరు నుంచి పులివెందుల మండలం రాయలాపురం వరకు

ఎన్ని కిలోమీటర్లు : ●10

తాజా పరిస్థితి : బలపనూరులో అర కిలోమీటరు మేర రహదారిపై పెద్ద పెద్ద గోతులేర్పడ్డాయి. గోతుల్లో వర్షపు నీరు నిలుస్తుండడంతో అటువైపుగా రాకపోకలు సాగించే సింహాద్రిపురం, పులివెందుల మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ఆరేళ్లుగా ఈ రహదారి మరమ్మతులకు నోచుకోలేదు.

మంజూరైన నిధులు : దీంతోపాటు మరో రహదారికి మరమ్మతులు చేసేందుకు నిధులు మంజూరయ్యాయి. ఇటీవల రూ.1.80 కోట్ల విలువైన పనులకు టెండరు ప్రక్రియ పూర్తయింది. పనులు ప్రారంభించాల్సి ఉంది.

కాలజ్ఞాని క్షేత్రానికి వెళ్లడానికి అష్టకష్టాలే

ఎక్కడి నుంచి ఎక్కడికి : బద్వేలు మండలంలోని నందిపల్లె నుంచి బ్రహ్మంగారిమఠం మండల కేంద్రానికి

ఎన్ని కిలోమీటర్లు : 24 కిలోమీటర్లు

తాజా పరిస్థితి :  గత ప్రభుత్వ హయాంలో బ్రహ్మంగారిమఠం మండలం పెద్దిరాజుపల్లె వరకు 10 కిలోమీటర్ల మేర నూతనంగా రహదారి నిర్మించారు. మిగిలిన 14 కిలోమీటర్ల మేర వర్షాలకు దెబ్బతింది. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న బ్రహ్మంగారి మఠానికి వెళ్లడానికి భక్తులు, ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

మంజూరైన నిధులు : రహదారి అభివృద్ధికి రూ.24 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇప్పటివరకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. తాత్కాలిక మరమ్మతులు కూడా నిర్వహించలేదు.

మోకాలి లోతున... 

ఎక్కడి నుంచి ఎక్కడికి : కమలాపురం మండలం చిన్నచెప్పలి నుంచి ఎర్రబల్లె వరకు

ఎన్ని కిలోమీటర్లు : 12

తాజా పరిస్థితి :  అయిదు కిలోమీటర్లకుపైగా రహదారి దెబ్బతింది. పలు చోట్ల మోకాలి లోతున గోతులేర్పడ్డాయి. వర్షం కురిస్తే ఎక్కడ గొయ్యి ఉందో తెలియక వాహనచోదకులు కిందపడుతుండడంతో దెబ్బలు తగిలిన సందర్భాలున్నాయి. చిన్నచెప్పలి, లేటపల్లె, పొడదుర్తి, వెంకటాపురం, వై.కొత్తపల్లె, ఎర్రబల్లె గ్రామాలకు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది.

మంజూరైన నిధులు : రెండేళ్ల కిందట రూ.2 కోట్ల నిధులతో మరమ్మతులు ప్రారంభించారు. కేవలం 1.4 కిలోమీటర్లు మేర పనులు పూర్తవ్వగా.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రగతి లేని కారణంగా నిలిపివేసింది. ఇటీవల తిరిగి పనులు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. మరో 7 కిలోమీటర్ల దూరంతోపాటు వీరపునాయునిపల్లె మండల కేంద్రం వరకు రహదారిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.27 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇంకా టెండర్లు పిలవలేదు.

15 ఏళ్లవుతున్నా మరమ్మతులేవీ? 

​​​​​​​

ఎక్కడి నుంచి ఎక్కడికి : సుండుపల్లి మండలం తిమ్మసముద్రం నుంచి గుండ్లపల్లి వరకు

ఎన్ని కిలోమీటర్లు : 16

తాజా పరిస్థితి :  2001-02లో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో తారు రహదారి నిర్మించారు. 2005-06లో రహదారులు, భవనాలశాఖకు బదలాయింపు అయిన అనంతరం మరమ్మతులకు నోచుకోలేదు. గత నాలుగేళ్లుగా గోతుల రహదారిలోనే వాహనచోదకులు ప్రయాణిస్తున్నారు. సుమారు 1.5 కిలోమీటరు మేర దెబ్బతింది.

మంజూరైన నిధులు : రూ.2 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇంకా మంజూరు ఉత్తర్వులు రాలేదు. అప్పటిలోగా రూ.30 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపడతామని అధికారులు అంటున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని