అందరి సంక్షేమమే లక్ష్యం!
close
Updated : 30/07/2021 06:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందరి సంక్షేమమే లక్ష్యం!

‘ఈనాడు’ ముఖాముఖిలో కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: జిల్లాలో ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాం. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గింది. పాజిటివిటీ రేటు కూడా తక్కువగా ఉంది. అయినా ముప్పు తప్పినట్లు కాదు. మూడోదశ కరోనా విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడోవేవ్‌ ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. జగనన్న కాలనీలకు సంబంధించి గ్రౌండింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశాం. లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టరు నాగలక్ష్మి సెల్వరాజన్‌ వివరించారు. ఆమె ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా..

ఈనాడు డిజిటల్‌: కరోనా మూడోదశ ఎదుర్కొనేందుకు ఎలా సన్నద్ధమవుతున్నారు?

కలెక్టర్‌: రెండో దశతో పోలిస్తే మూడోదశలో రోజువారీ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందనే అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నాం. వీలైనన్ని పడకలకు ఆక్సిజన్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈసారి చిన్నపిల్లలపై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పీడియాట్రిక్‌ పడకలు కూడా పెంచుతున్నాం. సర్వజన ఆసుపత్రిలో ఇప్పటికే 50 పడకలు సిద్ధం చేశాం. 5 సంవత్సరాలలోపు పిల్లలున్న 1.50 లక్షల మంది తల్లులకు, 5 వేల మంది గర్భిణులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేశాం. వచ్చే నెలలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టీకా వేయిస్తాం. 5 శాతంపైగా పాజిటివిటీ రేటు ఉన్న గ్రామాల్లో స్థానికంగానే ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. మాస్కు ధరించకపోతే రూ.100, దుకాణాల్లో మాస్కు వేసుకోకపోతే యజమానులపై రూ.10 వేల నుంచి రూ.20 వేల జరిమానా విధిస్తున్నాం.

ఈనాడు డిజిటల్‌: గృహ నిర్మాణంలో మూడో ఆప్షన్‌ ఎంచుకున్న వారి పరిస్థితి ఏమిటి?

కలెక్టర్‌: జిల్లాలో ఎక్కువమంది లబ్ధిదారులు మూడో ఆప్షన్‌ ఎంచుకున్నారు. ఆప్షన్‌ మార్చుకునే వారికి ఇళ్లు నిర్మించుకోవడానికి అనుమతి ఇస్తున్నాం. మూడో ఆప్షన్‌కే మొగ్గుచూపుతున్న వారిని 10 మందిని ఒక బృందంగా ఏర్పాటు చేసి వారికి ఒక మేస్త్రిని అనుసంధానం చేస్తున్నాం. ఇలా చేయడం ద్వారా సామగ్రి కొనుగోలు, రవాణా ఖర్చులు చాలావరకు తగ్గుతాయి. దీనికి సంబంధించి మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కొందరిని గ్రూపులుగా కలిపి మ్యాపింగ్‌ చేస్తున్నాం.

ఈనాడు డిజిటల్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎంతమేర నష్టం జరిగింది?

కలెక్టర్‌: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు 23 గ్రామాల్లో ప్రభావం చూపాయి. ముఖ్యంగా వేరుసెనగ, వరి పంటలు దెబ్బతిన్నాయి. 294 రైతులకు సంబంధించిన 412 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 500 గొర్రెలు మృతి చెందాయి. నివేదికను ప్రభుత్వానికి పంపాం. వరదల సమయంలో బాధితులకు ఆహార పొట్లాలు, తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేశాం.

ఈనాడు డిజిటల్‌: కౌలు రైతులకు గుర్తింపు కార్డుల్లేక పంట రుణాలు అందడం లేదు?

కలెక్టర్‌: కౌలు రైతుల సమస్య ఇటీవలే నా దృష్టికి వచ్చింది. సీసీఆర్సీ కార్డుల జారీలో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించాం. దీనిపై భూ యజమానులకు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తాం. రుణం ఇవ్వాలని వచ్చిన ఏ రైతునూ వెనక్కి పంపొద్దని బ్యాంకర్లకు సూచించాం.

ఈనాడు డిజిటల్‌: జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలేమిటి?

కలెక్టర్‌: జిల్లాలో 400 పైగా లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి నీటి సరఫరా, విద్యుత్తు సౌకర్యం ఇప్పటికే కల్పించాం. ఇంకో 60 లేఅవుట్లలో చేయాల్సి ఉంది. శాశ్వత మౌలిక వసతుల కల్పన పెద్దఎత్తున చేపట్టాల్సి ఉంది. శాఖల వారీగా డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని పూర్తిచేసి ప్రభుత్వానికి పంపించాం. వాటికి సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది. లబ్ధిదారులు ఎక్కడా ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

ఈనాడు డిజిటల్‌: జిల్లాలో ఇసుక సామాన్యులకు దొరకని పరిస్థితి?

కలెక్టర్‌: జిల్లా అవసరాలతో పోలిస్తే ఇసుక లభ్యత తక్కువగానే ఉంది. దానికితోడు వర్షాల కారణంగా తవ్వలేని పరిస్థితి నెలకొంది. గుత్తేదారు సంస్థతో సమీక్షించి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. జిల్లా అవసరాలకు అనుగుణంగా ఇసుక సరఫరా, నిల్వ చేయాల్సిన బాధ్యత గుత్తేదారు సంస్థపైనే ఉంటుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని