అన్నదాత ఆందోళన బాట
close
Published : 30/07/2021 05:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నదాత ఆందోళన బాట

పరిహారంపై చిత్తూరు- తచ్చూరు ఎక్స్‌ప్రెస్‌ వే బాధితుల నిరసన


చిత్తూరు- తాళంబేడు రహదారి మీదుగా వెళ్లనున్న చిత్తూరు-తచ్చూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే

చిత్తూరు-తచ్చూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే(716-బి) జిల్లాలోని ఎనిమిది మండలాల ప్రజల కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. రోడ్డు నిర్మాణానికి సర్వే ప్రారంభించినప్పటినుంచి పరిహారం పెంచాలంటూ అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం చెల్లిస్తేనే భూములు అప్పగిస్తామని చెబుతున్నారు. పంటపొలాలను కోల్పోతే తమ భవిష్యత్తు అగమ్యగోచరమవుతుందని ఆవేదన చెందుతున్నారు.

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు : కేంద్ర ప్రభుత్వం భారతమాల పరియోజన కింద చిత్తూరు- తచ్చూరు(తమిళనాడు రాష్ట్రం) మధ్య ఆరు వరుసల రోడ్డు(ఎన్‌హెచ్‌ 716బి) నిర్మించాలని నిర్ణయించింది. తద్వారా బెంగళూరు- చెన్నై మధ్య సరకు రవాణా వేగవంతంగా జరగడంతోపాటు చెన్నై సమీపంలోని రెండు నౌకాశ్రయాలకు సులభంగా అనుసంధానమవుతుందని భావిస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది మండలాల్లోని 46 రెవెన్యూ గ్రామాల మీదుగా ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం సాగనుంది. ఇప్పటివరకు ఎనిమిది గ్రామాల పరిధిలో భూసేకరణ అవార్డు పాస్‌ చేశారు. మరోవైపు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని పళ్లిపట్టు, ఊత్తుకోట, పొన్నేరి రైతులు కూడా పరిహారం విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

పట్టుబడుతున్న అన్నదాతలు

కొన్నిగ్రామాల్లో అధికారులు ప్రకటించిన పరిహారం రూ.16 లక్షలు ఉండగా.. రైతులు మార్కెట్‌ ధర ప్రకారం రూ.35 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో మూడేళ్లలో జరిగిన క్రయవిక్రయాలను తీసుకుని పరిహారం ప్రకటించారు. ఇది ఆమోదయోగ్యం కాదని ప్రస్తుత ధర ప్రకారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. భూములు కోల్పోతున్న రైతులు కొందరు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఉన్న జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. రెండు నెలలుగా ఆయా మండలాల్లో రైతులు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు.

ఎకరానికి రూ.35 లక్షలు ఇవ్వాలి

మాకున్న 7.5 ఎకరాలలో 3.5 ఎకరాలు ఎక్స్‌ప్రెస్‌ వే రోడ్డుకు పోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం అందులో చెరకు, వేరుసెనగ సాగు చేస్తున్నాం. ఏడాదికి రూ.2 లక్షల ఆదాయం వస్తోంది. ఎకరానికి మాకు రూ.16 లక్షల పరిహారం ప్రకటించారు. కానీ రూ.35 లక్షలు ఇస్తే భూమిని అప్పగిస్తాం.

- చరణ్‌, బూచినత్తం, విజయపురం మండలం

5 నుంచి పాదయాత్ర

రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించని పక్షంలో ఆగస్టు 5 నుంచి 12వ తేదీ వరకు 8 మండలాల్లోని గ్రామాల్లో బాధిత రైతులతో కలిసి పాదయాత్ర చేస్తాం. జాతీయ రహదారి నిర్మాణానికి సహకరించకుంటే రేషన్‌ కార్డు, పింఛన్‌ రద్దు చేస్తామని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇది సరికాదన్నారు. పరిహారం విషయంలో కూడా కొందరికి ఎక్కువగా, మరికొందరికి తక్కువగా ఇస్తున్నారు. - నారాయణ, సీపీఐ జాతీయ  కార్యదర్శి, బాధిత రైతు రైతులకు న్యాయం చేస్తాం

రైతులకు న్యాయం చేస్తాం.ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో గత మూడేళ్లలో జరిగిన క్రయవిక్రయాల సరాసరి ధర కన్నా రెట్టింపు పరిహారం ప్రకటించాం. - రేణుక, ఆర్డీవో, చిత్తూరు

 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని