చిగురించక ముందే... ఆశలు ఎండుతున్నాయ్‌!
close
Updated : 30/07/2021 05:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిగురించక ముందే... ఆశలు ఎండుతున్నాయ్‌!

జిల్లాపై కరుణించని వరుణుడు

15 మండలాల్లో లోటు వర్షపాతం


శ్రీకాకుళం గ్రామీణ మండలం పాత్రునివలసలో వెదజల్లిన విత్తనాలు మొలకెత్తక ఇలా..

జిల్లాపై ఈసారీ వరుణుడు శీతకన్ను వేస్తున్నాడు.. జూన్‌, జులై నెలల్లో విస్తారంగా కురవాల్సిన వర్షాలు ముఖం చాటేశాయి..  సాధారణ వర్షపాతానికి సరాసరి  14 శాతం తక్కువ నమోదైంది.. ఆయకట్టు భూముల్లో నాట్లు కళకళలాడుతుంటే, వర్షాధారంగా వేసినచోట్ల ఎండుముఖం పడుతున్నాయి.. విత్తనం మొలకెత్తించిన నేల ప్రస్తుతం బీడువారుతోంది.. గతేడాది వానలు సరిగ్గా కురవక వేలాది హెక్టార్లలో రైతులు పంట నష్టపోయారు. ఈసారి ఖరీఫ్‌ ఆరంభమైన రెండు నెలల్లోనే 15 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి..

 

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

* భామిని మండలంలో జులైలో ఇప్పటివరకు 370.7 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా కేవలం 203.6 మి.మీ. మాత్రమే పడింది. ఈ మండలంలో 45 శాతం లోటు నమోదైంది. ఫలితంగా వర్షాధారంగా వేసే పంటలన్నీ ఆలస్యమవుతున్నాయి.

* జి.సిగడాం మండలంలో జూన్‌లో 110 మి.మీ.కి 24 మి.మీ. మాత్రమే వాన పడింది. అప్పుడు 77.6 శాతం లోటు ఉంది. జులైలో 176 మి.మీ. కురవాల్సి ఉండగా 125 మి.మీ. మాత్రమే పడటంతో లోటు వర్షపాతం 47.8 శాతంగా నమోదైంది.

* కవిటి మండలంలో జూన్‌, జులైలో వాన 172, 201 మి.మీ. పడాల్సి ఉంటే 26, 153 మి.మీ. మాత్రమే పడింది. 50 శాతం లోటు కనిపిస్తోంది. ఫలితంగా మెట్ట ప్రాంతాల్లో వేసిన వర్షాధార పంటలన్నీ ఎండుముఖం పడుతున్నాయి.


జిల్లాలో మొత్తం 3.54 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూములుంటే వాటిలో కేవలం 1.95 లక్షల హెక్టార్లకు మాత్రమే నదులు, కాలువలు, చెరువులు, బావులు, తదితర వనరుల ద్వారా సాగునీరందుతోంది. మిగిలిన 1.59 లక్షల హెక్టార్ల భూములన్నీ వర్షాలపై ఆధారపడుతున్నవే. అయినా వీటిలో ఎక్కువ శాతం రైతులు వరినే ఎంచుకున్నారు. జులై ప్రారంభంలో వానలు బాగా కురవడంతో విత్తనాలను పొలాల్లో వెదజల్లారు. అడపాదడపా కురిసిన వర్షాలకు ఆ విత్తనాలన్నీ మొలకెత్తాయి. తర్వాత గడచిన 10 రోజుల నుంచీ సరైన వర్షాలు లేకపోవడంతో ఆయా భూములన్నీ బీడు వారుతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. గతేడాది తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు ఈ సారైనా మంచి దిగుబడులు వస్తాయని ఆశించారు. ఇప్పుడు వారి ఆశలన్నీ ఆడియాసలుగానే మిగిలిపోతున్నాయి.

పొందూరులో ఇదీ దుస్థితి..

లక్ష్యంలో 39 శాతమే పూర్తి

ఖరీఫ్‌ సీజన్‌లో నాట్లు వేయడానికి జూన్‌, జులై నెలలే అత్యంత కీలకం. జిల్లాలో మొత్తం 2.05 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తారు. దానిలో 75 శాతం పంటలు జులై నెలాఖరు నాటికే వేస్తారు. కానీ వర్షాలు సరిగా లేకపోవడంతో ఇప్పటివరకూ కేవలం 79,801 హెక్టార్లలో మాత్రమే వరినాట్లు వేశారు. ఇతర పంటలూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సీˆజన్‌లో అధికారులు నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం 39 శాతం భూములు మాత్రమే సాగులోకొచ్చాయి. మిగిలినవి ఇంకా రావాల్సి ఉంది. వర్షాలు సరిగా కురవకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది.


సరైన వర్షాలు లేవు...

జులైలో జిల్లా వ్యాప్తంగా 7197 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 6733 మి.మీ.కురిసింది. అయితే వర్షాధార భూములున్న ప్రాంతాల్లోనే తక్కువ వర్షపాతం నమోదైంది. గత పది రోజులుగా అసలు వర్షాలే లేవు. అప్పుడప్పుడూ మేఘాలు కనిపించిన గట్టి వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. కనీసం నాలుగైదు రోజులైనా మంచి వర్షాలు కురిస్తేనే గాని పంటలు నిలబడే పరిస్థితులు లేవు. గురువారం నుంచి మూడు రోజులపాటు ముసురు ఉంటుందని, వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించినా అదీ లేకుండా పోయింది. గురువారం జిల్లావ్యాప్తంగా కొంత ముసురు వాతావరణం కనిపించినా ఎక్కడా సరైన వర్షాలు కురవలేదు. పంటలు ఎండిపోతున్న తరుణంలో వరుణుడి కరుణ కోసం రైతన్నలు ఆకాశం వైపు చూస్తున్నారు.


ఏమీ అర్థం కావట్లేదు...

మా పొలంలో వరి వెదసాగు చేపట్టాం. 20 రోజుల క్రితం విత్తనాలు చల్లాం. తర్వాత కురిసిన రెండు వర్షాలకు అవి మొలకెత్తాయి. నీరు నిల్వ ఉండిపోయిన చోట విత్తనాలు మొలకెత్తలేదు. ఇప్పుడు అసలు వర్షాలు కురవకపోవడంతో నీరే లేదు. అప్పుడే భూములు బీడువారుతున్నాయి. మొలకలు ఎండుముఖం పడుతూ ఉన్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయంగా ఏమిచేయాలో అర్థం కావడం లేదు.

-గొండు అక్కమ్మ, రైతు, పాత్రునివలస


ఆగస్టు వరకూ నాట్లు వేసుకోవచ్చు

ఆగస్టు చివరి వరకూ వరినాట్లు వేసుకోవచ్చు. జులై ఆఖరి నాటికి అనుకున్న సాగు లక్ష్యాలు చేరుకోలేకపోయాం. ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు ఇబ్బంది లేదు. వర్షాధార సాగులోనే రైతులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో కొంత లోటు వర్షపాతం నమోదైంది. ఆరుతడి పంటల సాగు గురించి రైతులకు ఎప్పటికప్పుడు చెబుతూ అవగాహన కల్పిస్తున్నాం. ఆగస్టులోనూ వర్షాలు సరిగా కురవకపోతే అప్పుడు ప్రత్యామ్నాయ విధానాలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం.

-శ్రీధర్‌, జేడీ, వ్యవసాయశాఖ, శ్రీకాకుళంTags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని