రాళ్లపాడు.. బీళ్లు చూడు
close
Published : 30/07/2021 05:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాళ్లపాడు.. బీళ్లు చూడు

కదలిక లేని ఎడమ కాలువ పొడిగింపు పనులు
వలస బాటన ఆయకట్టు రైతులు
ఈనాడు డిజిటల్, ఒంగోలు; వలేటివారిపాలెం, న్యూస్‌టుడే


పొడిగించాల్సిన ఎడమ కాలువ ఇదే

గత పదేళ్లుగా ఆ ప్రాంతీయుల కల నెరవేరడంలేదు. అటు సాగునీరు, ఇటు తాగునీరు అందక పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కేవలం ఒకే ఒక్క కాలువ పొడిగింపు పనులు చేపడితే చాలు వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని వారు కోరుతున్నారు. భూసేకరణ జరిగినా అడుగు ముందుకు సాగకపోవడంతో ఆందోళన చెందాల్సి వస్తోంది. కందుకూరుకు జలప్రదాయినిగా ఉన్న రాళ్లపాడు రిజర్వాయర్‌ ఎడమకాలువ పొడిగింపు పనుల పరిస్థితి ఇది.. 

117 గ్రామాలకు
రాళ్లపాడు జలాశయం నుంచి కందుకూరు నియోజకవర్గంలోని 117 గ్రామాలకు తాగునీరు అందుతోంది. దీని కుడికాలువ కింద ఇప్పటికే 10 వేల ఎకరాలు సాగవుతోంది. మూడు కిలోమీటర్ల దూరం ఉన్న ఎడమకాలువ పరిధిలో ప్రస్తుతం 2 వేల ఎకరాలకు నీరందుతుంది. దీనిని మరో 13 కిలోమీటర్ల వరకు విస్తరిస్తే మూడు మండలాల్లోని ఊర చెరువులకు పుష్కలంగా నీరు చేరడమే గాక కాలువ కింద మరో 5 వేల ఎకరాలు సాగులోకి వస్తుంది. సమీప గ్రామాల్లో తాగునీటి సమస్యకూ పరిష్కారం దొరుకుతుంది. ఇదే ఆశతో కాలువ సాధన సమితితో పాటు రైతులు కొన్నేళ్లుగా నేతలు, అధికారులకు విన్నవిస్తున్నారు. అయినా కాలువ విస్తరణ పనులు ముందుకు కదలడంలేదు.

నిధులు విడుదలైనా నిస్తేజం
రాళ్లపాడు ఎడమకాలువ విస్తరణకు రూ.40 కోట్లు ఖర్చవుతుందని, 150 ఎకరాలు అవసరమని గతంలోనే గుర్తించారు. సోమశిల ఉత్తర కాలువ పొడిగింపుతో వచ్చే అదనపు నీటితో రాళ్లపాడు ఎడమకాలువ పరిధిలోని గంగపాలెం, చీమలపెంట, మాలకొండరాయునిపాలెం, విశ్వనాథపురం, వీఆర్‌కోట, కలవళ్ల, శాఖవరం, నలదలపూరు గ్రామాలకు నీటి సమస్య తీరుతుందని లెక్క వేశారు. 2012లో అప్పటి ప్రభుత్వం రూ.21.44 కోట్లు విడుదల చేసింది. సర్వే, డిజైనింగ్‌కు రూ.9.25 లక్షలు, భూసేకరణకు రూ.2.36 కోట్లు కేటాయించారు. అంచనాల తయారీకి గుత్తేదారుకు రూ.6.30 లక్షలు చెల్లించారు. 2013లో సర్వే పూర్తయింది. రైతులకు పరిహారం ఇవ్వలేదు. 2019లో మళ్లీ రూ.38కోట్లతో పనులకు జీవో తీసుకువచ్చారు. ఎన్నికలతో ప్రక్రియ ఆగిపోయింది. 8 నెలల క్రితం మళ్లీ ప్రతిపాదనలు వెళ్లాయి.

పనుల కోసం ఇతర రాష్ట్రాలకు..
పోకూరు చెరువు కింద దాదాపు 1200 ఎకరాల ఆయకట్టు ఉంది. గత పదేళ్లలో ఇక్కడ పూర్తిగా సాగయ్యింది కేవలం ఒక్కసారి మాత్రమే. బోర్లు ఉన్నవారు కొంతవరకు పంటలు వేస్తున్నారు.. మిగిలిన వారిలో వందలాదిమంది పనులు లేక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. రాళ్లపాడు ఎడమకాలువ పొడిగింపు చేపడితే ఈ చెరువుకు నీళ్లు వస్తాయని.. తిరిగి వచ్చి వ్యవసాయం చేయడానికి  వారు చూస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. 

అప్పుడే మా జీవితాల్లో వెలుగు
కాలువ కోసం భూమి ఇచ్చాం. ఏళ్లు గడుస్తున్నా ప్రకటనలే తప్ప పనులు జరగడంలేదు. నీటివసతి లేక పూర్తిగా మెట్ట పంటలపై ఆధారపడాల్సి వస్తోంది. పనులు జరిగితే మా జీవితాల్లో కొంత వెలుగు వస్తుంది. - గుర్రం నారయ్య, శాఖవరం
నాలుగైదేళ్లకు  ఒక పంటే
ఎడమకాలువ పొడిగిస్తామని 2012లో చెప్పారు. ఇంతవరకు పనులు జరగలేదు. దీంతో శాఖవరం గ్రామంలో దాదాపు 500 ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. వర్షాలపై ఆధారపడి నాలుగైదేళ్లకు ఒక పంట మాత్రమే వేస్తున్నాం. ప్రభుత్వం, నేతలు పట్టించుకుని త్వరగా కాలువను పొడిగించే పనులు చేపట్టాలి. - శ్రీనివాసులు, శాఖవరం

రాళ్లపాడు జలాశయం 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని