ప్రభుత్వ సరకు..అంగట్లో దొరుకు!
close
Updated : 30/07/2021 12:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వ సరకు..అంగట్లో దొరుకు!

పల్లెల్లో విస్తరించిన గొలుసు దుకాణాలు 
ఉచిత డోర్‌ డెలివరీతో పొరుగు రాష్ట్రాల మద్యం

ఔను.. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. నిత్యం జిల్లాలో కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల మద్యం పట్టుబడుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న గంజాయి గుప్పుమంటోంది. అధికారుల దాడుల్లో పట్టుబడుతోంది కొంతైతే.. మిగతాది చేరాల్సిన చోటుకు చేరిపోతోంది. ఏడాది కిందట వరకు మద్యం గొలుసు దుకాణాల జాడే లేని గ్రామాల్లో.. మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఈ గొలుసులు కడుతున్నదెవరు? ఎలా సాగుతోందీ గమ్మత్తు? సెబ్‌ యంత్రాంగానికి తెలియకుండానే ఇదంతా జరుగుతోందా? అనేది అందరి బుర్రలు తొలుస్తున్న ప్రశ్న.

ఈనాడు డిజిటల్, నెల్లూరు 

మొన్నటి వరకు ప్రశాంత ధామాలుగా విలసిల్లిన పల్లెల్లో మద్యం పరవళ్లు తొక్కుతోంది.. సారా గుప్పుమంటోంది.. ఇవి చాలదన్నట్లు గంజాయి పొగల మేఘాలు కమ్ముతున్నాయి. తెచ్చిన కూలి వ్యసనాలకు పోతుండటంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు వీధినపడే పరిస్థితి. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో.. మద్యం కేసులు ఇళ్లలో నిల్వ ఉంచుకుని అధిక ధరలకు విక్రయించిన సందర్భాలున్నాయి.

సర్వేపల్లి నియోజకవర్గంలో..
మనుబోలు: సర్వేపల్లి నియోజకవర్గంలోని పల్లెల్లో మద్యం గొలుసు దుకాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వెంకటాచలం, మనుబోలు, ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలాల్లో 21 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండగా.. విచ్చలవిడిగా మద్యం గొలుసు దుకాణాలు వెలిశాయి. క్వార్టర్‌ బాటిల్‌పై రూ.50 అదనంగా వసూళ్లు చేస్తూ విక్రయాలు సాగిస్తున్నారు. మనుబోలు మండలంలో మడమనూరు, వీరంపల్లి, మనుబోలు గ్రామాల్లో గొలుసు దుకాణాలు అధికంగా ఉన్నాయి. 

100కు పైగానే..
పొదలకూరు: మండలంలో 55 గ్రామాలుండగా.. ఒక్కో పల్లెలో రెండు, మూడు మద్యం గొలుసు దుకాణాలు కొనసాగుతున్నాయి. తాటిపర్తి, అమ్మవారిపాళెం, మహ్మదాపురం గ్రామాల్లో ఎక్కువగా నడుస్తున్నాయి. ఏడాది నుంచి ఈ వ్యవహారం జరుగుతోంది. బిరదవోలు పంచాయతీలో సారా తయారీ జోరందుకుంది. ప్రభుత్వ లైసెన్సు పొందిన ఆరు మద్యం దుకాణాలు ఉండగా వాటికి అనుబంధంగా 100కు పైగానే గొలుసు దుకాణాలు ఉన్నాయి.

కావలిలో కుప్పలుతెప్పలు..
కావలి: నియోజకవర్గంలో మద్యం గొలుసు దుకాణాలు మళ్లీ తెరుచుకున్నాయి. ప్రభుత్వ దుకాణాల్లోని సిబ్బంది చాటుమాటుగా మద్యం సీసాలు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పట్టణంలో గొలుసు దుకాణ నిర్వాహకులు మరో ముందడుగు వేసి మద్యాన్ని నేరుగా మందు బాబుల ఇళ్ల వద్దకే తీసుకెళ్లి అందజేస్తున్నారు. సెబ్‌ అధికారుల దాడుల్లో మూడు సీసాలతో వ్యక్తులు పట్టుబడుతున్నారేగానీ.. రహస్య స్థావరాలు మాత్రం వెలుగులోకి రావడం లేదు. 
కావలి మండలంలో దాదాపు 25 వరకు మద్యం గొలుసు దుకాణాలున్నాయి. అన్నగారిపాళెం పంచాయతీ మజరా కుమ్మరిపాళెంలో మద్యం గొలుసు విక్రయాలు జరుగుతుండటంతో అధికారులకు పలువురు స్థానికులు ఫిర్యాదు చేశారు. బోగోలు మండలంలోని 16 పంచాయతీల్లో దాదాపు 40 వరకు నడుస్తున్నాయి. 

గూడూరులో గుట్టుచప్పుడు కాకుండా..
కోట : నియోజకవర్గంలో మద్యం గొలుసు దుకాణాలు భారీగానే నిర్వహిస్తున్నారు. కోట మండలంలో 10, వాకాడులో 5, చిట్టమూరులో 5, చిల్లకూరులో 10 వరకు దుకాణాలున్నాయి. గూడూరు గ్రామీణ మండలంలో 10 వరకు ఉన్నాయి. కోట మండలంలో కోట దాదారాయిగుంట, వాకాడు, గూడూరులో గాంధీనగర్, చిల్లకూరులో ఎక్కువగా మద్యం గొలుసు దుకాణాలు నడుస్తున్నాయి.

కట్టు తెగని గొలుసు
కలిగిరి : మండలంలో 50కి పైగా మద్యం బెల్టుదుకాణాలు ఉన్నాయంటే అతిశయోక్తి  కాదు. కేవలం మండల కేంద్రమైన కలిగిరిలోనే 10కి పైగా మద్యం బెల్టుదుకాణాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల మద్యం తీసుకొచ్చి అధిక ధరలకు డోర్‌ డెలివరీలు చేస్తున్నారు.
ఉదయగిరిలో జోరుగా..
ఉదయగిరి: మండలంలో కొంత కాలం నుంచి మద్యం గొలుసు దుకాణాల జోరు పెరిగింది. ఉదయగిరిలో గండిపాళెం మార్గం, మెయిన్‌ బజారు, యాదవ వీధి ప్రాంతాల్లో అనధికార మద్యం విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వ దుకాణాలు మూసివేసిన తర్వాత ఒక్కో సీసాపై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఎర్రపల్లిగడ్డ, జి.అయ్యవారిపల్లి, అప్పసముద్రం, తిరుమలాపురం గ్రామాల్లోనూ గొలుసు దుకాణాలు కొనసాగుతున్నాయి. 

రోజుకు 20 కేసులు నమోదు చేస్తున్నాం 
- శ్రీలక్ష్మి, అడిషనల్‌ ఎస్పీ, సెబ్‌

జిల్లాలో అక్రమ మద్యం సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాం. రోజుకు దాదాపు 20 కేసులు నమోదు చేస్తున్నాం. వీటిలో మద్యం గొలుసు దుకాణాలవే 7 నుంచి 10 వరకు ఉంటున్నాయి. ఎవరైనా ఇతర రాష్ట్రాల మద్యం తీసుకొచ్చి విక్రయిస్తుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి గ్రామం నుంచి కచ్చితమైన సమాచారం అందేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నాం. ప్రజలు కూడా ఏదైనా సమచారం ఉంటే.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.  


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని