నగరదారి.. రూపు రేఖలు మారి
close
Published : 30/07/2021 06:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నగరదారి.. రూపు రేఖలు మారి

నాయుడు ఫంక్షన్‌ హాలు నుంచి కలెక్టరేట్‌ కూడలి వరకు రూ.6 కోట్లతో 66 అడుగుల రహదారికి ప్రతిపాదించారు. సగం పనులే జరిగాయి. ఇటీవల ఆర్‌అండ్‌బీ రూ.4 లక్షలతో బీటీ ప్యాచ్‌ వర్కు పనులు చేసింది. అయినప్పటికీ ఇంకా గోతులు ఉన్నాయి.

గుమ్చీ నుంచి దాసన్నపేట రైతు బజారు వరకు 66 అడుగుల రహదారి నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. 600 మీటర్లకు 400 మీటర్ల పనులు పూర్తయ్యాయి. యూనియన్‌ బ్యాంకు శాఖ వద్ద రహదారి ఛిద్రం కావడంతో వాహన చోదకులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు.

ఢక్కిన వీధి నుంచి బీపీఎం పాఠశాలకు వెళ్లే దారి అధ్వానంగా ఉంది. ఇది 20, 21, 22 డివిజన్ల పరిధిలో ఉండటంతో నిత్యం ట్రాఫిక్‌ రద్దీ ఉంటోంది. ఈ రోడ్డు వేసి చాలా రోజులు అయిందని, పైడితల్లి పండగ సమయంలో ప్యాచ్‌ వర్క్‌ పనులు చేశారని స్థానికులు అన్నారు.

కంటోన్మెంట్‌ గంజిపేట నుంచి కేఎల్‌పురం దారిలోని వై కూడలి హరిత విజయనగరం బోర్డు దగ్గర రహదారి పాడైంది. మురుగునీరు రోడ్డుపైనే పారుతోంది. ఇళ్ల వద్దకు మురుగు చేరుతుందని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు.

న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం, నగర ప్రజలకు రహదారులు గండంగా మారాయి. ఇక్కడ.. అక్కడ అని లేకుండా అన్ని చోట్ల రహదారులు గుంతలతో దర్శనమిస్తున్నాయి. వర్షాలు పడుతుండటంతో మరింత పెద్దవి అవుతున్నాయి. ఆదమరిచి వాటిని గమనించకుంటే గాయాల పాలయ్యే అవకాశం ఉంది. రహదారుల విస్తరణ పనులు ఆగిన చోట పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

నగరంలో కార్పొరేషన్‌, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ పరిధిలో దారులు ఉన్నాయి. 20 ఏళ్లు మన్నాల్సిన సీసీ దారులు, ఐదేళ్ల కాలపరిమితి గల బీటీ దారులకు నిర్వహణ సక్రమంగా లేదు. దీనికి తోడు నాణ్యత లోపాలు తదితర కారణాలతో వేసిన కొద్ది రోజులకే గోతులమయంగా మారి వాహన చోదకులు, పాదచారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రైల్వేస్టేషన్‌, పాల్‌నగర్‌, గాజులరేగ, పద్మావతినగర్‌, ద్వారకానగర్‌, సింగపూర్‌ సిటీ తదితర రహదారులు అధ్వానంగా మారాయి. కొన్నిచోట్ల గోతుల వద్ద ప్రమాదాలు జరుగుతుండటంతో ట్రాఫిక్‌ పోలీసులు స్టాపర్లను ఏర్పాటు చేశారు.

కంటోన్మెంట్‌ స్విమ్మింగ్‌ పూల్‌ దారిలోని ఎల్‌బీ కాలనీ వైపు వెళ్లే రహదారి ఇలా ఉంది. రహదారులు భవనాల శాఖ అతిథి గృహం, ఎత్తు బ్రిడ్జి వైపు వెళ్లడానికి ఇది ప్రధాన మార్గం. ఇది పాడవ్వడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని చోదకులు అంటున్నారు.

ప్యాచ్‌ వర్కులు 600

నగరంలో సీసీ, బీటీ ప్యాచ్‌ వర్కు పనులు 600 వరకు చేయాలని గుర్తించారు. దీనికి కోసం రూ.40 లక్షల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు.

మరమ్మతులు చేయిస్తాం

నగరంలో పాడైన రహదారులకు మరమ్మతులు చేయిస్తాం. 10 రోజుల వ్యవధిలో వాటిని ప్రారంభిస్తాం. ప్రభుత్వం నుంచి రహదారులు, కాలువల నిర్మాణాలకు నిధులు మంజూరు కావాలి. - ఎస్‌ఎస్‌ వర్మ, కార్పొరేషన్‌ కమిషనరు

రూ.14 కోట్లతో ప్రతిపాదనలు

విజయనగరం నియోజకవర్గ పరిధిలో అత్యవసర మరమ్మతుల కోసం రూ.40 లక్షలతో టెండర్లు పిలిచాం. మరికొన్ని ప్యాచ్‌ పనులను వివిధ నిధులతో చేయడానికి ప్రతిపాదించాం. గుత్తేదారులు ముందుకు రావడం లేదు. రహదారుల విస్తరణ పనుల పూర్తికి రూ.14 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. - టి.శ్రీనివాసరావు, డీఈఈ, ఆర్‌అండ్‌బీ విజయనగరం డివిజన్‌


 

 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని