చేనేత సిరి..తప్పింది గురి!
close
Published : 21/09/2021 03:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేనేత సిరి..తప్పింది గురి!

 నిధుల్లేక కొన్నేళ్లుగా మూతపడిన క్లస్టర్లు 
 కార్మికులకు అందని నైపుణ్యాభివృద్ధి శిక్షణ 
 తుప్పుపట్టిన విలువైన యంత్రాలు, సామగ్రి 
 దయనీయంగా నేత కుటుంబాల పరిస్థితి


మాధవరం చేనేత సమీకృత అభివృద్ధి పథకం భవనంలో వృథాగా యంత్ర సామగ్రి

దేశ, విదేశాల్లో పేరొందిన జిల్లాలోని చేనేత ఉత్పత్తులకు ఆధునిక సాంకేతికతను అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇతర వస్త్ర రంగాలను తట్టుకునే విధంగా అత్యాధునికమైన, సాంకేతిక పరమైన నైపుణ్యాలు అందించడంలో వెనుకంజ వేయడం కార్మికులకు శాపంగా మారింది.  చేనేత కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడంతోపాటు నూలు, ఇతర ముడిసరకు అందించేందుకు జిల్లాలో కొన్నేళ్ల కిందట అమల్లోకి తెచ్చిన క్లస్టరు విధానం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది.    
- న్యూస్‌టుడే, కడప గ్రామీణ, ఒంటిమిట్ట 

చేనేత వస్త్రాలకు జిల్లా పెట్టింది పేరు. తరతరాలుగా నేతన్నలు కళాత్మక చీరల తయారీతో ఎంతో గుర్తింపు పొందారు. జిల్లాలో 192 చేనేత సహకార సంఘాల్లో 12 వేల మంది కార్మికులుండగా, సంఘాల బయట మరో 15 వేల మంది వరకు ఉన్నారు. జమ్మలమడుగు, మైలవరం, ప్రొద్దుటూరు, ఖాజీపేట, మైదుకూరు, రాజంపేట, బద్వేలు, వీరబల్లె, తదితర ప్రాంతాలతోపాటు జిల్లావ్యాప్తంగా చేనేత వృత్తిపై ఆధారపడిన కార్మిక కుటుంబాలున్నాయి. ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులకు రాయితీలిచ్చి ఆర్థికంగా భరోసానిచ్చి సాంకేతిక దిశగా నడిపించేందుకు కొన్నేళ్ల కిందట క్లస్టరు విధానం అమలైంది. ఇందులో భాగంగా జిల్లాలో ఏర్పాటైన క్లస్టర్లు కొంతకాలంపాటు బాగానే సేవలందించినా అనంతరం మూతపడ్డాయి. 
మరుగున పడిన మాధవరం క్లస్టరు...
జిల్లాలో సిద్దవటం మండలం ఎస్‌కేఆర్‌ నగర్‌లో 2005లో ‘మాధవరం చేనేత సమీకృత అభివృద్ధి పథకం (ఇంటిగ్రేటెడ్‌ హ్యాండ్‌లూమ్‌ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం) కింద మెగా యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అధునాతన వసతులతో భవనాలు నిర్మించారు. యంత్ర సామగ్రి తెప్పించి అమర్చారు. సుమారు రూ.2 కోట్లతో పనులు పూర్తి చేశారు. కార్మికులు మరింత కళాత్మకంగా ఉత్పత్తి చేసే విధంగా కొత్త హంగులు, విభిన్న రంగులపై కార్మికులకు అవగాహన కల్పించారు. సృజనాత్మకతను జోడించి ఆధునిక వస్త్రరీతులతో నవ్యత, నాణ్యత, నాజూకుతనంతో కొంగొత్త ఆకృతులపై శిక్షణ ఇచ్చారు. ఇక్కడి వస్త్రాలకు ప్రాచుర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాయితీపై మగ్గాలు, జకార్డ్‌ యంత్రం, డాబీలు, అచ్చు-పన్నె, ముడి నూలు, ఇతర రకాలు తక్కువ ధరకే ఇస్తామన్న హామీలతో కార్మికుల్లో ఆశలు చిగురించాయి. ఆరంభంలో అధికార యంత్రాంగం చేసిన ఆర్భాటం చూసి ఎంతో మేలు జరుగుతుందని నేతన్నలు భావించారు. అధికారులు కూడా నిపుణులను పిలిపించి శిక్షణ ఇప్పించారు. సొంత మగ్గం లేని వారు ఇక్కడే నేత పని చేసుకునే విధంగా అనుమతిచ్చారు. ఇంటిల్లిపాది శ్రమించి నేసిన చీరలకు విపణిలో మంచి ధరలు దక్కడం లేదు. మద్దతు రాలేదని దిగులు చెందకుండా ఇక్కడే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చేనేత కార్మికుల నుంచి అప్పట్లో కొన్నారు. నాడు ఆప్కో అధికారులు పర్యవేక్షణ చేశారు. ప్రారంభమైన రెండేళ్లలోపే కాసుల కష్టమై నిర్వహణ భారమై మూసివేశారు. మూతపడిన అనంతరం చేనేత, జౌళి శాఖకు అప్పగించారు. ఇక్కడున్న విలువైన యంత్ర పరికరాలు తుప్పు పట్టగా, నూలు వడికే పెద్ద రాట్నాలు, మగ్గాలు మూలకు చేరాయి. నూలు, నాణ్యత పరీక్షలు చేయడానికి తెప్పించిన యంత్ర సామగ్రి వృథాగా పడి ఉంది. రంగులద్దకం విభాగం (డైయింగ్‌ యూనిట్‌), బాయిలర్లు, డ్రస్సింగ్‌ యంత్రాలు దెబ్బతిన్నాయి. 
మిగిలినవాటి పరిస్థితి దయనీయమే... 
* 2016-17లో జమ్మలమడుగు మండలం మోరగుడి, తిరుమల, మైలవరంలో శివాలయం నగర్, ఖాజీపేట మండలం డయాంఖాన్‌పల్లెల్లో ఒక్కొక్క క్లసరుకు రూ.1.80 కోట్లు చొప్పున కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడత కింద రూ. 16 లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతో కార్యక్రమం మమ అనిపించారు. అనంతరం నిధులు రాకపోవడంతో పథకం కనుమరుగైంది.* 2017-18లో మరో మూడు క్లస్టర్లు వచ్చాయి. మైదుకూరు మండలం మైదుకూరు, ఖాజీపేట మండలం అప్పనపల్లె, జమ్మలమడుగులో శ్రీనివాస పేర్లతో క్లస్లర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కొక్క క్లస్టరుకు రూ.1.80 కోట్లు చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే తొలివిడతగా రూ.35 లక్షలు మాత్రమే వచ్చాయి. అనంతరం ఒక్క రూపాయి రాలేదు.*  2016-17లో వచ్చిన నాలుగు క్లస్టర్లు, 2017-18లో వచ్చిన మూడు క్లస్టర్లు ఎన్‌హెచ్‌డీపీ (నేషనల్‌ హాండ్‌లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) కింద వచ్చాయి. క్లస్టర్లన్నీ నిధుల్లేక మూత పడడం, కొత్తవి జాడే లేకపోవడంతో కార్మికులకు నష్టం వాటిల్లుతోంది. 
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
మాధవరం చేనేత సమీకృత అభివృద్ధి పథకం (క్లస్టరు) ఏడేళ్ల కిందట మూతపడినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఉన్నత స్థాయి నుంచి అనుమతులొస్తే ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. నిధులు మంజూరు చేస్తే వినియోగంలోకి తీసుకొస్తాం. మిగిలిన క్లస్టర్ల పరిస్థితిపై కూడా నివేదిస్తాం.  
- దేవరకొండ కృష్ణ, ఏడీ, చేనేత, జౌళిశాఖ.

చేనేతలకు మేలు చేసేందుకు ఏర్పాటు
మాధవరం క్లస్టరు ఏడేళ్ల కిందట మూతపడింది. తిరిగి తెరిపించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఎలాంటి ఫలితం లేదు. విలువైన యంత్రాలు, సామగ్రి వృథాగా పడి ఉన్నాయి. వీటికి భద్రత లేకుండా పోయింది. - గంజి సుబ్బరాయుడు, క్లస్టరు ఛైర్మన్, మాధవరం చేనేత సమీకృత అభివృద్ధి పథకం   


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని