రక్తహీనత పీడిస్తోంది
close
Published : 21/09/2021 03:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రక్తహీనత పీడిస్తోంది

గర్భిణులు, బాలింతల్లో లోపం

ఆకుకూరలు.. కూరగాయలతో ఆరోగ్యం

జిల్లాలో పౌష్టికాహార వారోత్సవాలు

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: పౌష్టికాహార లోపం గర్భిణులు, బాలింతలను వేధిస్తోంది. దీంతో అనారోగ్య రుగ్మతలు చుట్టుముడుతున్నాయి. కనీస రక్తశాతం(హెచ్‌బీ) కూడా ఉండటం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో, పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా తగిన ఆహారం, నగదు పంపిణీ సాగుతున్నా పౌష్టికాహార లోపం తగ్గడం లేదు. రెండు మూడు గ్రాముల హెచ్‌బీతో గర్భిణులు ఆస్పత్రులకు వెళ్తున్న దయనీయ పరిస్థితి. పేదరికం.. అవగాహన లోపం.. మూఢనమ్మకాలూ పౌష్టికాహార లోపం తలెత్తడానికి ఓ కారణం అవుతున్నాయి. యుక్త వయసు బాలికలు, గర్భిణుల్లో ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపుతోంది. రక్తహీనత తగ్గించాలన్న సంకల్పంతో వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అధికార యంత్రాంగాల్లో అంకిత భావం, చిత్తశుద్ధి కొరవడటమే కాదు.. అక్రమాలూ జరుగుతుండటంతో అరకొర పౌష్టికాహారమే అందుతోంది. ఏటా మాదిరే ఈదఫా కూడా సెప్టెంబరు 1 నుంచి 30వ తేదీ దాకా ‘పౌష్టికాహార మాసోత్సవం’ నిర్వహిస్తున్నారు. జిల్లా అంతటా విస్తృతంగా కొనసాగాల్సి ఉంది. ప్రజల్లో తగిన అవగాహన కల్పించాలన్న శ్రద్ధ సంపూర్ణంగా కనిపించలేదు.

లోపం.. పర్యవసానం

36 శాతం గర్భిణులు క్రమంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం లేదు.

10-19ఏళ్ల మధ్య కిశోర బాలికల్లో 3.57 శాతం రక్తహీనత ఉంది.

5ఏళ్లలోపు పిల్లలు 19.81 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు.

5ఏళ్లలోపు వయసుకు తగ్గ ఎత్తులేని చిన్నారులుల 21.39 శాతం మంది.

5ఏళ్లలోపు ఎత్తుకు తగ్గ బరువులేని పిల్లలు 7.86 శాతం ఉన్నారు.

16.36 శాతం గర్భిణుల్లో తగిన మోతాదులో రక్తశాతం లేదు.

32శాతం మహిళల్లో, 28 శాతం కిషోర బాలికల్లో పౌష్టికాహార లోపం ఉంది.

3.32లక్షల మంది లబ్ధిదారులు

జిల్లా వ్యాప్తంగా 5,126 అంగన్‌వాడీ కేంద్రాల్లో 3.32లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో గర్భిణులు 41,463 మంది, బాలింతలు 33,034 మంది ఉండగా.. ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 1,48,661 మంది, 3-6ఏళ్లలోపు చిన్నారులు 1,09,017 మంది చొప్పున ఉన్నారు. వీరికి ఏటా రూ.కోట్లలో ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్కరికి నెలకు 26కోడిగుడ్లు, పాలు, బియ్యం, కందిపప్ఫు. ఇలా నిత్యావసర సరకులు ఇస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, మూడేళ్ల పైబడిన పిల్లలకు కేంద్రాల్లోనే ఒక పూట భోజనం పెడుతున్నారు. అయినా సరే తగిన బరువు, ఎత్తు ఉండటం లేదు. తగిన రక్తశాతం నమోదు కావడం లేదు. గర్భిణి, బాలింతల్లో తగిన పౌష్టికాహార లోపం వల్ల పుట్టిన బిడ్డల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరగడం లేదు.

ఇవి తింటే సురక్షితం

రోజూ ఉదయమే పాలు, ఉడకబెట్టిన గుడ్డు తినాలి.

రాగి జావ తాగితే చాలా మంచిది.

పల్లెల్లో లభించే తాజా ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి.

అంగన్‌వాడీ, పాఠశాలల్లో ఇచ్చే చిక్కీలు తప్పక తినాలి.

మాంసం, ధాన్యాలతో కూడిన ఆహారం కూడా తీసుకుంటే మరీ మేలు.

ఐరన్‌, ప్రొటీన్లు, మాంసకృత్తులు లభించే వాటిని తీసుకోవాలి.

రోజూ అందిస్తున్నాం..

- సుజన, పీడీ, ఐసీడీఎస్‌

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా రోజూ నిర్దేశిత మోతాదులో పుష్కలంగా పౌష్టికాహారం అందిస్తున్నాం. వైద్య నిపుణులు, పౌష్టికాహార నిపుణులు నిర్దేశించేలా రోజూ పాలు, కోడిగుడ్డు ఇస్తున్నాం. ఒక పూట మధ్యాహ్నం ఆకుకూరలు, కూరగాయలతో కూడిన ఆహారం అందిస్తున్నాం. రక్తహీనత, హెచ్‌బీ తక్కువ ఉన్న గర్భిణి, బాలింతల కోసం సంపూర్ణ పోషణ కింద ఆరు రకాల సరకులు ఇస్తున్నాం. ఇవన్నీ ఐరన్‌, రక్తశాతం పెంపొందిస్తాయి. అవసరమైన వారికి అదనపు ఆహారం కూడా ఇస్తున్నాం. అక్కడక్కడ చిన్నచిన్న లోపాలు ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు సరిచేస్తున్నాం.

పేదలకు ఇలాంటి ఆహారం ఎలా?

- సౌమ్య, గర్భిణి, లక్ష్మంపల్లి, శెట్టూరు

తొలి కాన్పు కోసం వచ్ఛా మేము పేదోళ్లం పౌష్టికాహారం తీసుకోవాలంటే గగనమే. ఇంట్లో ఉన్నదే తింటున్నాం. అంగన్‌వాడీ కేంద్రం ద్వారా కోడిగుడ్లు, పాలు ఇస్తున్నారు. వాటిని క్రమంగా తీసుకుంటున్నాం. ఇప్పుడు నాకు ఆరు గ్రాముల హీమోగ్లోబిన్‌(హెచ్‌బీ) శాతం ఉందంట. పెరిగేందుకు ఎలాంటి ప్రత్యేక ఆహారం తీసుకోవడం లేదు. ఉన్న ఆహారమే తింటున్నా. ప్రత్యేకంగా తీసుకోవాలంటే అదనంగా ఖర్చు చేయాల్సివస్తోంది.

గుర్తించకపోతే హానికరం

- ఆచార్య షంషాద్‌బేగం, హెచ్‌ఓడీ, స్త్రీవ్యాధుల వైద్య విభాగం, సర్వజనాస్పత్రి

కౌమార దశ బాలికలు, గర్భిణుల్లో ఎక్కువగా పౌష్టికాహార లోపం ఉంటుంది. యుక్తవయసు బాలికల్లో ప్రతి నెలా రుతుక్రమం క్రియ కారణంగా రక్తస్రావం జరుగుతుంది. గర్భిణుల్లోనూ రక్తశాతం తక్కువ ఉంటే కడుపులో పెరిగే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం ఉంటుంది. అందుకే తాజా ఆకుకూరలు, కూరగాయలు బాగా తినాలి. ఐరన్‌, పోలిక్‌యాసిడ్‌, ప్రొటీన్లు తగినంత ఉండాలి. లేదంటే.. అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ప్రతి ఆడపిల్ల, మహిళల్లో కనీసం 11 శాతం హెచ్‌బీ ఉండాలి. ఆస్పత్రికి వచ్చే వారిలో సగానికి సగం మందిలో ఈ శాతం ఉండటం లేదు. పౌష్టికాహార లోపం, హెచ్‌బీ తక్కువ ఉంటే.. రక్తహీనత, ఆయాసం, గుండెదడ, కాళ్ల వాపులు, మూత్రపిండాలు దెబ్బతినడం.. వంటి కీలక రుగ్మతలు సోకుతాయి. తుదకు ప్రాణహాని కలుగుతుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని