గురజాడ అడుగుజాడల్లో...
close
Updated : 21/09/2021 06:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గురజాడ అడుగుజాడల్లో...

గురజాడ స్వగృహానికి ముస్తాబు

గురజాడ అప్పారావు. ఈపేరు వినని తెలుగువారుండరు. గ్రాంథికభాషలో నిక్షిప్తమైన జ్ఞానసంపదను జన సామాన్యానికి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సాహిత్య ఉద్యమాన్ని నిబద్ధతతో నిర్వర్తించిన యోధుడు. దురాచారాలను తన రచనలతో కడిగి పారేసిన సంస్కర్త. అధికారం తలకెక్కి విషం కక్కిన పాలనాగులపై తిరుగుబావుటా ఎగరేసే శక్తి సంపత్తిని మహిళా లోకానికి అందించిన వైతాళికుడు. ఆధునిక కథకు ఆద్యుడు. దేశమంటే మట్టికాదని ప్రబోధించిన దేశభక్తుడు. తెలుగుసీమలో మహాకవి... మన గురజాడ. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనమిది. -న్యూస్‌టుడే, పార్వతీపురం, కంటోన్మెంట్‌

చరిత్రను తిరగ రాస్తుంది: మహిళల పట్ల, వారిశ్రమ, శక్తిపైన గురజాడకు అచంచలమైన విశ్వాసం ఉంది. ‘‘ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది’’అని ముని సుబ్రహ్మణ్యానికి రాసిన లేఖలో ప్రస్తావించారు. గురజాడ కథల్లో, రచనల్లో మహిళల పాత్రల్ని అంతే గొప్పగా మలిచారు. జిల్లాలో పాలనాపగ్గాలు మహిళామణులు అందుకున్నారు. కలెక్టరుగా సూర్యకుమారి, ఎసీ్పీగా దీపికాపాటిల్‌ పాలనా రక్షణ విభాగాల్లో తమదైన ముద్ర వేసే బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో పరిషత్తు ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో 17 మండలాల్లో ఎంపీీపీీలుగా మహిళలే ప్రత్యేక భూమిక పోషించనున్నారు. మండలాల ప్రగతి రథాన్ని పరుగులెత్తించే కార్యభారాన్ని భుజానకెత్తుకుని వారంతా కృషి చేయాలి. గురజాడ మహిళాలోకంపై, వారి సమర్థతపై నింపిన నమ్మకానికి వాస్తవరూపం ఇవ్వాల్సిన బాధ్యత స్త్రీమూర్తులదే.

వ్యర్థకలహము పెంచ బోకోయ్‌.. కత్తి వైరము కాల్చవోయ్‌..: స్థానిక సంస్థల ఫలితాలు వెలువడ్డాయి. పోరు అన్న తర్వాత గెలుపు ఓటములు సర్వసాధారణాలు అనే నిజాన్ని పోటీదారులు గుర్తించాలి. ఎటువంటి భేషజాలకు పోకుండా, అందరూ సోదరప్రేమతో కలిసిపోవాలి. రాజకీయ కక్షలు, కార్పణ్యాలకు చరమగీతం పాడాలి. ఎన్నికై, పాలనాపరమైన అధికారాన్ని సొంతం చేసుకున్న వారు, జనహితాన్ని కోరే అభివృద్ధి పనులు చేపట్టాలి. సర్వజనులకు శాంతిని అందించే గురజాడ బాటలో పాలించి జాతిజనులకు మేలు చేయాలి. అప్పుడే ఆ మహాకవికి అసలైన నివాళి ఇచ్చినట్లవుతుంది.

అంతర్జాతీయ సదస్సుకు ఏర్పాట్లు

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: గురజాడ జయంతి సందర్భంగా విజయనగరం గురజాడ సాంస్కృతిక సమాఖ్య, చెన్నైకు చెందిన నవసాహితీ ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం అంతర్జాతీయ అంతర్జాల సదస్సు నిర్వహించనున్నట్లు సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్‌ తెలిపారు. ముఖ్యఅతిథులుగా కలెక్టర్‌ సూర్యకుమారి, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, నటుడు, రచయిత తనికెళ్ల భరణి, రచయిత సుద్దాల అశోక్‌తేజ తదితరులు పాల్గొంటారన్నారు. బెంగళూరుకు చెందిన పువ్వాడ వెంకటేష్‌కు ఉత్తమ కవితా పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సు లైవ్‌ను యూట్యూబ్‌ లింక్‌ ద్వారా వీక్షించవచ్చన్నారు.

ఇంకొన్ని...:

పౌర సంబంధాల శాఖ నిర్వహణలో గురజాడ గృహంలో కొనసాగుతున్న గ్రంథాలయ నిర్వహణను వారి కుటుంబీకులే చూడాల్సి వస్తోంది. మహాకవి రచనలు గ్రంథస్థం చేసి ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, ఆ మహనీయుడు వాడే వస్తువులను ప్రతి ఆరు నెలలకు కెమికల్‌ ట్రీట్‌మెంట్‌ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. గురజాడ దేశభక్తి గీతాన్ని పాఠశాలల్లో ఆలపించేందుకు కలెక్టర్‌ సూర్యకుమారి బడులకు ఆదేశాలు ఇచ్చారన్నది సంతోషించదగ్గ విషయమని గురజాడ కుటుంబీకులు జి.ప్రసాద్‌, ఇందిర తెలిపారు. మొక్కలు నాటిన క్రమంలో ట్రీగార్డులకు కూడా ఆ మహనీయుడి నినాదాలను ప్లకార్డుల ద్వారా ఏర్పాటు ఆమె చేస్తామనడం కూడా మంచి పరిణామమని వారు తెలిపారు.

జయంతి వేడుక

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు 159వ జయంత్యుత్సవాన్ని మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి తెలిపారు. గురజాడ స్వగృహంలో ఉదయం 9 గంటలకు ఆయన చిత్రపటానికి పూలమాలల అలంకరణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మహారాజ ప్రభుత్వ సంగీత కళాశాల సమీపంలోని గురజాడ కాంస్య విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జూమ్‌ ద్వారా పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల విద్యార్థులతో గురజాడ దేశభక్తి గేయాలాపన నిర్వహించనున్నామన్నారు. గురజాడ నడయాడిన విజయనగరంలో కలెక్టర్‌గా పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లావాసులకు, మహాకవి అభిమానులకు శుభాకాంక్షలు ఆమె తెలియజేశారు.

నరుల చమటలు తడిసి మూలము.. ధనము పంటలు పండవలెనోయ్‌..

గురజాడ స్వేదసౌరభాన్ని జాతి సౌభాగ్యాన్ని కాంక్షించారు. శ్రమతో చమటను చిందించినపుడే దేశ సంపద పెరుగుతుందని, అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసించారు. అదే తన రచనల్లో కూడా ఆయన చెప్పారు. జిల్లాలో ఉపాధిహామీ వేతనదారుల సంఖ్య గతంలో కంటే పెరిగింది. పని సంస్కృతి జిల్లాలో పెరిగిందనేందుకు దీన్ని నిదర్శనంగా చెప్పుకోవచ్ఛు వేతనదారులు ఎంతగా పనిలో భాగస్వాములైతే. అంతగా వస్తుభాగంగా సంపద పెరుగుతుంది. శ్రమతోనే అభివృద్ధి సాధ్యమవుతుందనే గురజాడ మాటలు సాకారమవుతాయి. ఈపని సంస్కృతి మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది.

గురజాడ ఆడిటోరియం ఏర్పాటు ఎప్పటికో..:

2015 మే నెలలో గురజాడ గృహాన్ని పురావస్తు శాఖ స్వాధీన పరుచుకుంది. నివాసానికి పక్కన ఖాళీగా ఉన్న నగర పాలక సంస్థ స్థలంలో ఆయనకు గుర్తుగా పురావస్తు శాఖ ఆడిటోరియం నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టింది. జిల్లా అధికారులు ప్రణాళికలు రచించారు. ఆడిటోరియానికి పురావస్తు శాఖకు నివేదిక పంపి సుమారు అయిదేళ్లు పూర్తయినా...నేటికీ దీని నిర్మాణం జరగలేదు. దీనిపై దృష్టి సారించాలని సాహితీవేత్తలు అంతా కోరుతున్నారు.

దేవుడెచటో...దాగెనంటూ..: మానవ సేవే మాధవ సేవనే సత్యాన్ని విశ్వసించిన స్ఫూర్తిదాత గురజాడ. ‘దేవుడెచటో దాగెనంటూ ..కొండకోనల వెతుకులాడేవేలా’’ అని ప్రశ్నించాడు. ఇప్పుడు గురజాడ ప్రశ్నకు సమాధానంగా సమాజాన్నే దేవాలయంగా చేసుకొని సేవలు చేస్తున్న సంస్థలు జిల్లాలో స్ఫూర్తిదాయక తీరును కొనసాగిస్తున్నాయి. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టే వితరణ శీలురు పలు వేదికలను ఏర్పాటు చేసి ముందుకు కదులుతున్నారు. పార్వతీపురం, విజయనగరం కేంద్రాల్లో ఆసుపత్రులు, బస్టాండ్లు వంటి ప్రధాన స్థలాల్లో ఆహారాన్ని అందించి ఫుడ్‌ బ్యాంకుల ద్వారా ఆకలి తీర్చుతున్నారు. రోగులకు వైద్యసేవలు అందిచడానికి వాహన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. మనిషిలో దేవుడ్ని చూసే దృష్టి కోణం ఇప్పుడు ప్రజల్లో పెరిగింది. గురజాడ స్వప్నించిన సమాజాన్ని సాకారం చేసే దిశగా యువతరం కూడా వడిగా అడుగులు కదుపుతోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని