కిట్‌ ఇచ్చారు.. నగదు మరిచారు
close
Updated : 21/09/2021 06:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కిట్‌ ఇచ్చారు.. నగదు మరిచారు

జిల్లాలో 20,039 మంది బాలింతల నిరీక్షణ

జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే

ర్కారు వైద్యంపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచి పేద ప్రజలకు ప్రసూతి భారం కాకూడదనే భావనతో ప్రభుత్వం బాలింతలకు నగదు పారితోషికం అందజేస్తోంది. దీనికి కేసీఆర్‌ కిట్‌ అదనంగా లభిస్తోంది. ప్రస్తుతం కేసీఆర్‌ కిట్‌ మాత్రమే ఆసుపత్రుల్లో కొనసాగుతున్నప్పటికీ ఏడాదిగా నగదు పారితోషికం నిలిచిపోవడంతో పేదవర్గాల మహిళలు నిరాశకు లోనవుతున్నారు.

గర్భందాల్చిన నాటి నుంచి ప్రసూతి వరకు ప్రభుత్వ వైద్య సేవలు పొందే మహిళలకు నగదు పారితోషికం పథకం వర్తింపజేస్తున్నారు. గర్భందాల్చిన 12 వారాల్లోపు ఏఎన్‌ఎం వద్ద నమోదైన వెంటనే రూ.3 వేలు, పాప పుడితే రూ.5 వేలు, బాబు పుడితే రూ.4 వేలు ఖాతాలో జమచేస్తారు. పుట్టిన పిల్లలకు మూడు ఇమ్యునైజేషన్‌ టీకాలు వేసిన తరువాత రూ.3 వేలు, 9 నెలల టీకా వేసిన తరువాత రూ.2 వేల చొప్పున నగదు అందజేస్తారు. ఈ లెక్కన మగపిల్లాడు పుడితే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేల ప్రయోజనం చేకూరుతుంది. కొన్నాళ్లపాటు నగదు పారితోషికం సజావుగా కొనసాగింది. పేద, సామాన్య కుటుంబాలు సైతం ఈ పథకానికి ఆకర్షితులై ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానికి ప్రాధాన్యమిచ్చారు. ఫలితంగా సర్కారు దవాఖానాల్లో ప్రసవాలు సైతం పెరిగాయి. గడిచిన ఏడాదిగా ఈ పథకం గర్భిణుల నమోదుకే పరిమితం కావడంతో బాలింతలను నిరాశకు గురిచేసింది.

తగ్గుతున్న ప్రసవాలు

2020 అక్టోబరు వరకు ప్రసవాలకు సంబంధించి నగదు పారితోషికం యథావిధిగా కొనసాగింది. 11 నెలలుగా ప్రభుత్వం ఈ పథకానికి నిధులు మంజూరు చేయకపోవడంతో కేవలం కేసీఆర్‌కిట్‌తో సరిపెట్టాల్సి వస్తోంది. జిల్లాలో గత 11 నెలలుగా మొత్తం 43,431 ప్రసవాలు నమోదయ్యాయి. ఇందులో ప్రయివేటు ఆసుపత్రుల్లో నమోదైన ప్రసవాలను పక్కనపెడితే 20,039 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించుకున్నారు. వీరెవరీకీ వారి ఖాతాల్లో నగదు జమకాకపోవడంతో నిరుత్సాహ పడుతున్నారు. ప్రసవ సమయంలో ప్రసవానంతరం ప్రభుత్వమిచ్చే నగదు పేద కుటుంబాల అవసరాలకు ఎంతగానో ఉపయోగపడింది. నగదు పారితోషికం లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య కొంతమేరకు తగ్గిందని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.


పైసా రాలేదు

- గాలిపెల్లి నవ్య, ఆరవెల్లి, పెగడపల్లి మండలం

మొదటికాన్పు కోసం 5 రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి వచ్చాం. మూడు రోజుల కిందట ఆడపల్లి పుట్టింది. 8 నెలల కిందట గ్రామంలో వైద్య సిబ్బంది వద్ద పేరు నమోదు చేసుకున్నాను. మూడుసార్లు డబ్బులు ఖాతాలో పడతాయని చెప్పారు. కానీ ఇప్పటి వరకు పైసా రాలేదు. మాలాంటి పేదలకు కాన్పు ద్వారా వచ్చే డబ్బులు ఎంతో ఉపయోగపడతాయని ఆశించినా ప్రయోజనం లేకపోయింది.


నిధులు మంజూరు కావాల్సి ఉంది

- పి.శ్రీధర్‌, జిల్లా వైద్యాధికారి

కొన్ని నెలలుగా నిధులు లేక ప్రసవానికి సంబంధించిన నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడంలేదు. నిధులు మంజూరైన వెంటనే అందరికీ నగదు జమచేస్తాం. ప్రస్తుతం కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి వాహనాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని