సభలో ఇంధన సెగలు
close
Published : 21/09/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సభలో ఇంధన సెగలు

 ధరలపై విపక్ష నేతల నిప్పులు 
 గట్టిగా తిప్పికొట్టిన ముఖ్యమంత్రి


పాలక పక్షాన్ని గట్టిగా నిలదీస్తున్న కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య 
  దిగువసభలో ఆవేశంగా మాట్లాడుతున్న బసవరాజ బొమ్మై 

ఈనాడు డిజిటల్, బెంగళూరు : ఇంధన ధరలపై విపక్షాల నిప్పులు.. వాటికి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఇచ్చిన సమాధానంతో సోమవారం విధానసభ దద్దరిల్లింది. ఆయా పార్టీల సర్కారు సమయాల్లో పెరిగిన ధరలు.. వారు అనుసరించిన విధానాలపై పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భోజన విరామానికి గంట ముందు ధరలపై విశ్లేషణ ప్రారంభించిన ముఖ్యమంత్రి.. విరామం తర్వాత మరో గంటన్నర పాటు సుదీర్ఘంగా కొనసాగించారు. విపక్ష నేత సిద్ధరామయ్య, జనతాదళ్‌ సభ్యులూ సర్కారును నిలదీసినా బొమ్మై ఒక్కరే సహనంతో సమాధానాలిచ్చారు.
నైతికత లేదు
గత మంగళవారం ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలపై విపక్ష నేత సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్‌ సభ్యులు ప్రత్యేక చర్చ ప్రారంభించారు. ఇదే సందర్భంగా 1973లో అప్పటి పార్లమెంట్‌ విపక్ష నేత వాజ్‌పేయీ కాంగ్రెస్‌ సర్కారును దోపిడీ సర్కారుగా ఆరోపించగా అదే ఆరోపణను సిద్ధరామయ్య తాజా సర్కారుపై ఎక్కుపెట్టారు. విపక్షాల ఆరోపణలకు ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాల్సిందిగా ప్రశ్నోత్తరాల తర్వాత స్పీకర్‌ సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 1973 నుంచి కాంగ్రెస్‌ సర్కారు పెంచిన ఇంధన ధరల పట్టీని చదివి వినిపించారు. 1973లో 150 శాతం, 1979-86ల మధ్యలో 122 శాతం, 1983-93మధ్య కాలంలో 125 శాతం, 1993-2000మధ్యలో 55 శాతం, 2000-04మధ్య 50 శాతం, 2004-14 మధ్యల 60 శాతం పెట్రోలు ధరలు పెరిగాయి. 2014-21 మధ్య కాలంలో కేవలం 30 శాతమే ఈ ధరలు పెంచినట్లు సమర్థించుకున్నారు. కేవలం 30శాతం ధరలను పెంచిన ఎన్‌డీఏను దోపిడీ సర్కారు అని ఆరోపించిన కాంగ్రెస్‌కు నైతికత లేదని దుయ్యబట్టారు. నిత్యావసర వస్తువుల విషయంలోనూ యూపీఏ పదేళ్ల కాలంలో కేవలం 3.5 లక్షల టన్నుల బియ్యం, వరిని 176.8 మిలియన్‌ టన్నులు సేకరించగా ఎన్‌డీఏ ఐదేళ్ల కాలంలో ఎనిమిది లక్షల టన్నుల బియ్యం, 306 మిలియన్‌ టన్నుల వరిని సేకరించినట్లు వివరించారు. మద్దతు ధరల్లోనూ యూపీఏ సర్కారు కంటే 48 శాతం అదనంగా ప్రకటించింది. 60 ఏళ్ల స్వాతంత్య్ర భారత దేశాన్ని పాలించిన కాంగ్రెస్, ఆపై యూపీఏ సర్కారు దేశాన్ని నిలువునా దోచినట్లు ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. ఎన్‌డీఏ సర్కారును విమర్శించేంత నైతికత లేదని ఆరోపించారు. 
పన్నులపైనా చర్చ
ఇంధనంపై వసూలు చేసే పన్నులను రాష్ట్ర సర్కారు వరుసగా ఐదేళ్ల పాటు పెంచగా, భాజపా కేవలం 10 శాతం మాత్రమే పెంచినట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఇంధన కొనుగోలు బాండ్ల పేరిట 1.41 లక్షల కోట్ల విలువైన బాండ్లను ఎన్‌డీఏ సర్కారు తీరుస్తోందని ఆయన గుర్తు చేశారు. ఇక గ్యాస్‌ కనెక్షన్ల విషయంలోనే యూపీఏ సర్కారు కంటే ఎన్‌డీఏ మెరుగైన పథకాలు అమలు చేసింది. 60 ఏళ్ల కాంగ్రెస్‌ సర్కారు కేవలం 13 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వగా ఎన్‌డీఏ ఏడేళ్ల కాలంలో 16 కోట్ల మందికి గ్యాస్‌ సదుపాయం కల్పించినట్లు విశ్లేషించారు. యూపీఏ సర్కారు సమయంలో ఉన్న 16 శాతం ద్రవ్యోల్బణం ప్రమాణాన్ని 6శాతానికి తగ్గించిన ఘనత ఎన్‌డీఏకే చెందుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.


మాట్లాడుతున్న కుమారస్వామి
 సభలో స్పందిస్తున్న యడియూరప్ప
 

ఇంధనానికి ప్రత్యామ్నాయం
ఇంధన వినియోగాన్ని తగ్గించే దిశగా కేంద్రం ఇథనాల్‌ వినియోగంపై దృష్టి సారించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఇంధనంలో వినియోగించే ఇథనాల్‌ శాతాన్ని ఆరు శాతం నుంచి 20 శాతానికి పెంచిన ఎన్‌డీఏ సంప్రదాయేత ఇంధన వినియోగంపై ప్రత్యేక పథకాలు రూపొందించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. దీని ద్వారా ముడిచమురు దిగుమతులను కనీసం 30 శాతం తగ్గించే వీలుందన్నారు. ఈ మధ్య కాలంలో బ్యాటరీ వాహనాలకు ప్రత్యేక రాయితీలతో విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గిందన్నారు. రానున్న రోజుల్లో ఇంధనంపై విధించే కొనుగోలు పన్నును తగ్గించేందుకు యత్నిస్తానని ప్రకటించారు.
నేతల మాటల తూటాలు
సోమవారం సభలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, విపక్ష నేత సిద్ధరామయ్య మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. తాను సమాధానమిస్తుంటే అడ్డుకోవద్దని సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి వారించారు. తాను మాట్లాడే సందర్భంగా మీ మంత్రులంతా అడ్డుకోగా లేనిది నేనెందుకు అడ్డుకోరాదని బదులిచ్చారు. తాను మాట్లాడేందుకు ఓ నిమిషం సమయం కూడా ఇవ్వలేవా? అంటూ సిద్ధరామయ్య ముఖ్యమంత్రిని వేలితో చూపుతూ ప్రశ్నించారు. మీ సర్కారే దోపిడీ సర్కారంటూ ఇరువురూ పెద్ద ఎత్తున వాదనలు వినిపించారు. అంతకు ముందు సిద్ధరామయ్య- కుమారస్వామి మధ్య వాగ్వాదం నెలకొంది. తాను ఉచిత బియ్యం కోసం అదనంగా నిధులు కేటాయించలేదన్న కుమారస్వామి ఆరోపణలకు సిద్ధరామయ్య సోమవారం సమాధానమిస్తూ తగిన నిధులు లేకుంటే అనుబంధ బడ్జెట్‌ ద్వారా సమకూర్చుకునే అవకాశం ఉందని సూచించారు. అధికారులతో చర్చించి నిధులను పెంచుకోలేక నన్ను విమర్శిస్తే ఎలాగని ప్రశ్నించారు. సిద్ధరామయ్య ప్రసంగం సందర్భంగా కుమారస్వామి, పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ పరస్పరం చర్చించుకోవటం సభలో ఆసక్తిగొలిపింది.
బొమ్మై భేష్‌..
విపక్షాల ఆరోపణలకు ఇంత గట్టిగా సమాధానమిచ్చిన ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ సందర్భంగా బొమ్మైను కొనియాడారు. మీరు ఇంతకంటే బాగా మాట్లాడినా నిన్నెవ్వరూ ప్రశంసించకపోవటం బాధగా ఉన్నట్లు యడియూరప్పను విపక్ష నేత సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. సర్కారు ఏర్పాటునకు ఎంత శ్రమించినా చివరకు కన్నీటితో సాగనంపటం బాధగా ఉన్నట్లు విపక్ష సభ్యులు రమేశ్‌కుమార్‌ ఎద్దేవా చేశారు. యడియూరప్పకు యావత్తు రాష్ట్రమే అండగా ఉందని ముఖ్యమంత్రి బదులిచ్చారు. యడియూరప్పను తొలగించిన సందర్భంగా అదే రాష్ట్ర ప్రజలు మద్దతివ్వలేదని సిద్ధరామయ్య గుర్తుచేశారు. మరోసారి పోరాడి.. సిద్ధరామయ్యను మళ్లీ విపక్ష స్థానంలోనే కూర్చోబెడతానంటూ యడియూరప్ప ఈ సందర్భంగా సవాలు విసిరారు.

కాంగ్రెస్‌ సైకిల్‌ జాతా
బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : నిత్యావసరాలు, ఇంధన ధరల పెంపును ఖండిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, యువ కాంగ్రెస్‌ సమితి సభ్యులు నగరంలో సోమవారం సైకిల్‌ జాతా నిర్వహించారు. పీసీసీ కార్యాలయం ఉన్న క్వీన్స్‌ రోడ్డు నుంచి విధానసౌధ వరకు ఐదు వందల సైకిళ్లపై వారంతా విధానసౌధకు చేరుకున్న వేళ.. రాకపోకలకు తీవ్ర ఆటంకం ఎదురైంది. కొవిడ్‌తో ఉపాధి అవకాశాలు మందగించడం, ధరల పెంపుతో సామాన్యుడి జీవితం దుర్భరమైందని పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుడి కష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని దుయ్యబట్టారు. సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకే సైకిళ్లపై ప్రయాణించామని విపక్ష నేత సిద్ధరామయ్య వెల్లడించారు. మాజీ మంత్రులు రామలింగారెడ్డి, దినేశ్‌ గుండూరావు, పార్టీ నాయకులు రిజ్వాన్‌ అర్షద్, హ్యారిస్, ఈశ్వరఖండ్రే, సలీం అహ్మద్‌ తదితరులు జాతాలో పాల్గొన్నారు. 


విధానసౌధ ఆవరణలో శివకుమార్, సిద్ధరామయ్య, రిజ్వాన్‌ అర్షద్, ఎన్‌.ఎ.హ్యారిస్‌ తదితరులు 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని