ఇది విధి పరీక్ష!!
close
Published : 21/09/2021 04:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇది విధి పరీక్ష!!

 కేంద్రాలకు సకాలంలో చేరుకోలేకపోతున్న అభ్యర్థులు

 నగర పరిస్థితులపై అవగాహన లేక ఇక్కట్లు

వృథా అవుతున్న విద్యా సంవత్సరం

ఈనాడు, విశాఖపట్నం

విశాఖ నగరంపై విద్యార్థుల ఆశలెన్నో!
ఏడాది పొడవునా ఇక్కడ ఏదొక పోటీ పరీక్ష జరుగుతూనే ఉంటుంది!!
విద్యాలయాల వార్షిక పరీక్షలతో పాటు ఉద్యోగ నియామకాలకూ నిర్వహిస్తుంటారు!
ఈ క్రమంలో చాలా మంది పరీక్ష సమయానికి ఆయా కేంద్రాలకు చేరుకోలేకపోతున్నారు!
ఆఖరి క్షణం వరకూ అక్కడికి రాలేక పరుగు పరుగున వచ్చినా... లోపలికి అనుమతి లేక కన్నీటి పర్యంతమవుతున్నారు!
మహానగరమైన విశాఖలో ప్రయాణ సమయంపై సరైన అవగాహన లేకపోవడం, కాలం విలువ తెలుసుకోలేకపోవడం..
ముందస్తు ప్రణాళిక కొరవడటమే విద్యార్థుల ఉజ్వల భవితను దెబ్బకొట్టేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి పరిస్థితి ఇదీ...

త్వరలో జరగనున్న..

ట్రిపుల్‌ ఐటీ, సివిల్స్‌ పరీక్షల్లో ఇదే పరిస్థితి పునరావృతం అయితే!! సదరు అభ్యర్థుల్లో ఆవేదనకు అంతే ఉండదు!! వారికి కలిగే నష్టం పూడ్చలేనిదవుతుంది.

* నౌసేనాబాగ్‌లో కేంద్రీయ విద్యాలయ-1, కేంద్రీయ విద్యాలయ-2 ఉన్నాయి. నౌకాదళ వసతిగృహాల సమీపంలో ప్రధాన రహదారి నుంచి అర కి.మీ.ల దూరంలో వాటిని వేర్వేరు చోట్ల నిర్మించారు. తెలియని వారు ఈ విద్యా సంస్థలకు వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎలాంటి సూచిక బోర్డులు ఉండటం లేదు. అరకిలోమీటరు దూరం నడుచుకుంటూనే వెళ్లాలి. దారితప్పితే మరింత దూరం నడకతప్పదు. పైగా అది ‘రక్షిత ప్రాంతం’ పరిధిలో ఉండటంతో అభ్యర్థుల్ని తప్ప సహాయకుల్ని అనుమతించరు.

* కేంద్రీయ విద్యాలయం పేరు చెప్పగానే చాలా మంది ఆటో డ్రైవర్లు నౌసేనాబాగ్‌కు కాకుండా.. మల్కాపురంలోని కేంద్రీయ విద్యాలయానికి తీసుకువెళ్తుంటారు. అది గమనించలేని వారి అమూల్యమైన సమయం వృథా అవుతోంది.

* నగరంలోని కొన్ని విద్యాసంస్థలకు అధికారిక రికార్డుల్లో ఒక పేరు...సంస్థల వద్ద మరో పేరు ఉంటోంది. ప్రత్యేక కారణాలతో, ఆయా సంస్థల్లో చదువే విద్యార్థులకు అనుకూలంగా ఒక పేరుతో బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయి. పోటీ పరీక్షల అభ్యర్థులకు జారీ చేసే హాల్‌టిక్కెట్లలో మాత్రం పరీక్ష కేంద్రం చిరునామాలను అధికారిక రికార్డుల్లో ఉన్నట్లే ముద్రిస్తున్నారు. ఫలితంగా వాటి చిరునామాలను గుర్తించటానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

* నగరంలో ఎవరికీ అంతుపట్టనిది ట్రాఫిక్‌ సమస్య. ఏ దారిలో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. పలు కూడళ్లను దాటుకుని వెళ్లే క్రమంలో ఎంతో సమయం కరిగిపోతుంది. దీనిపై అభ్యర్థులకు ఒక అంచనా లేకపోవడం.

* పరీక్ష కేంద్రం గేటు తెరిచే సమయానికే అక్కడ ఉండి లోపలికి వెళ్లాల్సి ఉన్నా చాలా మంది పరీక్ష సమయానికి కొన్ని నిమిషాల ముందు చేరుకుంటున్నారు.

* కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే వెళ్లి చూసుకోవాలనే నిర్వాహకుల సూచనను పట్టించుకోకపోవడం. ఫలితంగా చేరుకునే క్రమంలో ఇక్కట్లకు...ఒత్తిడికి గురవుతున్నారు.

* ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి నగరంలో తిరిగే బస్సుల సమయాలపై అవగాహన ఉండదు. నిత్యం తిరిగేవి కూడా ఒక్కోసారి రద్దయిపోవచ్చు. మరమ్మతులతో నిలిచిపోవచ్చు. అవొస్తాయనుకుంటే నష్టపోయినట్లే.

* వర్షాలు పడే సమయంలో పరీక్ష కేంద్రాల చిరునామా తెలుసుకోవడం అంత తేలిక కాదు. ఇటీవల ‘నీట్‌’ నిర్వహించిన రోజున భారీ వర్షానికి చాలా మంది అవస్థలకు గురయ్యారు.

* పరీక్షకు హాజరయ్యేవారు పాటించాల్సిన సూచనలను అభ్యర్థులకు నిర్వాహకులు పంపుతున్నారు. వాటి వివరాలను ఆన్‌లైన్లో కూడా ఉంచుతున్నారు. అడ్మిట్‌కార్డ్‌/హాల్‌టిక్కెట్‌తోపాటు కూడా అవి డౌన్‌లోడ్‌ అవుతాయి. వాటిని కచ్చితంగా చదవాలని చెబుతున్నా చాలా మంది విస్మరిస్తున్నారు.

ఇటీవలి పరీక్షల్లో గమనిస్తే

విద్యార్థి 1
* నివాస ప్రాంతం: అనకాపల్లి * పరీక్ష కేంద్రం: కొమ్మాదిలోని ఓ ప్రైవేటు కళాశాల * ఆలస్యానికి కారణం: పరీక్ష కేంద్రం చిరునామాను సకాలంలో గుర్తించలేకపోవడం
విద్యార్థి 2
* నివాస ప్రాంతం: రాజమహేంద్రవరం * పరీక్ష కేంద్రం: కేంద్రీయ విద్యాలయ, మల్కాపురం * ఆలస్యానికి కారణం: ఆలస్యంగా బయలుదేరడం, మధ్యలో ట్రాఫిక్‌ నిలిచిపోవడం.
విద్యార్థి 3
* నివాస ప్రాంతం: విశాఖ నగరం * పరీక్ష కేంద్రం: దువ్వాడలోని ఓ పబ్లిక్‌ స్కూల్‌ * ఆలస్యానికి కారణం: ఆ పరీక్ష కేంద్రానికి రవాణా సదుపాయం సరిగా లేకపోవడం.

లోపం ఎక్కడుందంటే

* ఒక్కోపరీక్షకు ఒక్కో నిబంధన ఉంటుంది. వాటిని కచ్చితంగా అనుసరించాలి. కొన్ని పరీక్షలకు బంగారు ఆభరణాల ధరించినా, హ్యాండ్‌ బ్యాగులు తెచ్చినా అనుమతించరు. ఒక్కరే వచ్చినప్పుడు వాటిని ఎక్కడ ఉంచాలనే విషయమై  మథనపడి ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు దుస్తుల విషయంలో, బూట్లు విషయంలోనూ నిబంధనలు పట్టించుకోరు. నిర్వాహకులు కుదరదన్నప్పుడు పరుగులు తీయాల్సి వస్తోంది.

నిర్వాహకులు చేసేదేమీ ఉండదు

‘నీట్‌’కు మధ్యాహ్నం   1.30 గంటలకు ప్రాంగణ గేట్లను మూసేస్తామని స్పష్టంగా ముందే చెప్పాం. ఉదయం 11 గంటల నుంచి పరీక్ష కేంద్రాలు తెరచి ఉన్నా చాలామంది ఆఖరు నిమిషంలోనే చేరుకున్నారు. అయినప్పటికీ 1.30 గంటలకు వచ్చిన అందరినీ లోనికి అనుమతించారు. గేటు మూసే సమయానికి ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చినా నిర్వాహకులు చేసేదేమీ ఉండదు. ఎవరైనా పరీక్షకు ఆలస్యంగా వచ్చారంటే అది వారి ప్రణాళికాలోపమే. ఒకరోజు ముందే ఆయా కేంద్రాల వద్దకు వెళితే ప్రయాణ అవాంతరాలపై ఒక స్పష్టత వస్తుంది.

- వై.సునీత, సమన్వయకర్త, నీట్‌

ముందస్తు ప్రణాళికే కీలకం

విద్యార్థులు పరీక్ష సమయానికి కనీసం నాలుగు గంటల ముందే కేంద్రానికి చేరుకునేలా మందస్తు ప్రణాళిక రచించుకోవాలి. చాలామంది ముందే వెళ్లినా గేట్లు తీయకపోతే ఎక్కడ ఉంటాం అని అనుకుంటారు. అది పొరపాటు. ఒకట్రెండు గంటల సమయం కోసం చూసుకుంటే అమూల్యమైన విద్యాసంవత్సరం కోల్పోవాల్సి వస్తుందన్న విషయాన్ని మరవకూడదు. ప్రయాణ సమయం కూడా రెట్టింపు ఉంటుందని భావించి ముందుగా బయలుదేరాలి. పాఠ్యాంశాలు చదవడమే కాదు..పరీక్ష కేంద్రానికి చేరుకోవడమూ ముఖ్యమే అన్నది గుర్తెరగాలి.

- ఎస్‌.రఘుకుమార్‌, అధ్యాపకుడు, జేఈఈ పరీక్షల విభాగం


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని