భాజపాతోనే బలమైన తెలంగాణ
close
Published : 21/09/2021 05:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపాతోనే బలమైన తెలంగాణ

24వ రోజు పాదయాత్రలో బండి సంజయ్‌
తాడ్వాయి బహిరంగ సభలో ప్రసంగిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి, న్యూస్‌టుడే, తాడ్వాయి: తెరాస ప్రభుత్వ అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి, గడీల పాలనకు చరమగీతం పాడుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బలమైన రాష్ట్ర నిర్మాణం తమ పార్టీతోనే సాధ్యమన్నారు. తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌ శివారు నుంచి సోమవారం 24వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమై తాడ్వాయి, కృష్ణాజివాడి మీదుగా కామారెడ్డి పట్టణ శివారులోని దేవునిపల్లికి చేరుకుంది. వివిధ గ్రామాల రైతులు, ప్రజల సమస్యలను ఆలకించారు. ఎండ్రియాల్‌ గేట్‌, తాడ్వాయి మండల కేంద్రంతో పాటు దారి పొడవున స్థానికులు, కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. తాడ్వాయిలో మహిళలు బోనాలు, బతుకమ్మలతో ఎదురొచ్చారు.

పొలం గట్లపై నడక: ఎర్రాపహాడ్‌ శివారులో బసచేసిన సంజయ్‌ సోమవారం తెల్లవారుజామున విఠల్‌రెడ్డి పొలానికి వెళ్లారు. ఎకరాకు ఎంత పెట్టుబడి పెడుతున్నారు? దిగుబడి ఎంత వస్తుందో ఆరా తీశారు. రోడ్డుపై వెళ్తున్న పాల రైతులతో ముచ్చటించారు. వారి కష్టసుఖాలు తెలుసుకొని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

తాడ్వాయి సభకు భారీగా జనం: తాడ్వాయి మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా జనం హాజరయ్యారు. మొక్కజొన్న రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో గతేడాది మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. అన్నదాతలు తమకు నచ్చిన పంట వేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్షల కోసం రూ.120 కోట్లు మంజూరు చేస్తే తెరాస ప్రభుత్వం ఆ నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన వ్యవసాయ క్షేత్రంలో మాత్రం భూ సార పరీక్షలు చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు.

కామారెడ్డి పట్టణం : లింగాపూర్‌ వద్ద సోమవారం రాత్రి బండి సంజయ్‌కు బోనాలతో స్వాగతం పలుకుతున్న మహిళలు

సమస్యల ఏకరవు: ఎర్రాపహాడ్‌ పీహెచ్‌సీని సందర్శించి కొవిడ్‌ టీకా పంపిణీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తాము పడుతున్న కష్టాలను ఏకరవు పెట్టారు. రేషన్‌ డీలర్లు తమకు ప్రభుత్వమిచ్చే కమీషన్‌ సరిపోడం లేదని, పెంచేందుకు కృషి చేయాలని విన్నవించారు. ఈ-పాస్‌ యంత్రాలు వినియోగించినందుకు కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.17 ఇవ్వాల్సి ఉందని, 2015 నుంచి రావడం లేదని ఆయన దృష్టికి తెచ్చారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం: పార్టీ క్రియాశీల కార్యకర్త శ్రీనివాస్‌ హోటల్‌లో కాసేపు ఆగి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ తాను పార్టీ కోసం శ్రమించిన తీరును వీడియో రూపంలో చూపించారు. పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని, అందుకు తానే ఉదాహరణ అని బండి సంజయ్‌ తెలిపారు. వెంట పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, మర్రి రాంరెడ్డి, పైలా కృష్ణారెడ్డి, వెంకట్రావు, బాపురెడ్డి, బంగ్లా చైతన్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


అమిత్‌ షా ఫోన్‌

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బండి సంజయ్‌కు ఫోన్‌చేసి పాదయాత్ర కొనసాగుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని, అధిష్ఠానం అండగా నిలుస్తుందని చెప్పినట్లు సమాచారం. ప్రజలతో మమేకమవుతూ సాగాలని సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని