తాళం  వేస్తే ఇల్లు గుల్లే 
close
Updated : 21/09/2021 06:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తాళం  వేస్తే ఇల్లు గుల్లే 

పెరుగుతున్న చోరీలు
కొరవడిన పోలీసు నిఘా

చిత్తూరు, తిరుపతి అర్బన్‌ జిల్లాల పరిధిలో ఇంటి దొంగతనాలు  జరగని రోజు లేదని నేరచిట్టాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంటికి తాళాలు వేస్తే దొంగల దాడి తప్పదనేలా పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా దోచేస్తున్నారు. పోలీసుల నిఘా కొరవడటంతో దొంగలు చెలరేగి పోతున్నారు. వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న దొంగలు కొవిడ్‌ కారణంగా జైలు నుంచి విడుదలై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుత కొవిడ్‌ కాలంలో కేసులు నమోదు చేసినా స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపాల్సి రావడంతో.. అలా బయటకు వెళ్లినవారు మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. 
*  తిరుపతి ఇర్లానగర్‌కు చెందిన సునీత గతనెల 15న ఇంటికి¨ తాళం వేసి విదేశాలకు వెళుతున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చి చూడగా బీరువాలోని రూ.ఐదు లక్షల నగదు, రూ.పది లక్షల విలువైన బంగారు, వెండి నగలు కనిపించలేదు. 
* తిరుపతి కట్టకింద ఊరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి పార్థసారథిÅరెడ్డి భార్య గతనెల 13వ తేదీ ఇంటికి తాళాలు వేసి సమీపంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు ఉదయం బెంగళూరు నుంచి వచ్చిన భర్త ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా రూ.3.40 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు చోరీకి గురై ఉన్నాయి.
*  గతనెల 27న రేణిగుంటలో పట్టపగలు తాళాలు వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడి రూ.50 వేల నగదు, 30 గ్రాముల వెండి వస్తువులు దోచేశారు... అదే రోజు గ్రామంలోని భగత్‌సింగ్‌ కాలనీకి చెందిన మస్తాన్‌ ఇంట్లో 87 గ్రాముల బంగారం.. 250 గ్రాముల వెండి వస్తువులు కాజేశారు. 
*  తిరుపతి నగరం గాయత్రీనగర్‌లో కాపురం ఉంటున్న ప్రొఫెసర్‌ ఇంట్లోకి ప్రవేశించిన దొంగ కత్తులతో  బెదిరించి ఇద్దరి మెడల్లో నగలు  దోచుకెళ్లారు. 
*  మదనపల్లె నుంచి కాలూరు క్రాస్‌ సమీపానికి కాపురం మార్చిన శ్రీకాళహస్తి కోర్టు ఉద్యోగి ఇంట్లో పట్టపగలే దొంగలుపడి నగలు కాజేశారు. 
*  ఇవే కాదు.. ఎన్నో కేసులు వెలుగుచూశాయి.-న్యూస్‌టుడే, తిరుపతి(నేరవిభాగం)

నేర ఆధారాలు చిక్కకుండా..
ఒక రకమైన దొంగతనాలకు అలవాటు పడ్డవారు వేర్వేరు చోరీలకు పాల్పడుతున్నట్లు నేర పరిశోధనల్లో తేలింది. గొలుసు దొంగతనాలు చేసేవారు ఇంటి తాళాలు పగలగొట్ట్టి చోరీలు.. ద్విచక్ర వాహన దొంగలు కిటికీలు తొలగించి ఇంట్లోకి వెళ్లి చోరీలకు పాల్పడేలా మారిపోయారు. ఒకప్పుడు నేరవిభాగం పోలీసులు దొంగతనం జరిగిన తీరును బట్టి పలానా తరహా దొంగతనమని చెప్పేవారు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పోలీసులు అంటున్నారు. వేలిముద్రలు పడనీయకుండా గ్లౌజులు వేసుకుంటున్నారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలు పసిగట్టేవాటిని ముందు ధ్వంసం చేస్తున్నారు. చరవాణి వినియోగించకుండా వాట్సాప్‌ కాల్‌ చేస్తున్నారు. ఇలా ఆధారాలు చిక్కకుండా తప్పించుకుంటున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు.

తగ్గిన ప్యాపిల్యాన్‌ వినియోగం
పాత నేరస్థులు పసిగట్టే ప్యాపిల్యాన్‌ వినియోగ జోరు తగ్గింది. అనుమానితులుగా ఉన్నవారి వేలిముద్రలు ప్యాపిల్యాన్‌ ద్వారా పరిశీలిస్తే పాత నేరస్థులా.. కాదా తెలిసిపోతుంది. గత మూడేళ్లుగా ఈ తరహా వినియోగం బాగా తగ్గింది. దీంతో అంతర్రాష్ట్ర దొంగలు కూడా ఈ రెండు జిల్లాల్లో మకాం వేసి దోచేస్తున్నారు. స్టేషన్‌ సిబ్బంది తక్కువ కావడం.. ఉన్నవారిని ఇతర పనులకు వినియోగించడం వల్ల ఈ తరహా తనిఖీలు తగ్గిపోయాయి. రాత్రి గస్తీలు కూడా బాగా తగ్గాయి. డయల్‌ 100కు కాల్‌ వెళ్తేనే పోలీసులు వచ్చేలా పరిస్థితి మారిపోయింది. 

ఎల్‌హెచ్‌ఎంఎస్‌పై అవగాహనేదీ 
కుటుంబసభ్యులంతా ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లాక్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఎల్‌హెచ్‌ఎంఎస్‌) వినియోగించుకుంటే దొంగల భయం ఉండదు. ఇలాంటి వ్యవస్థ ఉందనే విషయం జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసు శాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. కొవిడ్‌కు ముందు కొంతమేరకు వినియోగంలో ఉన్న ఎల్‌హెచ్‌ఎంఎస్‌ వ్యవస్థ.. రెండేళ్లుగా తగ్గింది. 

ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం
కొంత కాలంగా దొంగతనాలు పెరిగిన మాట వాస్తవమే. చోరీల కట్టడికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. రక్షక్, బ్లూకోల్డ్‌ పోలీసుల సంఖ్య పెంచాం. ఎల్‌హెచ్‌ఎంఎస్, బైక్‌ లాక్‌ సిస్టమ్‌ గురించి ఇటీవల అవగాహన కల్పిస్తున్నాం. పాత దొంగలను గుర్తించి మరోసారి నేరాలకు పాల్పడకుండా కౌన్సెలింగ్‌ ఇచ్చాం. మరింతగా నిఘా పెంచాం.  - వెంకట అప్పలనాయుడు, అర్బన్‌ జిల్లా ఎస్పీ 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని