కొరడా ఝుళిపిస్తున్నారు..!
close
Published : 29/09/2021 03:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొరడా ఝుళిపిస్తున్నారు..!

భవన నిర్మాణ అనుమతి స్థలాన్ని మించితే జరిమానా

ఈనాడు, వరంగల్‌, కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 2019 కొత్త పురపాలక చట్టంతో పట్టణాల్లో ప్రజలకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. చట్టంలో పొందుపర్చిన నిబంధనలపై అవగాహన లేకపోవడంతో జరిమానాల బారిన పడుతున్నారు. కొత్తగా అమలవుతున్న టీఎస్‌-బీపాస్‌, ఆస్తిపన్ను స్వీయ ధ్రువీకరణ నిబంధనలు తెలియక ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. టీఎస్‌బీపాస్‌లో అనుమతి తీసుకున్నదానికన్నా ఎక్కువ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టినా, ఆస్తి పన్ను ప్లింత్‌ ఏరియా తక్కువ చూపించినా 25 రెట్లు జరిమానా విధిస్తున్నారు. రూ. వేల నుంచి రూ.లక్షల్లో అపరాధ రుసుం చెల్లించాలని స్పెషల్‌ డిమాండ్‌ నోటీసులు జారీ చేయడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భారీ జరిమానాలు చూసి కంగుతింటున్నారు. నూతన పురపాలక చట్టంపై అవగాహన కల్పించకుండా జరిమానాలు విధించడంతో నిరసన వ్యక్తమవుతోంది. అధికారులు అవగాహన కల్పించకుండా నేరుగా వచ్చి జరిమానా విధిస్తే ఎలా అంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని పురపాలికలు, గ్రేటర్‌ వరంగల్‌లో ఆస్తిపన్ను జరిమానాల అంశం చర్చనీయాంశంగా మారింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లవుతుందని, ఇప్పుడు హడావుడి చేయడం ఏమిటని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

గ్రేటర్‌ పరిధిలో రూ.25.68 కోట్ల జరిమానా

వరంగల్‌ నగరంలో స్వీయ ధ్రువీకరణ ద్వారా కొత్త ఇంటి నంబర్ల కోసం 5,128 అర్జీలు వచ్చాయి. ఇందులో 2,965 భవనాల ఆస్తిపన్ను ప్లింత్‌ ఏరియాల్లో తప్పులున్నట్లుగా క్షేత్రస్థాయి తనిఖీలతో బయట పడింది. రూ.25.68 కోట్ల జరిమానాలు చెల్లించాలని స్పెషల్‌ నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. నూతన పురపాలక చట్టం, ఆస్తిపన్ను స్వీయ ధ్రువీకరణ ఎలా చేయాలి?, నిబంధనలు ఏమిటనే దానిపై గ్రేటర్‌ వరంగల్‌ పెద్ద ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టింది. హోర్డింగ్‌లు, ముఖ్యమైన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

* వర్ధన్నపేటకు చెందిన ఓ వ్యక్తి 276 గజాల్లో ఇంటి నిర్మాణం కోసం టీఎస్‌బీ పాస్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అనుమతి పొందారు. మరో పది గజాలు ఎక్కువ స్థలంలో నిర్మించారు. అధికారులు ఈ భవనాన్ని కొలిచి అనుమతి తీసుకున్న దానికన్నా పది గజాలు ఎక్కువగా ఉందని 25 రెట్లు జరిమానా విధించారు. ఆ వ్యక్తి వద్ద రూ. 1.71 లక్షల జరిమానా వసూలు చేశారు. ఇదే పురపాలికలో మరో రెండు చోట్ల అనుమతి కన్నా అధిక స్థలంలో నిర్మించారని రూ. 60 వేల చొప్పున అపరాధ రుసుం కోసం నోటీసులు జారీ చేశారు.

* హనుమకొండ వికాస్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంటి నిర్మాణంలో ప్లింత్‌ ఏరియా కన్నా తక్కువ చూపించి ఇంటి నెంబరు తీసుకున్నారు. అధికారులు పరిశీలించి నిబంధన అతిక్రమించారని ఏకంగా రూ. 36 లక్షల జరిమానా విధించడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది.

* కాజీపేట ఎఫ్‌సీఐ కాలనీలో ఓ వ్యక్తి ఇల్లు నిర్మించుకున్నారు. ఆస్తిపన్ను ప్లింత్‌ ఏరియా తక్కువగా చూపించారు. అసలు పన్ను ఏటా రూ.3వేలు, 25 రెట్లు జరిమానతో రూ.75 వేలు చెల్లించాలని నోటీసు ఇచ్చారు.

* హంటర్‌రోడ్‌ ప్రాంతంలో ఓ ఉద్యోగి మూడు అంతస్తుల భవనం కట్టారు. కొత్త ఇంటి నంబరు కోసం ఆన్‌లైన్‌లో స్వీయ ధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేశారు. పన్ను తక్కువ రావాలని ప్లింత్‌ ఏరియా తక్కువ చూపించారు. బల్దియా పన్నుల విభాగం ఆర్‌ఐ, బిల్‌కలెక్టర్‌ కొలతలు తీశారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రూ.1.28 లక్షల జరిమానా విధించారు.


అవగాహన లేకనే

- సీహెచ్‌.నాగేశ్వర్‌, అదనపు కమిషనర్‌ గ్రేటర్‌ వరంగల్‌

2019 కొత్త పురపాలక చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి కొత్త ఇంటి నంబర్ల దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరిస్తున్నాం. మీ ఆస్తిపన్ను మీరే ఖరారు చేసుకునేందుకు స్వీయ ధ్రువీకరణ పద్ధతి అమలవుతోంది. ఇది ఎలాగంటే భవన నిర్మాణం ప్లింత్‌ ఏరియా పక్కాగా కొలతలు తీసుకున్న తర్వాతే దరఖాస్తు చేయాలి. ఒక మీటరు తేడా ఉన్నా 25 రెట్లు జరిమానా విధించాలని నూతన చట్టం నిబంధనలు చెబుతున్నాయి. భవన నిర్మాణ ప్లింత్‌ ఏరియా కొలతలు తీసుకునేందుకు ప్రైవేటు సర్వేయర్ల సహాయం తీసుకోవచ్ఛు ఈ విషయం తెలియక, పన్ను తక్కువ రావాలనే ఉద్దేశంతో తప్పుడు లెక్కలు నమోదు చేసి జరిమానాల బారిన పడుతున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని