బోరు బండి.. రాలేదండి!
close
Updated : 29/09/2021 06:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బోరు బండి.. రాలేదండి!

జలకళ పథకానికి నిధుల లేమి


రైతు పొలంలో బోరు వేస్తున్న యంత్రం (పాతచిత్రం)

లక్ష్మీనగర్‌(అనంతపురం), న్యూస్‌టుడే : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలకళ పథకానికి నిధుల సమస్య వెంటాడుతోంది. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బోర్లు వేసిన ఏజెన్సీ నిర్వాహకులకు సకాలంలో సొమ్ము అందడం లేదు. దీంతో కొత్తగా బోర్లు వేయలేమని అధికారులకు తేల్చిచెప్పారు. 2020 నవంబరు 20న ఈ పథకాన్ని ప్రారంభించారు. పదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులు అర్హులు. ఐదెకరాలోపు భూమి ఉన్న రైతులకు బోరుతోపాటు మోటారు, విద్యుత్తు సర్వీసుకు అయ్యే మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఐదెకరాలపైన ఉంటే బోరు మాత్రమే వేస్తారు. పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే 40,066 మంది రైతులు దరఖాస్తులు అందజేశారు.

విద్యుత్తు సర్వీసు అంతే..

జలకళ పథకం కింద 511 మంది రైతులు వ్యవసాయ విద్యుత్తు సర్వీసు కోసం దరఖాస్తు చేశారు. వీటిలో 494 దరఖాస్తులకు ఏఈఈలు అంచనాలు తయారు చేసి, 492 సర్వీసులు మంజూరు చేశారు. వీటికి సంబంధించి రూ.9.81 కోట్లు విద్యుత్తుశాఖకు చెల్లిస్తే స్తంభాలు, తీగలు రైతుల పొలాల్లో ఏర్పాటు చేస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు. సొమ్ము చెల్లించకపోవడంతో పనులు చేపట్టలేదని విద్యుత్తు అధికారులు స్పష్టం చేశారు.

రూ.23 లక్షలే విడుదల

పథకం కింద 40,066 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు 1010 బోర్లు తవ్వారు. ప్రారంభంలో 20 బోర్లకు రూ.23 లక్షలు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన 990 బోర్లకు సంబంధించి రూ.6.58 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ నిధులను విడుదల చేయకపోవడంతో బోర్‌వెల్‌ ఏజెన్సీ నిర్వాహకులు చేతులెత్తేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ఒత్తిడితో అరకొరగా బోర్లు తవ్వుతున్నారు. 

ఆ నియోజకవర్గాలపై నిర్లక్ష్యం

జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జలకళ పథకాన్ని అమలు చేసేందుకు డ్వామా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే హిందూపురం, మడకశిర నియోజకవర్గాల పరిధిలో బోర్లు తవ్వేందుకు టెండర్‌ పిలిచినా.. గుత్తేదారులు అధిక ధరలకు కోట్‌ చేయడంతో ఎంపిక చేయని పరిస్థితి. ఈ రెండు నియోజకవర్గాల్లో 637 మంది దరఖాస్తు చేసుకున్నా.. ఒక బోరు కూడా వేయలేదు. అధికారులు 
చొరవచూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

కార్యాలయాల  చుట్టూ ప్రదక్షిణ

ఉచిత బోరుతోపాటు కరెంటు సర్వీసు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అర్హులంతా వెంటనే దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం బోరు బండి ఎప్పుడు వస్తుందా అని నిరీక్షిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 

ఉన్నతాధికారుల  దృష్టికి తీసుకెళ్లాం - వేణుగోపాల్‌రెడ్డి, పీడీ, డ్వామా

జలకళ పథకం కింద వేసిన బోర్లకు నిధుల విడుదల కాలేదు. కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ వారు బోర్లు వేస్తున్నారు. నిధుల విడుదల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరితగతిన విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యుత్తు అధికారులు అంచనాలు తయారు చేశారు. దీనికి సంబంధించి విధివిధానాలు రావాల్సి ఉంది.

దరఖాస్తు చేసిన రైతులు    : 40,066

వీఆర్వో ఆమోదించినవి    : 26,432

ఏజెన్సీలకు వెళ్లినవి    : 26,353

జియాలజిస్టులు సర్వేచేసినవి  : 4,900

ఏపీడీ ఆమోదించిన దరఖాస్తులు    : 1,912

మంజూరైన బోర్లు    : 1,718

ఇప్పటివరకు డ్రిల్‌ చేసిన బోర్లు    : 1,010

బకాయిలు    : రూ.6.58 కోట్లు 


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని