‘బళ్లు’న విరుగుతున్నాయ్‌!!
close
Published : 29/09/2021 03:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బళ్లు’న విరుగుతున్నాయ్‌!!

వాహన చోదకుల పాట్లు

దారుణంగా మారిన నగర రహదారులు

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌, గాజువాక

డైమండ్‌ పార్కు సమీపంలో భూగర్భ విద్యుత్తు తీగల ఏర్పాటుకు తవ్విన చోట ఇలా..

గులాబ్‌ తుపాను నగర రహదారులను మరింత దెబ్బతీసింది. ఇప్పటికే గుంతలు తేలి ఉన్న మార్గాలు భారీ వర్షాలకు గోతులమయం అయ్యాయి. ఈ దారులపై ప్రయాణం చేయాలంటే ఒళ్లు హూనమవుతోందని వాహనచోదకులు వాపోతున్నారు. రెండేళ్లుగా రేపో.. మాపో రహదారుల మరమ్మతులు చేపడతామని చెబుతున్న జీవీఎంసీ అధికారులకు ఇప్పుడు మరిన్ని చిక్కులు వచ్చి పడ్డాయి.

నగరంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ, భూగర్భ విద్యుత్తు కేబుళ్లు, 24 గంటల నీటి సరఫరా, ‘ఆకర్షణీయ’ అభివృద్ధి పనుల్లో భాగంగా తవ్వేసిన రహదారులను పునరుద్ధరించడానికి రూ.275 కోట్లు అవసరమవుతాయని ఏడాది క్రితం అధికారులు లెక్కకట్టారు.ఇప్పుడు మరిన్ని నిధులు అవసరం అవుతాయి.


ఎన్‌ఏడీ కూడలిలో అధ్వానంగా మారిన రహదారిలో వాహన చోదకుల ప్రయాణం

* దెబ్బతిన్న ఇతర రహదారులకు మరమ్మతులు చేయడానికి దాదాపు రూ.50కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని, వర్షాకాలం పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ఐదు నెలల క్రితం జీవీఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. రూ.7 కోట్ల వ్యయంతో రహదారులకు చిన్నచిన్న మరమ్మతులు చేశారు.

వేపగుంట: వరలక్ష్మీనగర్‌ రహదారి ఇలా

జోన్‌-8 పరిధిలో పెందుర్తి, వేపగుంట, గోపాలపట్నం ప్రాంతాల్లో 24 గంటల నీటి సరఫరా, భూగర్భ మురుగునీటి వ్యవస్థ కోసం తవ్విన గోతులు ఇప్పుడు మరింత ఇబ్బందికరంగా మారాయి. ఎన్‌ఏడీ ప్రాంతంలో సర్వీసు రహదారిని సగానికి తవ్వేసి వదిలేయడంతో ప్రమాదకరంగా కనిపిస్తోంది.

జగదాంబకూడలి సమీపంలో...

* వర్ష ప్రభావంతో జీవీఎంసీ పరిధిలో 47 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని ఇంజినీరింగ్‌ అధికారులు నివేదిక సమర్పించారు. మొత్తం రహదారులన్నీ పునరుద్ధరించాలంటే రూ.350కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం, గుత్తేదారులు ముందుకురాని పరిస్థితుల్లో రహదార్లు ఎప్పటికి బాగుపడతాయో తెలియని పరిస్థితి.

పాతనగరం రామకృష్ణా కూడలిలో...

* గాజువాక పరిధిలో గాజువాక హైస్కూల్‌ రోడ్డు, జోగవానిపాలెం, మారుతీనగర్‌, చైతన్యనగర్‌, చినగంట్యాడ, డ్రైవర్స్‌కాలనీ, అజిమాబాద్‌, కైలాసనగర్‌, దల్లివానిపాలెం, సిద్దేశ్వరం ప్రాంతాలలో భూగర్భ డ్రైనేజీ గోతులు తవ్వి తాత్కాలికంగా మట్టి కప్పారు. వర్షానికి మట్టి కుంగిపోయి అడుగేస్తే ఏమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.మారిన అంచనాలు...


అక్కయ్యపాలెం వద్ద...


జీవీఎంసీ అధికారుల అంచనాలకు భిన్నంగా గులాబ్‌ తుపాను నగర రహదారులన్నింటినీ ఛిద్రం చేసేసింది. కుండపోత వర్షంతో ఇప్పటికే తవ్విన రహదారులు కుంగిపోయాయి. బాగున్న దారులపై వరద కోతకు ఎక్కడిక్కడ గుంతలు తేలాయి. జాతీయ రహదారిపై వెంకోజీపాలెం వద్ద గోతులు ప్రమాదకరంగా మారాయి. వాటిల్లో ఇంకా వర్షపు నీరు నిల్వ ఉంది.


వ్యాధులు ప్రబలకుండా చర్యలు..

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: భారీ వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్‌ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ప్రతి బుధవారం డ్రైడే నిర్వహించాలన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.

నవంబరులో మరమ్మతులు...

నగరంలో దెబ్బతిన్న రహదార్లకు నవంబరులో మరమ్మతులు చేపడతాం. వీటికి అక్టోబరులో టెండర్లు ఆహ్వానిస్తాం. వచ్చే ఏడాది జనవరి కల్లా రహదారులను అందుబాటులో తీసుకొచ్చి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తాం. గులాబ్‌ తుపాను ప్రభావంతో 47 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. జీవీఎంసీకి రూ.40కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. 

 -సృజన, జీవీఎంసీ కమిషనర్‌


కన్నీటి కష్టాలు...

 మా గోడు వినేదెవరు..?

పెదగంట్యాడ దరి హౌసింగ్‌బోర్డుకాలనీలో  కుటుంబ సభ్యులమంతా నిద్రలో ఉన్నప్పుడు వరదనీరు ఇంట్లోకి వచ్చేసింది. వంట పాత్రలు, ఆహార పదార్థాలు, పప్పు దినుసులు అన్నీ పాడయ్యాయి. ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న హౌసింగ్‌ బోర్డు ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నాం. మా గోడు అధికారులు పట్టించుకోవాలి.

- పి.సింహాచలం, హౌసింగ్‌బోర్డు కాలనీ


 నగదు, వెండి వస్తువులు పోయాయి..

నా కూతురు నిండు గర్భిణి. నొప్పులు రావటంతో ఆదివారం రాత్రి వర్షంలోనే గోషాసుపత్రికి తీసుకుని వెళ్లాం. మేము వెళ్లిన తర్వాత నల్లక్వారీ పొంగి మా రామకృష్ణాపురాన్ని వరద నీరు చుట్టుముట్టింది. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇంట్లో ఉంచిన రూ. పది వేలు పోయాయి. గృహోపకరణాలు నీళ్లల్లో ఉండిపోయాయి.

- అప్పలకొండ, రామకృష్ణాపురం


 కట్టుబట్టలతో మిగిలాం...

ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నల్లక్వారీ గెడ్డ పొంగటం ప్రారంభించింది. రాత్రి ఒంటిగంట తరువాత ఒక్కసారి ఉప్పెనలా నీరు దూసుకు వచ్చింది. దీంతో ప్రాణభయంతో ఇంట్లోంచి బయటకు వచ్చేశాం. చూస్తుండగానే ఇంట్లో వస్తువులన్నీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కేవలం కట్టుబట్టలతోనే మిగిలాం. ఈ స్థాయిలో ప్రమాదం ముంచుకు వస్తుందని ఊహించలేకపోయాం.

- సిర్ల ఆదిలక్ష్మి


 కార్లన్నీ మునిగిపోయాయి... 

నేను ట్రావెల్‌ ఏజెన్సీని నడుపుతున్నా. కార్లన్నీ కాలనీ ఖాళీ స్థలంలో పెట్టాను. అకస్మాత్తుగా వరదనీరు వచ్చి కార్లన్నీ మునిగిపోయాయి. పక్కనేఉన్న నా ఇంటిలోకి నీరు చేరి విలువైన వస్తువులన్నీ పాడైపోయాయి. ఉదయం ఎవరైనా అధికారులు వచ్చి వివరాలు సేకరిస్తారేమోనని ఎదురూ చూశాను. అయినా ఎవరూ రాలేదు. అన్నీ శుభ్రం అయిన తరువాత అధికారులు వచ్చినా ఏమి లాభం?

-జిలానీ, దుర్గానగర్‌ కాలనీ, 93వ వార్డు


తుపాను నష్టాలు ఇలా...

గులాబ్‌ తుపానుతో ఏర్పడిన నష్టాలను కలెక్టర్‌ ఎ.మల్లికార్జున మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు.

- న్యూస్‌టుడే, జగదాంబకూడలి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని