గుప్పెడంత గుండెలో... చెప్పలేని కల్లోలం..!
close
Updated : 29/09/2021 11:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుప్పెడంత గుండెలో... చెప్పలేని కల్లోలం..!

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెరుగుతున్న కేసులు
నేడు ప్రపంచ హృదయ దినోత్సవం
ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-గుంటూరు వైద్యం

మన గుండె క్షణం ఆగకుండా మన కోసం అనుక్షణం పరితపిస్తోంది. ప్రకృతి సహజమైన దీన్ని మనం ఎంత అపురూపంగా చూసుకోవాలి? ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? కానీ ఈ విషయంలో నిర్లక్ష్యం వహించటం వల్లే చిన్న, పెద్ద, పట్టణ, గ్రామీణం అనే తేడా లేకుండా గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హృదయం పట్ల మన బాధ్యతను గుర్తు చేసుకుందాం.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అత్యధిక మరణాలు గుండె జబ్బుల మూలంగా సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. గడిచిన ఐదేళ్లలో అనేక ఆసుపత్రులు కొత్తగా ఏర్పాటవ్వటం వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది. ఉభయ జిల్లాలకు పెద్దాసుపత్రి అయిన గుంటూరు సర్వజనాసుపత్రికి 12 ఏళ్ల నుంచి రోగులు క్రమేపీ పెరుగుతున్నారు. గత రెండేళ్ల నుంచి కరోనా వల్ల ఓపీ సేవలు నెలలు తరబడి నిలిచిపోవడంతో కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నా, తీవ్రత అలాగే ఉంది. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, కాలుష్య సమస్యలు, ఆలస్య వివాహాలు, మేనరికం పెళ్లిళ్లు, పట్టణీకరణ వంటివి గుండెజబ్బులు అధికంగా రావటానికి కారణమవుతున్నాయని వైద్యవర్గాలు అంటున్నాయి. ఇంటిల్లిపాదీ కొద్దిపాటి శ్రద్ధ తీసుకుంటే జబ్బులు దరిచేరవని సూచిస్తున్నారు. .


14-20 ఏళ్ల మధ్య యువకులు ఎక్కువమంది జంక్‌ఫుడ్స్‌ తిని ఊబకాయులుగా మారుతున్నారు. ఇంటర్‌, డిగ్రీ చదువుతున్న విద్యార్థుల్లో అధిక రక్తపోటును డాక్టర్లు గమనిస్తున్నారు. కనీస వ్యాయామాలు చేయటం లేదు. ఊబకాయంతో బాధపడే మహిళలకు నీటి తిత్తులు అండంలోకి చేరి అండం విడుదలను నిలిపేస్తున్నాయి.


మత్తుపానీయాలు తీసుకోవటం, పొగతాగడం వంటి వ్యసనాల బారినపడి గుండెజబ్బులు తెచ్చుకుంటున్నారు. తమ వద్దకు వచ్చే యువతులను సైతం మద్యం తీసుకుంటారా? అనేది నిర్ధారించుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యుడొకరు తెలిపారు.


వివాహాలు ఆలస్యంగా చేసుకోవటం వంటివి గుండె వ్యాధులకు దారితీస్తున్నాయి. సాప్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వైద్య విద్యార్థినులు, గ్రూప్స్‌, సివిల్స్‌ లక్ష్యంగా పెట్టుకుని చదివే పలువురు స్త్రీ , పురుషులు 28-32 ఏళ్ల మధ్య వివాహాలు చేసుకుంటున్నారు.. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం నగరాలతోపాటు నందిగామ, జగ్గయ్యపేటల నుంచి 10 కేసులు వచ్చాయి. ఆలస్యంగా వివాహాలు చేసుకున్న మహిళల్లో నాణ్యమైన అండాలు విడుదల కాక పిండం ఎదుగుదల లోపించి గుండెజబ్బుకు దారితీస్తోంది. తప్పనిసరిగా మేనరిక వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ముందుగానే వారికి జెనటిక్స్‌ పరీక్ష చేసి పుట్టబోయే బిడ్డలకు ఎలాంటి జబ్బులు రావొచ్చో సూచించే క్వాడ్‌ టెస్ట్‌ చేస్తారు.


ముందే మేల్కోండి

- డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, ప్రముఖ గుండెశస్త్రచికిత్స నిపుణులు

గుండె వ్యాధులు రాక మునుపే జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక నచ్చిన వ్యాయామం చేసుకోవటం, బరువు అదుపులో ఉంచుకోవటం, మితాహారం తీసుకోవటం వంటి లక్షణాలు అలవర్చుకోవాలి. మద్యం, పొగతాగుడు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా గుండె వ్యాధులకు దూరం కావొచ్ఛు తరచూ కనీసం బీపీ అయినా చెక్‌చేయించుకోవావాలి. ఆహారంలో ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి.


నిర్లక్షరాస్యులైన గర్భిణులు ఎక్సరే, సిటీ స్కాన్‌ తీయించుకోవటానికి వచ్చి రేడియేషన్‌ బారిన పడుతున్నారు. ఇది వారి పిల్లల గుండెకు రంద్రాలు ఏర్పడటానికి దారితీస్తోంది. గుంటూరు జిల్లాలో గురజాల, మాచర్ల, వినుకొండ, నరసరావుపేట, పెదకూరపాడు, రేపల్లె, కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, నూజివీడు, కైకలూరు, అవనిగడ్డ, పామర్రు తదితర ప్రాంతాల నుంచి 12-15 ఏళ్ల పిల్లలు గుండెకు రంధ్రాలు ఏర్పడి ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

జీజీహెచ్‌లో భరోసా పరీక్షలు

గుండెలో పూడికలు ఉన్నాయా? లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు సర్వజనాసుపత్రిలో యాంజియోగ్రామ్‌, ఈసీజీ, ఎకో, ట్రెడ్‌ మిల్‌ టెస్ట్‌ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. గుండె రక్తనాళాల్లో పూడికలున్నాయా? లేదా? ఎన్ని చోట్ల పూడుకున్నాయి? ఎంత శాతం పూడుకున్నాయి? వాటితో ఇబ్బంది ఎంత ఉంటుంది? వంటి సమాచారాన్నంతా కచ్చితంగా చెప్పే అత్యంత ప్రామాణికమైన క్యాథ్‌ల్యాబ్‌ జీజీహెచ్‌లో ఉంది. అంతేగాకుండా గుండెలోని రక్తనాళాల్లో పూడిక ఉన్నప్పుడు బైపాస్‌ ఎవరికి? స్టెంట్‌ ఎవరికి అన్నది కూడా ఇక్కడే నిర్ధారిస్తారు. స్టెంట్‌ అమర్చే ప్రక్రియ కూడా అక్కడే పూర్తి చేస్తారు.

వైద్యసేవలు ఇలా

గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో గుండె వైద్యానికి ఆధునిక వైద్యసేవలు అందుతున్నాయి. చికిత్స కోసం వచ్చే వారు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొరుగురోగుల విభాగంలో 10వ నెంబరు గదికి రావాలి. ముందుగా 2వ నెంబరులో పేరు నమోదు చేయించుకోవాలి. ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు బ్యాంకు పాస్‌పుస్తకం తప్పకుండా తీసుకుని రావాలి.


అనవసర భయంతోనే ప్రమాదం

-ఆచార్య ఎన్‌.జి.మోహనార్జున్‌, గుండె జబ్బుల విభాగం అధిపతి, కాటూరి వైద్య కళాశాల

గుండె పోటు, భయం పోటు వేర్వేరు. ప్రస్తుతం కరోనా కాలంలో ఎంతోమంది భయం పోటును గుండెపోటుగా పొరబడుతున్నారు. అనుమానం ఉన్నప్పుడు, లక్షణాలు కొత్తగా కనిపిస్తున్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించటం మంచిది. ఈసీజీ, ఎకో, రక్తంలో ట్రోపోనిన్‌ వంటి పరీక్షలతోనే గుండెపోటును కచ్చితంగా నిర్ధారించగలం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని