ముంచెత్తినది
close
Published : 29/09/2021 04:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముంచెత్తినది

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, వంగర, పాలకొండ, బూర్జ

గులాబ్‌ తుపాను జిల్లాలో తీరం దాటుతూ 12 మండలాలను అతలాకుతలం చేసింది.. భారీ వర్షాలతో జనజీవనం, పాడిపంటను అస్తవ్యస్తం చేసింది.. వెళుతూ.. వెళుతూ.. పక్కనే ఉన్న విజయనగరం జిల్లా, ఒడిశా రాష్ట్రాలపై జడివానతో విరుచుకుపడింది. ఫలితంగా శ్రీకాకుళం జిల్లాలో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా నాగావళి ఉగ్రరూపం దాల్చింది.. అటు వంగర మండలం నుంచి శ్రీకాకుళం వరకూ నదీ పరీవాహక ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సోమవారం అర్ధరాత్రి ప్రమాదకరస్థాయికి చేరిన నాగావడి మంగళవారం అర్ధరాత్రి వరకూ కొనసాగుతోంది. ఫలితంగా అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేల ఎకరాల్లో పంట సైతం నీట మునిగిపోయింది.  

ఆమదాలవలస మండలం సేపేనపేటలో దెబ్బతిన్న బొప్పాయి పంట

విజయనగరం జిల్లాలోని సాలూరు, బొబ్బిలి, గజపతినగరం ప్రాంతాల్లో గత రెండురోజుల్లో దాదాపు 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఆ వరద నీరంతా సువర్ణముఖి, గోముఖి, వేగావతి నదుల్లోకి చేరింది. వెంగళరాయసాగర్‌, పెద్దగెడ్డ రిజర్వాయర్లకు పెద్దఎత్తున రావడంతో నీటిని కిందకు విడిచిపెట్టారు. ఆ నీరంతా వంగర మండలంలో మడ్డువలస రిజర్వాయరుకు చేరుకుంది. నీటి విడుదల సమాచారం వెంటనే ఇక్కడి అధికారులకు చేరలేదు. తర్వాతపూర్తి సమాచారంతో మడ్డువలస నుంచి నీటిని యుద్ధప్రాతిపదికన కిందకు వదిలారు. తొలుత 75 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. 59 వేల క్యూసెక్కుల వరకూ విడిచిపెట్టారు. అన్నీ కలసి 60 నుంచి 65 వేల క్యూసెక్కుల వరద నదిలో ప్రవహించింది. గరిష్ఠస్థాయికి ప్రవాహం చేరడంతో నదీ తీర గ్రామాలను చుట్టుముట్టింది. క్రమంగా ఇన్‌ఫ్లో మంగళవారం రాత్రికి మడ్డువలస నుంచి 20,150 క్యూసెక్కులు మాత్రమే విడిచిపెడుతున్నారు. నాగావళి బుధవారం సాయంత్రానికి శాంతించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

* పనసనందివాడ, తలవరం,  కుమ్మరిగుంట గ్రామాల్లో పంటలన్నీ వరద తాకిడికి గురైన నీటితో నిండిపోయాయి.

* అంపిలి, అన్నవరం, గోపాలపురం, బుక్కూరు, తంపటాపల్లి, వీపీరాజుపేటలో పొలాలను నీరు ముంచెత్తింది.

ముంపుబారిన వంగర మండలంలోని సంగమేశ్వర ఆలయం

* గీతనాపల్లి, కొప్పర, కొండచాకరాపల్లి గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక్కడ విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా ఆ గ్రామాల ప్రజలంతా చీకట్లోనే రోజంతా గడిపారు. సంగాంలో సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.

* ఖండ్యాం, కె.వి.పురం, కొమెర, వెంకంపేట, చెలికానివలస, బొడ్డవలస గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి.

* జావాం, వాసుదేవపట్నం, సిరిపురం, చింతలపేట, మండవకురిటి గ్రామాల పరిసరాల్లోని రహదారులపై వరదనీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు ప్రజలు అవస్థలు పడ్డారు.

* సింగూరు బొడ్డేపల్లి, మొదలవలసలో రెల్లి గెడ్డ వరద నీరు పంటల్లోకి చేరింది. వరద ప్రభావంతో మొదలవలస కాలువ పైనుంచి నీరు ప్రవహించింది.

పాలకొండ: వరదనీటిలో చిన్న మంగళాపురం

* లక్కుపురం, పణుకుపర్త, అల్లెన, డొంకలపర్త, మామిడివలస, లంకాం, నీలాపురం బూర్జ గ్రామాలకు నీటి తాకిడి ఏర్పడింది. ఆయా గ్రామాల్లోని పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.

* వీకేవలస, కొరపాం, ఎన్‌పీవాడ, కొత్తవలస, తొగరాం, కలివరం, ముద్దాడపేట, తమ్మయ్యపేట, కణుగులవలస, దూసిపేట, వంజంగి, వంజంగిపేట, తోటాడ గ్రామాల్లో అరటి, బొప్పాయి, చెరకు, వరి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి.

* పెద్దగణగళ్లవానిపేట సమీపంలో జాలరిపేట గ్రామ పరిధిలో అక్రమంగా నిర్మించిన రొయ్యల చెరువుల కారణంగా నదిలో నీరు పంట పొలాలను ముంచెత్తింది.

* పంటలకు తీవ్ర నష్టం..  తీరగ్రామాల్లో వరద ఉద్ధృతితో వేల ఎకరాల్లో పంట నీటమునిగింది. వరిపై ఎక్కువ ప్రభావం పడింది. మొక్కజొన్న, చెరకు, బొప్పాయి, అరటి పంటలన్నీ ముంపునకు గురయ్యాయి.


శ్రీకాకుళం కొత్త వంతెన వద్ద నాగావడి

107 గ్రామాలు: నాగావళికి ఎప్పుడు వరదలొచ్చినా నదీతీర పరిధిలోని 107 గ్రామాలపై ప్రభావం పడుతుంది. కాస్త ప్రవాహం పెరిగిందంటే చాలు ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంటుంది. పాలకొండ మండలంలో నాలుగు, ఆమదాలవలస 16, రేగిడి 12, వీరఘట్టం 10, బూర్జ 16, సంతకవిటి 21, వంగర 7, పొందూరు 5, ఎచ్చెర్ల 12, శ్రీకాకుళంలో 4 గ్రామాలు నదీ తీరంలో ఉన్నాయి.


అధికార యంత్రాంగం అప్రమత్తం: వంగర మండలంలోని మూడు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం ఉదయాన్నే కలెక్టరు లఠ్కర్‌, ఎస్పీ అమిత్‌బర్దార్‌, విశాఖ డీఐజీ రంగారావు, ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాలకు తరలివెళ్లారు.  అంతకుముందు నుంచే బాధిత గ్రామాల ప్రజలు  ఆహారం, తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తర్వాత అధికారులు 1200 కుటుంబాలకు ఆహారం అందించారు. పక్క గ్రామాల ప్రజలు కూడా సాయం చేసి ఉదారత చాటుకున్నారు. ఎమ్మెల్యే కంబాల జోగులు చొరవతో గీతనాపల్లిలో ఆహారం పంపిణీ చేశారు.


ఇటు నీరు... అటు అంధకారం

కొత్తవలస-కొప్పర గ్రామాలకు వెళ్లే రహదారి దుస్థితి

కస్మిక వరద సోమవారం అర్ధరాత్రి నుంచే గ్రామాలను చుట్టుముట్టింది. వంగర మండలం గీతనాపల్లి, కొప్పర, కొండచాకరాపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో రాత్రివేళ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వంగర, రేగిడి, బూర్జ, ఆమదాలవలస మండలాల్లోని పొలాల మీదుగా నీరు గ్రామాల్లోకి చేరింది. దాదాపు 20కి పైగా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బాధిత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపారు. ఓపక్క వర్షం మరోపక్క చిమ్మచీకట్లతో అవస్థలు పడుతున్నారు. పిల్లాపాపలతో ఎత్తయిన ప్రదేశాలు, మేడలపైన తలదాచుకున్నారు.

పొందూరు: బొడ్డేపల్లి వంతెనపై నీటి ప్రవాహం


నేటి సాయంత్రానికి సాధారణ పరిస్థితులు

విజయనగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సువర్ణముఖి, గోముఖి, వేగావతి నదుల ద్వారా మడ్డువలసకి వరద పోటెత్తింది. దీనివల్ల ఒక్కసారిగా నీటిని కిందికి విడుదల చేశాం. ఫలితంగా కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో ఔట్ఫ్లో కూడా క్రమంగా తగ్గిస్తున్నాం. బుధవారం సాయంత్రానికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి. ముంపు గ్రామాల నుంచి నీరు పూర్తిగా వెనక్కి వస్తుంది. 

- సుధాకర్‌, పర్యవేక్షక ఇంజినీర్‌, జలవనరులశాఖ


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని