24గంటల్లో అల్లకల్లోలం
close
Updated : 30/09/2021 21:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

24గంటల్లో అల్లకల్లోలం

రికార్డుస్థాయి వర్షపాతంతో అతలాకుతలం

10 వేల ఎకరాల్లో పంట నష్టం

ఈనాడు, నిజామాబాద్‌ న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం

నవ్విన చెరువు ఉప్పొంగుతున్నా.. నా తనువుకు జలాభిషేకం అయినందుకు!

ఎగిరి గంతేస్తున్నా.. నా అలుగు పరవళ్లు తొక్కినందుకు..!

తన్మయత్వంలో ఉన్నా.. నా ఎదపై జల సవ్వడి విన్నందుకు..!

ఉబ్బితబ్బిబవుతున్నా.. కర్షకుల కన్నీళ్లు తుడవబోతున్నందుకు!

సంబురపడుతున్నా.. ప్రతి మడీ తడపబోతున్నందుకు!

ఆనందపడుతున్నా.. ఇందూరు పంటల ఖిల్లాగా మారబోతున్నందుకు!

ఉత్సాహంతో ఉన్నా... . పల్లె సీమలు పచ్చగా కనిపించబోతున్నందుకు!

మాటిస్తున్నా.. కరవు కరాళ నృత్యం ఆపుతానని!

ఇక ఉంటా... మీ ఊరి చెరువును

జక్రాన్‌పల్లి: అలుగు పారుతున్న పడకల్‌ చెరువు

- ఈనాడు, నిజామాబాద్‌ డెస్క్‌

ఉమ్మడి జిల్లాను వరుణుడు హోరెత్తించాడు. రికార్డు స్థాయిలో మునుపెన్నడూ లేనంతగా రాత్రికి రాత్రే కుండపోత వర్షం కురిసింది. జిల్లా వాతావరణ కేంద్రంలో ఒక రాత్రే 144.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జక్రాన్‌పల్లి, సిరికొండ, బోధన్‌, మగ్గిడి, ధర్పల్లి, కల్దుర్కి, తూంపల్లి ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువులు, కుంటలు అలుగులు ఉరకలెత్తాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునగ్గా.. ఇళ్లల్లోకి నీరు చేరింది. చాలా చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పూరి గుడిసెలు, కాలం చెల్లిన పెంకుటిళ్లలో నిద్రించిన వారు రాత్రంతా బిక్కుబిక్కుమంటు గడిపారు. ఈ వానాకాలంలో ఇప్పటివరకు 1332.0 మి.మీ వర్షపాతం కురిసింది. అన్ని మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ నమోదైంది. సెప్టెంబరులో 1988 (646.9 మి.మీ) తర్వాత ఇప్పుడే అత్యధికంగా వాన పడిందని జిల్లా వాతావరణ శాఖ అధికారి నరేందర్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. రుతుపవనాలు ఇంకా చురుగ్గా కదులుతున్నాయని చెప్పారు. వాయుగుండం బలహీనపడిందని పేర్కొన్నారు.

దిగువకు వదులుతూ..

కోటగిరి మండలం పోతంగల్‌, రెంజల్‌ మండలం కందకుర్తి, బోధన్‌ మండలం హంగర్గ, బిక్నెల్లి, ఖండ్‌గావ్‌, కొప్పర్గ ప్రాంతాల్లో వెనుకజలాల సమస్య నెలకొంది. ఈ నెల మొదటి వారంలో 3609 ఎకరాలు నాలుగు రోజులపాటు పంటలు నీటిలోనే ఉండిపోయాయి. రూ.6.50 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అప్పుడు సోయా తుడిచిపెట్టుకుపోయింది. దాని స్థానంలో పొగాకు వేయగా దానిదీ అదే పరిస్థితి. వెనుక జలాలు ముందుకు కదిలితే గాని, మునిగిన పంటలు తేలవు. మంగళవారం ఉదయం నుంచి రెవెన్యూ అధికారులు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు అధికారులతో ఈ విషయమై చర్చించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు 48 గంటల్లో 2 అడుగులకుపైగా దిగువకు వదిలేశారు.

విష్ణుపురి గేట్లు ఎత్తివేత

నాందేడ్‌, న్యూస్‌టుడే: నాలుగు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాల కారణంగా విష్ణుపురి జలాశయం 11 గేట్లు ఎత్తి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గోదావరి నది ఒడ్డున ఉన్న కాళేశ్వర, ఊర్వసి, శని తదితర మందిరాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎటు చూసినా రహదారుల వెంట నీరు కాలువల్లా పారుతోంది.

అలీసాగర్‌

ఎడపల్లి, న్యూస్‌టుడే: అలీసాగర్‌ జలాశయం మూడు గేట్లను మంగళవారం జల వనరుల శాఖ అధికారులు ఎత్తారు. జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో అప్రమత్తమైన అధికారులు గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. మొత్తం సామర్థ్యం 304 ఎంసీఎఫ్‌టీలు కాగా ప్రస్తుతం 278 ఎంసీఎఫ్‌టీల నీటి నిల్వ ఉన్నట్లు డీఈ లోక్యానాయక్‌ తెలిపారు. ఇన్‌ఫ్లో 1100, అవుట్‌ ఫ్లో 980 క్యూసెక్కులు ఉందన్నారు.

36 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తుపాను ధాటికి మంగళవారం సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా 36 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు కలెక్టరేట్‌ వర్గాలు పేర్కొన్నాయి. జిల్లాలో కురుస్తున్న జోరు వర్షాలకు సోమవారం 14 ఇళ్లు దెబ్బతినగా రెండో రోజు మరింత ఎక్కువ నష్టం జరిగింది. రెండ్రోజుల్లో మొత్తం 50 నివాసాలు ధ్వంసం కాగా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. జిల్లా పాలనాధికారి పాటిల్‌ ఆదేశాలనుసారంగా రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పురాతన పెంకుటిళ్లలో నివాసముంటున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గూడు కోల్పోయిన బాధితులకు రేషన్‌ బియ్యం అందిస్తున్నారు.


సురక్షిత ప్రాంతాలకు తరలింపు

నిజామాబాద్‌ నగర శివారులోని ఖానాపూర్‌లో ఇళ్లల్లోకి వచ్చిన నీరు

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: నగరంలోని చంద్రశేఖర్‌ కాలనీ, దుబ్బ, కెనాల్‌కట్ట, ఆటోనగర్‌, మాలపల్లి, బోధన్‌ రోడ్డుతో పాటు శివారు కాలనీల్లో నీళ్లు నిలిచాయి. వినాయక్‌నగర్‌-పద్మనగర్‌ మధ్య గల పులాంగ్‌ వాగు రోడ్డుపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గంగాస్థాన్‌-గూపన్‌పల్లి మధ్య ఉన్న గుడిసెల్లోకి వరద చేరడంతో వారిని మరో భవనంలోకి తరలించారు. పాంగ్రా శివారులో గుడిసెవాసులకు సత్యనారాయణ స్వామి మందిరంలో ఆశ్రయం కల్పించారు. గంగాస్థాన్‌-గూపన్‌పల్లి నిర్వాసితులకు ఫుడ్‌ బ్యాంక్‌ ప్రతినిధి, నవీన్‌ చంటి, పాంగ్రాలో హెల్పింగ్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు రమణ్‌రెడ్డి, ప్రశాంత్‌, కార్తీక్‌రెడ్డి, భూపతిప్రభు భోజనాలు పంపిణీ చేశారు.


ఉరకలెత్తిన వాగులు..


కప్పలవాగు ఉద్ధృతికి సిరికొండ మండలం పెద్దవాల్గోట్‌లో కూలిపోయిన వైకుంఠధామం

గోదావరి, మంజీర, హరిద్రా నదుల ఉద్ధృతితో కందకుర్తి త్రివేణి సంగమం వద్ద వంతెనపై నుంచి నీరు పారింది. సిరికొండ మండలం కొండూర్‌ శివారులో కప్పలవాగుపై నిర్మించిన చెక్‌డ్యాంకు గండి పడింది. తూంపల్లి, పాకాల మధ్య కప్పలవాగు వంతెన తెగి లోతట్టు ప్రాంతాలకు వరద ప్రవహించింది. ఇందల్‌వాయి మండలం వాడి, నందిపేట్‌ మండలం తల్వేద, జోర్‌పూర్‌, వెల్మల్‌, వెంచిర్యాల్‌లో పెద్దవాగు, ఆర్మూర్‌ గూండ్ల చెరువు, ఆలూర్‌ వాగులు ఉరకలెత్తాయి. బడాభీమ్‌గల్‌ చెరువు కట్ట కుంగిపోయింది. డిచ్‌పల్లి మండలం వెస్లీనగర్‌ తండా ముద్దకుంట కట్ట ప్రమాదకరస్థాయికి చేరింది. రామడుగు ప్రాజెక్టు అలుగు పారింది.


నది తీరాల్లోనే అధికంగా..

సాలూర వద్దమంజీరకు వరద పోటెత్తడంతో మునిగిన పాత వంతెన

ఈ సీజన్‌లో జులై 21-22, ఈ నెల 6-7, 27-28 తేదీల్లో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి భారీగా వరద వస్తోంది. మంజీరలోనూ ప్రవాహం పెరిగింది. రెంజల్‌ మండలం కందకుర్తి వద్ద మంజీర కలిసే చోట వరద నదీ తీరంలోని పొలాలను ముంచెత్తింది. శ్రీరాంసాగర్‌ రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యానికి మించి వెనుక జలాలు నిలిచిపోతున్నాయి. ఇవి సరిహద్దు గ్రామాల్లో పొలాలు మునిగేలా చేస్తున్నాయి. 2006, 2016తో పాటు ఈ ఏడాది రెండు సార్లు మునిగాయి. నదితీరంలోనే 60 శాతం నష్టం జరిగింది.


కళ్లెదుటే కొట్టుకుపోయె..


కాలూర్‌ వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని తాడు సాయంతో కాపాడుతున్న స్థానికులు

కళ్లెదుటే కల్లాలు కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని నిస్సాహాయస్థితిలో అన్నదాత బోరుమన్నాడు. పొలాలు కుంటలను తలపించాయి. వేల ఎకరాల్లో వరి నేలవాలింది. కోతకొచ్చిన సోయాకు మొలకలొచ్చింది. మొక్కజొన్న, పొగాదీ ఇదే పరిస్థితి. మంగళవారం వర్షం తగ్గుముఖం పట్టడంతో చేలల్లో నుంచి నీటిని తొలగించేందుకు రైతులు కష్టపడుతున్నారు. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం 10,146 ఎకరాల్లో పంట దెబ్బతింది. వెంచిర్యాల్‌ శివారులో చెక్‌డ్యాంకు గండి పడడంతో కల్లాలపై ఆరబెట్టిన వంద ఎకరాల మొక్కజొన్న, వరి కొట్టుకుపోయింది. జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌, సిబ్బందితో క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం లెక్కలు తీశారు. నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు ఆయన ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


స్తంభించిన రవాణా

జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లికి వెళ్లే తారురోడ్డు కొట్టుకుపోయింది. మాక్లూర్‌ మండలం మదన్‌పల్లి తండా నుంచి అమ్రాద్‌ తండాకు వెళ్లే తారురోడ్డు తెగిపోవడంతో ప్రయాణాలకు అంతరాయం తలెత్తింది. సిరికొండ మండలం గడ్కోల్‌ శివారులో రహదారి కోతకు గురైంది. ఆర్మూర్‌ మామిడిపల్లి ఎస్సీ కాలనీలో రోడ్లు కొట్టుకుపోయాయి. మానిక్‌బండార్‌ వద్ద జాతీయ రహదారిపై భారీగా వరద రావడంతో వాహనదారులను ఒకవైపు నుంచి దారి మళ్లించారు. ఆర్మూర్‌ మండలం దేగాం-మిర్ధాపల్లి గ్రామాల మధ్య ఉన్న వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో రాకపోకలను నిలిపేశారు.


భారీ వర్షాలతో పలు ప్రమాదాలు

ఒకరి మృతి

భగవాన్‌రెడ్డి కొట్టుకుపోయిన లింగాపూర్‌ అలుగు

కామారెడ్డి నేరవిభాగం : జిల్లాలో భారీ వర్షాలతో చెరువులన్నీ అలుగులు దూకుతుండటంతో మంగళవారం పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. లింగాపూర్‌ గ్రామానికి చెందిన పందిరి భగవాన్‌రెడ్డి(55) జిల్లా కేంద్రంలో కూరగాయలు అమ్మేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తూ గ్రామ చెరువు అలుగు ప్రవాహంలో కొట్టుకుపోయారు. రెండు గంటలపాటు గాలింపు అనంతరం మృతదేహం లభించిందని దేవునిపల్లి ఎస్సై రవికుమార్‌ తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మాచారెడ్డి మండలం వాడి- ఫరీద్‌పేట గ్రామాల మధ్యన లోలెవల్‌ వంతెన పైనుంచి పారుతున్న లొట్టి వాగు ప్రవాహంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో కొట్టుకుపోతుండగా రెండు గ్రామాల ప్రజలు అప్రమత్తమై ట్రాక్టర్‌ సాయంతో బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని