గుండె గూడు జాగ్రత్త
close
Published : 29/09/2021 05:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుండె గూడు జాగ్రత్త

జిల్లాలో హృద్రోగ బాధితులు ఎక్కువే

మారిన ఆహార అలవాట్లు, వ్యాయామం లేకపోవడమే కారణం

నేడు ప్రపంచ హృద్రోగ దినోత్సవం

బాపట్ల, న్యూస్‌టుడే

చిలకలూరిపేటకు చెందిన శ్రీనివాస్‌కు 35 సంవత్సరాలు. మార్కెటింగ్‌ జాబ్‌ చేస్తున్నాడు. ఓ రోజు విధి నిర్వహణలో భాగంగా గుంటూరుకు వచ్చాడు.. తిరుగు ప్రయాణమవుతుండగా, ఉన్నట్లుండి నడిరోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తే, పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో చనిపోయినట్లు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గుండెజబ్బుల బారినపడే వారిలో చిన్న వయసువారే ఎక్కువగా ఉంటున్నారు. గుండె సంబంధిత వ్యాధుల కేసుల్లో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందంటే, తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో అలక్ష్యం వహించడంతోనే ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మంచి ఆహారం, తగిన విశ్రాంతి తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఒత్తిడికి దూరంగా ఉండటం ద్వారా హృదయాన్ని పదిలపర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బుధవారం ప్రపంచ హృద్రోగ దినోత్సవం సందర్భంగా జిల్లాలో పరిస్థితులపై ప్రత్యేక కథనం.

ధునిక జీవన విధానం.. మారిన ఆహార అలవాట్లు.. శారీరక శ్రమ తగ్గడం.. తదితర కారణాలతో ప్రజలు ఎక్కువగా గుండెజబ్బుల బారినపడుతున్నారు. మేనరిక వివాహాలు, జన్యుపరమైన లోపాల వల్ల పుట్టే ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ముగ్గురికి హృదయ సంబంధ సమస్యలు వస్తున్నాయి. పిల్లల గుండెలో పడిన రంధ్రాలను శస్త్రచికిత్సలు ద్వారా పూడ్చాల్సి ఉంది. ఇటీవల కాలంలో మధ్య వయస్కులు ఇటీవల కాలంలో గుండె జబ్బుల బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా కొవ్వు ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్‌ తీసుకోవడం వల్ల ముప్పు మరింత ఎక్కువవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో కనీసం అరగంటపాటైనా వ్యాయామం చేయకపోవడం వల్ల గుండెకు గాయం చేస్తున్నారు. పొగ తాగే వారిలో హఠాత్తుగా గుండెపోటు బారినపడుతున్నారు. చిన్న వయసులోనే కొంతమంది బీపీ, షుగర్‌ వ్యాధుల బారినపడుతున్నారు. వీరికి ముప్పు పొంచి ఉందని తెలిసినా, ఆహారపు అలవాట్లు మార్చుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడంతో మృత్యువుకు చేరువవుతున్నారు.


ఐదేళ్లలోపు పిల్లల్లో 2.9 శాతం మంది గుండెజబ్బుల బారినపడుతున్నారు. మేనరిక వివాహాలు, జన్యుపరమైన లోపాలే ప్రధాన కారణమని ఎన్నారై వైద్య కళాశాల వైద్యులు చెబుతున్నారు.


30- 34 ఏళ్ల మధ్య  బాధితుల సంఖ్య ఐదు శాతానికిపైగా ఉందని ఇటీవల గుంటూరులోని  ఓ ప్రైవేటు పార్మసీ కళాశాల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.  


అందుబాటులో అధునాతన చికిత్స

* గుండెజబ్బు బాధితులకు మంగళగిరి ఎయిమ్స్‌, గుంటూరు సమగ్ర ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగం ద్వారా ఉచితంగా చికిత్స, శస్త్రచికిత్సలు చేస్తున్నారు. జీజీహెచ్‌లో 2018 డిసెంబరు నుంచి రూ.50 కోట్ల వ్యయంతో ఆధునిక క్యాథ్‌ల్యాబ్స్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

* పేద కుటుంబాలకు చెందినవారికి ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుండెజబ్బుతో బాధపడేవారికి సత్వరమే వైద్యం అందించటంతో పాటు ఉచితంగా స్టంట్లు అమర్చడం, శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు.

* పలు స్వచ్ఛంద సంస్థలు గుండె సంబంధ సమస్యలతో బాధపడే చిన్నపిల్లలకు చికిత్స చేయడంతో పాటు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.


అలవాట్లు మార్చుకుంటే మేలు

గుండెజబ్బుల బారినపడటానికి చాలా కారణాలు ఉన్నాయి. గుండెనొప్పి రావడానికి ప్రధాన కారణం రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడమే. దీని కారణంగా గుండెకు రక్తం సరిగా అందదు. ఫలితంగా గుండెనొప్పి వస్తుంది. మూడు పదుల వయసు ఉన్నవారు సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు.  వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె సమస్యల బారినపడకుండా ఆహారంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌తో గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. నిత్యం పెసలు నానబెట్టుకుని మొలకెత్తించి లేదా ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో తింటే కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జబ్బుల బారినపడకుండా కాపాడతాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపున రెండు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తింటే మంచింది. ఘాటుగా ఉంటే తేనెతో కలిపి తినవచ్చు. వెల్లుల్లిని తింటే రక్తనాళాల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. గుండెజబ్బులు రాకుండా ఉంటాయి.


గణాంకాలు ఏం చెబుతున్నాయి..

* గత ఏడాది గుండె సంబంధ సమస్యతో పుట్టిన పిల్లలు 174

* గుండెజబ్బు బారిన పడుతున్నవారి సగటు వయసు 49 ఏళ్లు

* జిల్లాలో గుండెపోటు బారిన పడుతున్న వారిలో పట్టణాలకు చెందిన పురుషులే ఎక్కువ

* 60 ఏళ్లు దాటిన వారిలో జబ్బుబారిన పడుతున్నవారు 25%


మేల్కోకుంటే ముప్పే..

ధూమపానం, తీవ్ర మానసిక ఒత్తిడి, సరైన నిద్రలేకపోవడం, బీపీ, మధుమేహం, ఊబకాయం వల్ల ఎక్కువ మంది గుండెజబ్బుల బారినపడుతున్నారు. మూడు పదుల వయసులో యువత సైతం గుండెపోటుకు గురికావడం ఆందోళనకరం. ఆహార అలవాట్లు పూర్తిగా మార్చుకోవాలి. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆకుకూరలు, పోషకాహారం తీసుకుంటూ నడక, వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఒత్తిడికి లోను కారాదు. నలభై ఏళ్లు దాటినవారు మాంసాహారం తక్కువగా తినాలి. మసాలా ఆహారం జోలికి పోరాదు. రోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. తగిన విశ్రాంతి తీసుకోవాలి.

- సాంబశివరావు, సీనియర్‌ వైద్యుడు


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని