భద్రతకు భరోసా ఏదీ?
close
Published : 29/09/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భద్రతకు భరోసా ఏదీ?

చాలా చోట్ల పనిచేయని సీసీ కెమెరాలు

ఆసుపత్రిలో కొరవడుతున్న పర్యవేక్షణ

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

తంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా ఆసుపత్రిలో శిశువు మాయమైన సంఘటన ఆసుపత్రిలో భద్రత వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. పలు రకాల పరీక్షల నిమిత్తంగా అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తేవడంతో జిల్లా నలుమూలలనుంచి రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. ప్రధానంగా ప్రసూతి సేవలకు వచ్చేవారు కూడా అధికంగా ఉంటారు. అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నా తగు భద్రత కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బందరులోని జిల్లా ఆసుపత్రిలో గతంలో వాహనాలు మాయం కావడం, వెనుక నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించడం వంటి సంఘటనలతో వైద్యశాల ఆవరణలో సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా పోలీసులు కూడా వివిధ ప్రాంతాలు పరిశీలించి మొత్తం 18 చోట్ల కెమెరాలు పెట్టాలని సూచించారు. దానికి అనుగుణంగా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. కేవలం ఎనిమిది చోట్ల మాత్రమే ఏర్పాటు చేసి వదిలేశారు. రాకపోకలు సాగించే ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటుచేశారు. కానీ ఆసుపత్రి వెనుక ప్రాంతంలో, మార్చురీ, టీబీ వార్డు, డయాలసిస్‌ కేంద్రం.. ఆవరణతో పాటు బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కెమెరాల్లో కూడా ఎన్ని పనిచేస్తున్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఆసుపత్రి ముఖద్వారం బయట ఏర్పాటు చేసిన కెమెరా పాడైపోవడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అన్నీ పని చేస్తున్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ  పోలీసులు సూచించిన ప్రాంతాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. నిత్యం వందలాదిమంది రోగులు, వారి వెంట వచ్చేవారితో ఎవరు ఎందుకు వస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్న తరుణంలో నిఘా మరింత పటిష్ఠం చేయాల్సిన ఆవశ్యకతను శిశువు మాయమైన సంఘటన తెలియజేస్తోంది.

ట్యాగ్‌లు వేయడమూ మానేశారు

ఆసుపత్రికి వందలమంది గర్భిణులు వస్తుంటారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు అందుబాటులో ఉన్నా మెరుగైన వైద్యసేవలు అందుతాయన్న లక్ష్యంతో ఎక్కువమంది జిల్లా ఆసుపత్రినే ఆశ్రయిస్తారు. కేవలం గైనిక్‌కు సంబంధినవారే అధికంగా ఉండటం గమనార్హం. ప్రసవం కొద్దిపాటి ఇబ్బందికరంగా ఉన్నా ఆయా పీహెచ్‌సీ వైద్యులు జిల్లా వైద్యశాలకే సిఫార్సు చేస్తారు. స్కానింగ్‌ వంటి పరీక్షలతో పాటు గర్భిణులకు అవసరమైన అన్ని సేవలూ ఉచితంగా అందించడంతో ప్రసవాలకు ఎక్కువగా జిల్లా ఆసుపత్రికే ఆశ్రయిస్తుంటారు. ప్రస్తుతం రోజుకు సగటున 25 ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రసవమైన తరువాత అనారోగ్య  సమస్యలున్న శిశువులను ఇంక్యుబేటర్‌లలో ఉంచి చికిత్స అందిస్తుంటారు. తల్లికి దూరంగా వైద్యసిబ్బంది పర్యవేక్షణలో శిశువులున్నా వారి భద్రత నిమిత్తం గతంలో ప్రత్యేకంగా రూపొందించిన ట్యాగ్‌లు వేసేవారు. దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సెన్సార్లు కూడా అమర్చారు. శిశువును ఎవరైనా బయటకు తీసుకెళ్తే సెన్సార్ల ద్వారా బజర్‌ మోగి సిబ్బందిని అప్రమత్తం చేసేలా ఏర్పాట్లు చేశారు.   గుత్తేదారు సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించి నిర్వహించేలా చేసిన ఏర్పాట్లు కొన్నేళ్లుగా నిలిచిపోయాయి. ఒప్పంద కాలం ముగిసిపోవడం, అధికారులు దానిని పునరుద్ధరించకపోవడంతో ఆ సంస్థకు చెందిన సిబ్బంది వెళ్లిపోయారు. ఏళ్లు గడిచిపోతున్నా.. దాని గురించి అధికారులు పట్టించుకోవడం లేదు.  ట్యాగ్‌ ఉంటే ఇటీవల మాయమైన శిశువును ఆసుపత్రి దాటకుండానే గుర్తించి ఉండేవారు. ట్యాగ్‌లు వేయాల్సిన ఆవశ్యకతను గుర్తించి తిరిగి ఏర్పాటు చేయాలని  ప్రజలు కోరుతున్నారు.


ఎవరొస్తున్నారు.. ఎందుకు వస్తున్నారు?

సుపత్రికి ఎవరొస్తున్నారు.. ఎందుకు వస్తున్నారో కూడా తెలియని పరిస్థితి.  ఆయా వార్డులతో పాటు ముఖద్వారాల వద్ద పర్యవేక్షణ నిమిత్తం సెక్యూరిటీ గార్డులను నియమించారు. ప్రస్తుతం 50మంది వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రధాన ముఖద్వారం వద్ద కొన్ని సందర్భాల్లో ఎవరూ కనిపించరు. గతంలో ఆసుపత్రికి వచ్చి పోయేవారి వివరాలు సేకరించే ఏర్పాట్లు చేయాలని భావించినా అమలు కాలేదు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటే శిశువు మాయమైన సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.  


ప్రత్యేక దృష్టి

- డా.జయకుమార్‌, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌

ఆసుపత్రికి వచ్చే రోగుల భద్రతపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. దీనిలో భాగంగా వార్డుల్లోకి రోగితో పాటు వారికి సేవలు అందించేందుకు సహాయకులుగా ఒకరిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించాం. వారికి ఆసుపత్రి నుంచి పాస్‌లు జారీ చేస్తాం. ఆ పాస్‌ ఉన్నవారిని మాత్రమే సెక్యూరిటీ సిబ్బంది అనుమతిస్తారు. మాతా, శిశుసంరక్షణ విభాగంలో సెన్సార్‌ ట్యాగ్‌లు వేసే ప్రాజెక్టు అయిపోయింది. ప్రస్తుతం తల్లికి, బిడ్డకు ఒక సంఖ్య కేటాయించి ట్యాగ్‌లు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పలు చోట్ల సీసీకెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. త్వరలోనే కెమెరాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని