దారి తప్పుతున్నారు.. బాసూ!
close
Updated : 29/09/2021 06:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దారి తప్పుతున్నారు.. బాసూ!

కొందరి నిర్వాకంతో.. పోలీసు శాఖ ప్రతిష్ఠకే మచ్చ

అవినీతి ఆరోపణలు.. అసాంఘిక కార్యకలాపాలు

 హెచ్చరిస్తున్నా.. కొన్ని స్టేషన్లలో ఇష్టారీతి

 


రాజమహేంద్రవరం, కాకినాడలోని అర్బన్, జిల్లా ఎస్పీ కార్యాలయాలు

ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే, కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ఆపద ఎదురైతే పోలీసులు ఉన్నారనే భరోసా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే రక్షణ కల్పిస్తారనే ధీమా.. కొందరి విధులు నిబద్ధతతో సాగుతున్నా.. మరికొందరి తీరు మొత్తం పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠకే భంగం కలిగిస్తోంది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన ఈ శాఖలో కొందరు అవినీతికి ఆజ్యం పోస్తుంటే.. మరికొందరు అనుచిత ప్రవర్తనతో పరువును మంటగలిపేస్తున్నారు.. ఇంకొందరు రోడ్లపై, స్టేషన్లలో బాహాబాహీకి దిగుతున్నారు. జిల్లాకు ఇద్దరు కొత్త ఎస్పీలు వచ్చాక పరిస్థితి చాలావరకు గాడిన పడినా.. అక్కడక్కడా వెలుగుచూస్తున్న వ్యవహారాలు ఇబ్బందిగా మారాయి. గాడితప్పుతున్న ఈ పరిస్థితులపై పోలీసు బాసులు మరింత దృష్టిసారిస్తే ఫలితం ఉంటుంది.

జిల్లా పోలీసు కార్యాలయం పరిధిలో ఆరు సబ్‌ డివిజన్లు, 32 సర్కిళ్లు, 71 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. రాజమహేంద్రవరం అర్బన్‌ పోలీసు శాఖ ఐదు జోన్లలో విస్తరించగా.. 12 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. జిల్లా ఎస్పీగా ఎం.రవీంద్రనాథ్‌బాబు, అర్బన్‌ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగీ కొలువుదీరాక.. పరిస్థితిలో కొంత మార్పు  కనిపించినా.. చక్కదిద్దాల్సింది చాలానే కనిపిస్తోంది. 

అర్బన్‌ ఎస్పీ పరిధిలో..

హవ్వ.. ఇదేం పని..?: కడియం పోలీసుస్టేషన్‌లో రాత్రి విధుల క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్‌తో సీఐ వ్యవహార శైలి వివాదాస్పదం అయింది. విషయం రచ్చకెక్కడంతో ఆయనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

నడిరోడ్డుపై జగడం: రాజమహేంద్రవరంలో ఓ కానిస్టేబుల్‌ బంధువు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. తనిఖీల్లో భాగంగా వాహనాన్ని ఆపి ట్రాఫిక్‌ ఎస్సై ప్రశ్నించారు. దీంతో ఎస్సై తనను తిట్టారని ఆ వ్యక్తి ఫోన్‌చేయగా కానిస్టేబుల్‌ అక్కడకు వచ్చారు. ఎస్సైకు నచ్చజెప్పే క్రమంలో మాటమాట పెరిగింది. వాహనం మాకు అవసరం లేదని కానిస్టేబుల్‌ పెట్రోల్‌ తెచ్చి దానిపై పోయడం.. ఎస్సైపై కొంత పడటంతో ఆయన ఆగ్రహంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై తిట్టారని కానిస్టేబుల్‌ బంధువు సైతం ఫిర్యాదు చేశారు. 

ప.గో.జిల్లావాసి తన సొమ్ము చోరీకి గురైందని నిరుడు రాజమహేంద్రవరం ఒకటో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆ స్టేషన్‌ అధికారి ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇబ్బంది ఉంటుందని తప్పుదోవ పట్టించి.. రూ.5 లక్షలు మాత్రమే పోయాయని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించారు. తీరా దొంగను పట్టుకుని మొత్తం డబ్బు స్వాధీనం చేసుకున్నా.. బాధితుడికి పూర్తిగా ఇవ్వకపోవడంతో వ్యవహారం ఉన్నతాధికారులకు చేరింది. విచారణ జరిపి విధుల నుంచి తొలగించారు.

చూస్తే.. చాలానే ఉంది

తనపై దాడి చేశారని ఓ వైద్య ఉద్యోగిని, ఆమె భర్త ఆరోపించారు. రాజమహేంద్రవరం వ΄డో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ వ్యవహారం చర్చనీయాంశం అయింది. ఈ వ్యవహారంపై అప్పట్లో విచారణ జరిపారు. ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగిని ఇటీవల వీఆర్‌కు పంపారు.

ప్రకాశంనగర్, రెండో పట్టణ క్రైమ్‌ స్టేషన్లలో ఇద్దరు కానిస్టేబుళ్లు తనను కొన్ని ప్రదేశాలకు పంపి దొంగతనాలు చేయించేవారనీ, ఆ డబ్బు, బంగారం వాళ్లే తీసుకునేవారని.. ఎవరికైనా చెబితే కేసులు పెడతామని వేధిస్తున్నారని ఓ మహిళ జులై 19న డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ నివేదిక ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. 

అవినీతి ఆరోపణలపై అయినవిల్లి ఎస్సైను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. డ్రైవర్‌ ద్వారా వివిధ కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేల్చారు. ఇదే స్టేషన్లో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు చించేసి.. నిందితుల పేర్లు తొలగించారనే ఆరోపణలపై నెల కిందట ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించారు.

ఓ కేసు విచారణలో భాగంగా ఇద్దరు వ్యక్తులను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణల నేపథ్యంలో కొత్తపేట ఎస్సైను ఉన్నతాధికారులు ఇటీవల సస్పెండ్‌ చేశారు. ఈ కేసులో సీఐకూ ఛార్జిమెమో జారీచేశారు. ఎస్సైకు మద్దతుగా వివిధ పార్టీల నాయకులు ఆందోళన సైతం చేపట్టారు. 

జిల్లా ఎస్పీ పరిధిలో..

బాహాబాహీ: పిఠాపురం గ్రామీణ ఠాణాలో ఏఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌ మధ్య వివాదం కొట్లాట వరకు వెళ్లింది. ఓ కేసు వివరాలు పెన్‌డ్రైవ్‌లోకి ఎక్కించి.. ప్రింట్‌ తీయాలని ఏఎస్సై ఆదేశించారు. పెన్‌డ్రైవ్‌లో వైరస్‌తో కంప్యూటర్‌ పాడవుతుందని హెచ్‌సీ అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి పరస్పరం దూషించుకోవడం చర్చనీయాంశం అయింది. ఇద్దర్నీ స్టేషన్‌కు పిలిపించిన ఎస్పీ.. హెచ్చరించి.. శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

అడ్డుకోకుండా... ఆడుకుంటున్నారు: పేకాట శిబిరాలపై నిఘా వేయాల్సిన పోలీసులే.. ఓలాడ్జీలో పేకాట ఆడుతూ స్పెషల్‌ బ్రాంచి పోలీసులకు చిక్కారు. తొండంగి మండలం బెండపూడి శివారులో ఓ లాడ్జిలో ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్, మరో వ్యక్తి పోలీసులకు దొరికారు. దీనిపై కేసు నమోదైంది.

బాధ్యతా రాహిత్యాన్ని సహించం

పోలీసు విధుల్లో క్రమశిక్షణ ముఖ్యం. బాధ్యతా రాహిత్యాన్ని సహించం. తప్పుచేస్తే కఠిన చర్యలు తప్పవు. మిగిలిన సిబ్బందిని అప్రమత్తం చేసేలా ఎస్పీలతో సిబ్బంది పనితీరుపై.. కేసుల పరిష్కారంపై సమీక్షిస్తున్నాం. లోపాలు గుర్తించినచోట విచారణ నివేదికల ఆధారంగా గట్టి చర్యలు తీసుకుంటున్నాం.  -కె.వి.మోహనరావు, డీఐజీ 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని