కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే
close
Published : 01/02/2020 16:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల ఊసేలేదు. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మంజూరు చేయలేదు.  కొనసాగుతున్న ప్రాజెక్టులు, రైల్వేలైన్‌లకు కూడా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంపై తెలుగు ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సీజన్‌ కాకపోవడం, రాజకీయ ఒత్తిడిలు పెద్దగా లేకపోవడంతోనే తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అంతగా ప్రాధాన్యమివ్వలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

విశాఖ రైల్వే జోన్‌ ఊసేది?
విశాఖ రైల్వే జోన్‌ ప్రకటించి ఏడాది కావస్తున్నా ఆచరణలో మాత్రం అర అంగుళం కూడా ముందడుగు పడలేదు. కేంద్ర బడ్జెట్‌లో జోన్‌కు సంబంధించిన నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని ఆశించిన విశాఖ వాసులకు నిరాశే మిగిలింది. వాల్తేరు డివిజన్‌ను విశాఖ జోన్‌లోనే ఉంచుతూ కొత్త రైల్వే మార్గాలు వేయాలని, విశాఖ రైల్వేజోన్‌ పరిధిలో సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులు కేటాయించాలని, అదనపు ట్రాక్‌లతో పాటు ఫ్లాట్‌ ఫాంల నిర్మాణంపైనా కేంద్రం దృష్టి సారించాలని,  దేశంలోని వివిధ ప్రదేశాలకు విశాఖ నుంచి నేరుగా కొత్త రైళ్లు కేటాయించాలని నగర వాసులు ఆశించినా ఫలితం లేకపోయింది. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయలేదు. భాజపా అధికారంలో ఉన్న కర్ణాటక రాజధాని బెంగళురుకు మాత్రం రూ.18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టు చేపట్టనునన్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు చేస్తామని భాజపా నేతలు ఎప్పటి నుంచో  చెబుతున్నా... దీనిపై కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనా చేయలేదు. శ్రీకాళహస్తి- నడికుడి, బెంగళూరు-కడప, కోటిపల్లి-నర్సాపురం లైనుకు సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టత లేదు. వీటన్నింటికీ భూసేకరణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప నిధులు మాత్రం కేటాయించడంలేదు. గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని నడికుడి-శ్రీ కాళహస్తి  రైల్వేలైను ఏర్పాటుకు భూసేకరణ దశకొచ్చినా పరిహారాలు ఇవ్వలేదు. 308 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన ఈ మార్గానికి 2011లో రూ.1,310 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఇప్పుడది రూ.1,600 కోట్లకు పైగా చేరింది.

రాజధాని నిర్మాణానికి అందని సహకారం

 కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ లోటు బడ్జెట్‌లో ఉన్నందున  రాజధాని నిర్మాణానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే సహకరిస్తుందని ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి నిర్మాణానికి రూ.1500 కోట్లు మాత్రమే కేటాయించారు. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తవించలేదు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చే దిశగా ఆర్థిక మంత్రి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.  25 ఎంపీ సీట్లను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల సందర్భంగా వైకాపా ప్రకటించినా ఆ దిశగా కేంద్రంపై ఇప్పటి వరకు ఒత్తిడి చేసిన దాఖలాలు లేవు. దీంతో బడ్జెట్‌లో కనీసం ప్రత్యేక హోదా ప్రస్తావన రాలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వమే  పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

తెలంగాణకు మొండి చెయ్యే?
పన్నుల వాటా, గ్రాంట్లు తప్ప రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఇస్తున్న నిధులు పెద్దగా ఏమీ లేవు. విభజన నాటి హామీలూ అమలు కాలేదు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు భాజపా హామీ ఇచ్చినా ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. మిషన్‌ భగీరథ, కాళేశ్వరం.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్వహణకు వచ్చే ఐదేళ్లలో రూ.52,941 కోట్లు కేటాయించాలంటూ సీఎం కేసీఆర్‌  కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వీటికి సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనా రాలేదు.  కాజీపేటలో రైల్వే వ్యాగన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నా కేంద్రం పట్టించుకోలేదు.

వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ అండ్‌ కన్జర్వేషన్‌ పథకం ప్రవేశ పెట్టిన కేంద్రం ... అందులో తెలుగు రాష్ట్రాలకు చోటు కల్పించలేదు.   హరియాణాలోని రాఖీగఢ్‌, యూపీలోని హస్తినాపూర్‌. అసోంలోని శివసాగర్‌, గుజరాత్‌లోని ధోలావిర, తమిళనాడులోని ఆదిత్య నల్లూరును కేంద్రం ఎంపిక చేసింది. . పర్యాటకరంగ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల్లో  ప్రముఖ పర్యాటక కేంద్రాలు అనేకం ఉన్నప్పటికీ ఒక్క రూపాయికూడా కేటాయించలేదు. మొత్తం మీద ..ఇవాళ్టి  కేంద్ర బడ్జెట్‌పై తెలుగు ప్రజలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్‌పై రాజకీయ పార్టీల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని