బడ్జెట్‌ 2020: ఎవరేమన్నారంటే?
close
Published : 01/02/2020 17:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌ 2020: ఎవరేమన్నారంటే?

దిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం లోక్‌సభలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మూడు కీలక అంశాలతో దీన్ని రూపొందించారు. ఆశావాహ భారత్‌- ఇది ప్రజలకు మెరుగైన జీవితాన్ని ఇవ్వడం, అందరికీ ఆర్థికవృద్ధి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడం వంటి కీలక అంశాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ను తీసుకొచ్చారు. ఈ బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే..

* ఈ బడ్జెట్‌ సరికొత్త ఇండియాను నిర్మించగలదనే నమ్మకాన్ని ఇస్తుంది. రాబోయే సంవత్సరాల్లో దేశం ఆరోగ్యంగా, సంపదను కలిగి ఉండేలా  ఇది చేస్తుంది. అన్ని రంగాల అభివృద్ధి, సంక్షేమంపైనే ఈ బడ్జెట్‌ పూర్తిగా దృష్టి పెట్టింది. రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అద్భుతమైన బడ్జెట్‌ను అందించినందుకు ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు అభినందనలు. ఈ బడ్జెట్‌ వల్ల భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలని ప్రధాని మోదీ పెట్టుకున్న లక్ష్యం 2024-25కు తప్పకుండా సాకారం అవుతుంది.- కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
* దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. కానీ యువతకు ఉద్యోగ కల్పనకు సంబంధింని వ్యూహాత్మక ఆలోచనలేవీ నాకు కనిపించలేదు. ప్రభుత్వం బాగా చేశామని చెప్పుకొంటుంది. అది ప్రభుత్వం ఆలోచనా తీరు. కానీ ఇందులో ఆశించదగిన విధంగా ఏమీ లేదు. చరిత్రలో ఇదే సుదీర్ఘమైన ప్రసంగం కావొచ్చు. కానీ ఇందులో ఏమీ లేదు. భయంకరంగా ఉంది.- కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ
* ఈ బడ్జెట్‌పై దిల్లీ చాలా అంచనాలు పెట్టుకుంది. కానీ మా పట్ల మరోసారి సవతి తల్లి ప్రేమను చూపించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురి చేసింది. దిల్లీ ముఖ్యం కాదని భాజపా నిరూపించింది.- దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌
* అభివృద్ధి ధ్యేయంగా కేంద్రం ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌ ఉద్యోగాల సృష్టికి, రైతుల సంక్షేమానికి ఉపయోగపడుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇటువంటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు.- యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌
* పన్ను వ్యవస్థను హేతుబద్ధీకరించడానికి, మౌలిక సదుపాయాలను పెంచేందుకు, బ్యాంకింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రభావవంతమైన చర్యలు తీసుకుంది. 5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని మోదీ ప్రభుత్వం సులభంగా చేరుకుంటుంది.- కేంద్ర మంత్రి అమిత్‌షా
* పాత నినాదాలకు కొత్త హంగులు జోడించారు. మనం స్టాండప్‌ ఇండియా నుంచి సిట్‌ డౌన్‌ ఇండియాకు వెళ్తున్నాం. అయితే ఆదాయపు పన్ను శ్లాబులో మార్పులు చేసి మధ్యతరగతి ప్రజలకు కొంత ఊరట కలిగించారు.- కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌
*ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై కేంద్రం దృష్టి సారించినందుకు సంతోషంగా ఉంది. వైద్య రంగం, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఇది చాలా సంతృప్తికరమైన బడ్జెట్‌.- ప్రముఖ పారిశ్రామిక వేత్త కిరణ్‌మజూందార్‌ షా
* కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చూసి షాక్‌ అయ్యా. వారసత్వంగా వస్తున్న ప్రభుత్వ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఎలా దాడి చేస్తుందో చూశారా? ఇది ఒక శకానికి ముగింపా?- పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
* సామాన్యులకు, పారిశ్రామిక వేత్తలకు ఎటువంటి ఊరట కలిగించే వాటిపై కేంద్రం దృష్టి పెట్టలేదు. అభివృద్ధిపై బడ్జెట్‌ ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. ఎల్‌ఐసీలోని వాటాలను విక్రయిస్తామని ప్రకటించడం నిరాశకు గురి చేసింది. సామాన్యులు తాము ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఎల్‌ఐసీలో పెడతారు. కానీ ఇప్పుడు వారందరినీ ప్రభుత్వం మోసం చేసింది. సుదీర్ఘమైన బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సంబంధించిన ప్రణాళికలేమీ లేవు.- రాజస్థానన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌
* ఇది సమతుల్యమైన బడ్జెట్‌. 5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇది దోహదపడుతోంది. ఎల్‌ఐసీ వాటాల అమ్మకం చాలా పారదర్శకంగా జరుగుతుంది. వాటాల విక్రయం వల్ల ఎటువంటి హాని ఉండబోదు.- కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌

* ఇది చాలా పెద్ద బడ్జెట్‌.. దాన్ని నేను గ్రహించలేకపోయాను.- మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని