కలప బ్యాటరీ
close
Published : 07/07/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కలప బ్యాటరీ

నదులు, సముద్రాల్లో అప్పుడప్పుడు కలప దుంగలు తేలియాడుతుండటం చూసే ఉంటారు. ఇవి జలాల్లో తేలియాడుతున్నప్పుడు పక్షులు సేద తీరటానికి, చేపల వంటి జీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంటాయి. షిప్‌వార్మ్‌, బ్యాక్టీరియా వంటివి వీటిని కుళ్లిపోయేలా చేసి పోషకాలుగా మార్చేస్తుంటాయి. దీంతో అక్కడి జీవులకు ఆహారమూ లభిస్తుంది. కొన్నిసార్లు ఇవి తీరాలకు కొట్టుకొని వస్తుంటాయి. ఇవి ఇసుక మేటలకు పునాదిగానూ నిలుస్తుంటాయి. ఇలాంటి దుంగలను చాలావరకు కాల్చేయటమో, చెత్తకుప్పలుగా వదిలేయటమో చేస్తుంటారు. మనమంటే వీటిని చూసీ చూడనట్టు వదిలేస్తుండొచ్చు గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. వ్యర్థాలను సైతం అర్థంగా మార్చటానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. నెదర్లాండ్‌ శాస్త్రవేత్త అబ్దుల్లా ఖతార్నే, బృందం కూడా ఇలాగే విభిన్నంగా ఆలోచించింది. కొట్టుకొచ్చిన కలప దుంగలను ఎలక్ట్రిక్‌ కార్ల బ్యాటరీ పరిజ్ఞానంలో వాడే కార్బన్‌కు ముడిపదార్థంగా మలచటంలో విజయం సాధించారు. దుంగలను ముందుగా హైడ్రోథర్మల్‌ కార్బనైజేషన్‌ ప్రక్రియతో శుధ్ది చేశారు. ఇందులో భాగంగా వీటిని నీటిలో ముంచి, ఒత్తిడికి గురిచేశారు. హైడ్రోచార్‌ అనే గట్టి కర్బనంగా మారేంతవరకు 200 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రత వద్ద వేడిచేశారు. ఈ హైడ్రోచార్‌ను అత్యధిక.. అంటే 1400 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతకు గురిచేసి హైడ్రోకార్బన్‌ పదార్థంగా మార్చారు. దీన్ని సామర్థ్యాన్ని సోడియం అయాన్‌ బ్యాటరీల్లో పరీక్షించి చూడగా.. బ్యాటరీలు మరింత సమర్థంగా పనిచేయటం విశేషం.

సాధారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు లిథియం అయాన్‌ బ్యాటరీలతో నడుస్తాయి. కానీ లిథియం చాలా ఖరీదైనది. పైగా పర్యావరణానికీ హాని చేస్తుంది. అందుకే సోడియం అయాన్‌ బ్యాటరీలు ప్రత్యామ్నాయం కాగలవని భావిస్తున్నారు. కాకపోతే ఈ బ్యాటరీలకు అవసరమైన గట్టి కర్బనాన్ని తయారుచేయటానికి శిలాజ ఇంధనాలను వాడుతున్నారు. ఇదీ పర్యావరణానికి హాని చేసేదే. ఈ నేపథ్యంలో కొట్టుకొచ్చే దుంగలు బాగా ఉపయోగపడగలవని ఆశిస్తున్నారు. నదుల ద్వారా కొట్టుకొచ్చే దుంగలు ఆనకట్టల నిర్వాహకులకు పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. తాజా పరిజ్ఞానం ఆచరణలోకి వస్తే ఇలాంటి ఇబ్బందులకు తెరపడుతుంది. పర్యావరణహిత బ్యాటరీల తయారీకి సైతం మార్గం సుగమమవుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని