ప్లాస్టిక్‌ స్పాంజి!
close
Published : 14/07/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్లాస్టిక్‌ స్పాంజి!

సైన్స్‌ మాయ

కాలుష్యాన్ని కాలుష్యంతోనే అరికట్టాలి! ప్లాస్టిక్‌ వ్యర్థాల విషయంలో శాస్త్రవేత్తలు ఇలాగే ఆలోచిస్తున్నట్టుంది. సహజంగా క్షీణించే (బయోడీగ్రేడబుల్‌) ప్లాస్టిక్‌ను పునర్వినియోగించుకోవటానికి వీలుగా స్పాంజి (ఫోమ్‌) మాదిరిగా మార్చే ప్రక్రియను రూపొందించారు మరి. నిజానికి క్షీణించే ప్లాస్టిక్‌ పర్యావరణానికి మంచిదే. వీటిని త్వరగా క్షీణించేలా ప్రత్యేకంగా తయారుచేస్తుంటారు. వంటింట్లో వాడుకునే ప్లాస్టిక్‌ కత్తులు, చెంచాలు, ఫోర్క్‌లు ఇలాంటివే. కాకపోతే ఇవి పునర్వినియోగానికి పనికిరావు. తిరిగి వేరే వస్తువులుగా మార్చిన ప్రతిసారీ దృఢత్వం తగ్గుతూ వస్తుంది. ఉదాహరణకు క్షీణించే ప్లాస్టిక్‌ చెంచాను కరిగించి మరో చెంచాను తయారుచేశారనుకోండి. నోట్లో పెట్టుకోగానే విరిగిపోవచ్చు. అదే స్పాంజి మాదిరిగా మార్చగలిగితే ఇతర వస్తువులను తయారుచేయటం తేలికవుతుంది. మామూలు ప్లాస్టిక్‌ను తప్ప క్షీణించే ప్లాస్టిక్‌ను స్పాంజి మాదిరిగా మార్చటం అసాధ్యమని ఇప్పటివరకూ భావించేవారు. కానీ న్యూజిలాండ్‌లోని కాంటెర్‌బరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన పద్ధతితో ఇది సాధ్యమేనని నిరూపించారు. ముందుగా ప్లాస్టిక్‌ను కార్బన్‌ డయాక్సైడ్‌తో నింపిన పెట్టెలోకి పంపించి, లోపల క్రమంగా పీడనాన్ని పెంచారు. పీడనం పెరుగుతున్నకొద్దీ ప్లాస్టిక్‌లోకి కార్బన్‌ డయాక్సైడ్‌ ఇంకటం మొదలైంది. అనంతరం ఒక్కసారిగా పెట్టెలోని పీడనాన్ని విడుదల చేయగా కార్బన్‌ డయాక్సైడ్‌ విస్తరించి, ప్లాస్టిక్‌ చిన్న చిన్న అరలతో కూడిన స్పాంజి మాదిరిగా తయారైంది. ఉష్ణోగ్రత, పీడనం నియంత్రించటం ద్వారా ఈ అరల సైజునూ నిర్ణయించుకునే అవకాశం ఉండటం గమనార్హం. దీన్ని రకరకాల వస్తువులు తయారు చేయటానికి తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇది కాలుష్యం బెడద తగ్గటానికి ఉపయోగపడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సహజంగా క్షీణించే అవకాశం ఉన్నప్పటికీ ప్లాస్టిక్‌ను తిరిగి సమర్థంగా వినియోగించుకోగలిగితే ఇంకా మేలే కదా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని