అంగన్వాడీ పెద్దక్క!
close
Updated : 17/03/2021 19:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంగన్వాడీ పెద్దక్క!

ఓ పక్క పేదరికం. మరోపక్క భర్త అనారోగ్యం. కుటుంబ పోషణ... ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ  ఆమె మురికివాడలోని పిల్లల సంరక్షణ కోసం పరితపించింది. అదే ఆమెకు జాతీయ మహిళా కమిషన్‌ నుంచి అవార్డునూ అందుకునేలా చేసింది.  
రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన ముప్పై ఎనిమిదేళ్ల ఇష్రత్‌ బానో ఓ అంగన్వాడీ కార్యకర్త. ఏడేళ్లుగా ఇడ్గాకాచి అనే మురికివాడలోని చిన్నారుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోంది. దాంతో అక్కడి వాళ్లంతా ఈమెను ‘అంగన్వాడీ బాజీ (పెద్దక్క)’ అని ఎంతో ప్రేమగా పిలుస్తారు. తన రూ.7500 జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడమే కష్టం. అయినాసరే అంగన్వాడీ కేంద్రానికి రూ.2000 అద్దెను తానే చెల్లిస్తోంది.
ఆ పిల్లలకు అన్నీ తానై... ఆ బస్తీలో కూలీలు, కార్మికులు ఎక్కువగా ఉంటారు. వీరంతా తమ పిల్లల్ని అంగన్వాడీ కేంద్రంలో వదిలి పనులకు వెళుతుంటారు.  పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆ చిన్నారులకు తృణధాన్యాలు, బెల్లంతో చేసిన ఆహారాన్ని ఇస్తోంది ఇష్రత్‌. దాతల నుంచి విరాళాలను సేకరించి వీరికి ఆహారం, దుస్తులు, పుస్తకాలనూ అందిస్తోంది. పిల్లలకు అక్షరాలను నేర్పించడమే కాకుండా ప్రోగ్రెస్‌ కార్డులను తయారుచేసి తల్లిదండ్రులకు పంపిస్తుంది. ఏటా దాదాపు యాభై మంది చిన్నారులు పాఠశాలల్లో ప్రవేశం పొందేలా చేస్తుంది. పిల్లల అమ్మానాన్నలతో ప్రతి నెలా సమావేశాలనూ ఏర్పాటు చేస్తోంది. అంతేకాదు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆరోగ్య పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఆశా వర్కర్లతో కలిసి పనిచేస్తూ... మహిళలకు వైద్య సహాయం అందేలా చేస్తోంది. ఈ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వ నోడల్‌ అంగన్వాడీ అధికారి డాక్టర్‌ కె.కె.పాథక్‌ నుంచి ప్రశంసలను, జాతీయ మహిళా కమిషన్‌ నుంచి అవార్డునూ అందుకుంది. పేదరికంతో బాధపడుతున్నా నలుగురికీ సాయం చేయాలనే ఆమె మంచి మనసుకు జోహార్లు చెప్పాల్సిందే!.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని