ఆమె గురించి ఆలోచించండి!
close
Published : 26/04/2021 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆమె గురించి ఆలోచించండి!

ఇప్పుడు ‘ఆమె’ ఒత్తిడితో ఒంటరి పోరాటం చేస్తోంది. దీన్నుంచి ఎలా బయటపడాలో వివరిస్తున్నారు... మానసిక నిపుణురాలు డా.చల్లా గీత. ఇంటి వెన్నెముక అయిన ‘ఆమె’ గురించి మిగిలిన వాళ్లూ ఆలోచించాలని హితవు పలుకుతున్నారు!

నవ్య, ఆమె భర్త... ఇద్దరూ ఏడాదిగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. అంతకు ముందు ఏవైనా గొడవలొచ్చినా... ఇట్టే సర్దుబాటు అయ్యేవి. ఇప్పుడు మాత్రం చిన్న చిన్న విషయాలే చినికి చినికి గాలివానలా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నవ్యకు శారీరక హింసా తప్పడం లేదు. లైంగిక విషయాల్లోనూ తన అభిప్రాయానికి విలువే ఉండదు.

లావణ్య కుటుంబ సభ్యులంతా కరోనా వల్ల చాలా కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. ప్రతి ఒక్కరికీ ఏదో రకమైన ఒత్తిడి. రోజంతా దగ్గరగా ఉండటంతో.... అవతలి వారిలో చిన్న చిన్న లోపాలు కూడా పెద్దవిగా కనిపిస్తున్నాయి. ‘నిన్ను ఇలా చేయొద్దన్నానా’ అంటాడు తండ్రి. ‘నన్ను నియంత్రించాలని చూస్తున్నారు అంటూ ఉక్రోషపడుతుంది’ టీనేజీ బిడ్డ. సర్ది చెప్పాలని ప్రయత్నిస్తూ లావణ్య  నలిగిపోతోంది.

మాన్వితది మరో సమస్య... ఎవరికి వాళ్లు తమని పట్టించుకోవాలని కోరుకునే వాళ్లే. నన్ను పట్టించుకోవట్లేదంటాడు భర్త. నచ్చింది చేసి పెట్టట్లేదంటారు పిల్లలు. ఆన్‌లైన్‌ తరగతుల జంఝాటం. అవి జరిగినంత సేపూ పక్కనే ఉండాలి. ఎసైన్‌మెంట్‌లలో సాయం చేయాల్సిందే. పిల్లల్ని అదుపు చేయడం మరో పెద్ద సమస్య. అత్తమామల సంగతి సరేసరి. పులి మీద పుట్రలా తన ఉద్యోగం పోయింది.

రెండో దశ కొవిడ్‌ విజృంభణతో మహిళల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది. ఒకప్పుడు పిల్లలు బడికి, భర్త ఆఫీసుకు వెళ్లిపోతే గృహిణులు ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని కాస్త విశ్రాంతి తీసుకోగలిగేవారు. కాసేపు పత్రికలో పుస్తకాలో తిరగెయ్యడం, టీవీ చూడటం, మధ్యాహ్నం ఓ కునుకు తీయడం, సాయంత్రం నడకకు వెళ్లి రావడం చేసేవారు.
ఇప్పుడు అందరూ ఇళ్లలోనే! దాంతో అమ్మ గడియారంతో పోటీ పడుతూ యంత్రంలా పని చేయాల్సిందే. నాలుగు ముద్దలు తినాలన్నా తీరిక దొరకని పరిస్థితి. వ్యాయామం చేసే ఓపిక, సమయం లేవు. వీటికి తోడు ఆర్థిక ఒడుదొడుకులు. కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాల్ని కాస్తా... కరోనా కాలరాసేసింది. ఎక్కువ మంది స్త్రీలు పనిచేసేది అసంఘటిత, ప్రైవేట్‌ రంగాల్లోనే. టీచర్లు, బ్యూటీషియన్లు, రిసెప్షనిస్టులుగా పని చేసిన వారంతా ఈ మహమ్మారి దెబ్బకు ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇవన్నీ ఆమె చేతిలో ఉన్న ఇంటి బడ్జెట్‌ని అల్లకల్లోలం చేశాయి. ఇవి చాలక హార్మోన్ల అసమతుల్యత... నెలసరి, మెనోపాజ్‌ దశల్లో భావోద్వేగాల మార్పులు, శారీరక మార్పులు వీటికి అదనం. ఫలితంగా ఒత్తిడి, అసహనం... అనారోగ్యం, నిరాసక్తత, నిర్లిప్తత... ఆమెను వెంటాడుతున్నాయి. ఉద్యోగినిగా, అమ్మగా, భార్యగా... రోజంతా ఎంత కష్టపడినా నన్నెవరూ గుర్తించరే అని బాధపడుతుంటారు చాలామంది. ఇవన్నీ ఆమెను కుంగదీస్తున్నాయి. దాన్నుంచి బయటపడాలంటే....

పంచుకోండి... చాలామంది అన్ని పనులూ తామే చేయాలనుకుంటారు. అప్పుడే తమకు గౌరవమని, గుర్తింపనీ పొరబాటు పడుతుంటారు. ఇలా ఆలోచిస్తే... మీపై ఒత్తిడి పెరుగుతుందే తప్ప పని పూర్తికాదు. నాణ్యతలోనూ రాజీ పడాల్సి వస్తుంది. అందుకే ఇంట్లో, ఆఫీసులో.. ఎక్కడయినా ఎవరి పనులు వారు చేసుకునేలా చూడటంలోనే మీ విజయం ఆధారపడి ఉంటుందని గుర్తించండి. అప్పుడే ఒత్తిడీ అదుపులో ఉంటుంది... ముఖ్యంగా  పిల్లలకు చిన్నప్పటి నుంచే అన్ని పనులూ అలవాటు చేయండి. పనులకు ఆడామగా భేదాలుండని వాళ్లకు అర్థమవ్వాలి.
మల్టీటాస్కింగ్‌... మహిళలు ఎక్కువగా మల్టీటాస్కింగ్‌ చేస్తారు. ఇది చెప్పడానికి చాలా బాగుంటుంది... కానీ దీని వల్ల ఒత్తిడి ఎక్కువ, ఉత్పాదకత తక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బదులుగా ప్రాధాన్యతా క్రమంలో స్మార్ట్‌వర్క్‌ చేయడానికి ప్రయత్నించండి. అందుకు సాంకేతిక సాయమూ తీసుకుంటే సరి.
మీకోసం మీరు... కుటుంబ సభ్యులకోసం ఆలోచిస్తే సరిపోదు. మీ కోసం మీరూ సమయాన్ని కేటాయించుకోవాలి. పార్లర్‌కి వెళ్లలేకపోతేనేం ఇంట్లోనే హెన్నా పెట్టుకోండి. ఫేస్‌ప్యాక్‌ వేసుకోండి. ఎప్పుడో వదిలేసిన అభిరుచులకు మళ్లీ స్థానం కల్పించండి. కనీసం ఏడు గంటల నిద్రపోండి. ఈ పనులన్నీ మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకుంటున్నారన్న భావన దరి చేరనీయవు.
ఆదాయాన్ని బట్టే... కరోనా వల్ల పరిస్థితులు గతంలోలా లేవు. అందుకే ఖర్చుల్ని అవసరాలు, సౌకర్యాలు, విలాసాలుగా వర్గీకరించుకోండి. అవసరాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వండి. అవి మిమ్మల్ని ఒడుదొడుకులకు లోనుకానివ్వవు.
అన్నీ పంచుకోండి... భావోద్వేగాలను మనసులోనే బంధించేయొద్దు. పంచుకోండి. అప్పుడు ఒత్తిడి సహజంగానే తగ్గుతుంది. ప్రతికూల ఆలోచనలు ఎక్కువ ఉన్నప్పుడు నిపుణుల సాయం తీసుకోండి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సెల్ఫ్‌ హెల్ప్‌ స్కిల్స్‌, సైకలాజికల్‌ ఫస్ట్‌ఎయిడ్‌ స్కిల్స్‌ నేర్చుకోండి. ఇవి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఉపయోగపడతాయి.

వాటికి బ్రేక్‌ వేయండి...

అందరినీ మెప్పించాలి... అందరూ మనల్ని ప్రేమించాలి... బాధ్యత గల వ్యక్తిని, ఎంత పనైనా చేయగలను అని మీకు మీరే ఆభరణాలు తగిలించుకోవద్దు. ఈ పిచ్చి నమ్మకాలకు బ్రేక్‌ వేయండి. ఇవి మీపై ఒత్తిడిని పెంచేస్తాయి.

ఉద్యోగం లేకపోతేనేం...

ఉద్యోగం లేదని ఒత్తిడికి గురవ్వొద్దు. ఆలోచిస్తే... ఉపాధి మార్గాలు బోలెడు. లేదా కాస్త విరామం తీసుకోండి. ఈ సమయాన్ని మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగించుకోండి. అప్పుడే ఒత్తిడి నుంచి బయటపడగలరు.

బాధ్యతల్ని పంచాలి...
- ఉష మూల్పూరి,  నిర్మాత, వ్యాపారవేత్త

మా ఇంట్లో మొత్తం పది మంది ఉంటాం. అందరమూ పనిని విభజించుకుని చేస్తాం. ఉదయం ఆరుగంటలకు మొదలయ్యే మా పనులు పదికల్లా పూర్తవుతాయి. బాధ్యతలను పంచితే ఒత్తిడి తగ్గుతుంది. అప్పుడు వాళ్లుకూడా ఏదైనా సమస్య వచ్చినా కంగారుపడకుండా చేసుకోగలగుతారు కూడా. ఒక్కరోజులో అన్నిపనులూ చేయడానికి అలవాటు పడలేకపోవచ్చు. ఓపిగ్గా ప్రయత్నించాలి. అలానే మా వారూ, అబ్బాయి నాగశౌర్య...చక్కగా వండటం నేర్చుకున్నారిప్పుడు. ప్రణాళికతో ఒత్తిడిని జయించొచ్చు.

మానసిక ఆరోగ్యం కాపాడుకోండి...
- గీతామాధురి, గాయని

మహిళ...కుటుంబంలోని ప్రతి ఒక్కరిపైనా ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి. దాంతో ఆమెకు పనిభారం రెట్టింపయ్యింది. ఇది పెద్ద సవాలే. అలాగని ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం లేదు. చిన్నచిన్న ప్రణాళికలతో పనులు చేసుకోవచ్చు. పనులెన్నున్నా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మరిచిపోవద్దు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతులాహారం తీసుకోండి. వ్యాయామం చేయండి. తల్లిగా మారిన నేనూ ఇవన్నీ పాటిస్తున్నా. 

మార్పుని అంగీకరించండి..

-డా. మణిపవిత్ర, వ్యాపారవేత్త

కొవిడ్‌ పరిస్థితులకు భయపడుతూ కూర్చోవద్దు. వచ్చిన మార్పుని అంగీకరించండి. దానికి తగ్గట్లే మీ ఇంటి వాతావరణాన్ని మార్చేయండి. నాకు ఇద్దరు పిల్లలు...వారిద్దరూ ఏడాదిగా ఇంట్లోనే ఉంటున్నారు.  ఆటలు, సరదాలు వంటివి లేకపోవడం వల్ల వారు ఒత్తిడికి గురయ్యే పరిస్థితులున్నాయని గుర్తించి...ఉన్న కొద్దిపాటి స్థలంలోనే వారి ఆటలకోసం మైదానం సిద్ధం చేశా. ఆసక్తులను పెంచుకునేలా ప్రోత్సహిస్తున్నా. దాంతో నా పని సులువయ్యింది. పనుల్ని పంచితే... అమ్మగా, భార్యగా ఇతర విషయాలపై మీరు శ్రద్ధ పెట్టగలరు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని