హైదరాబాద్‌కు ఆగని బంగారం అక్రమ రవాణా - gold smuggling on the rapid rise at shamshabad airport investigative story
close
Published : 06/04/2021 16:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌కు ఆగని బంగారం అక్రమ రవాణా

ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్న అక్రమార్కులు

శంషాబాద్‌: హైదరాబాద్‌కు అక్రమ రవాణా ఆగడం లేదు. అక్రమార్కులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. నిఘా సంస్థల కళ్లుగప్పి గమ్యస్థానాలకు చేరవేసేందుకు యత్నిస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో వరుసగా అక్రమ రవాణాదారులు పట్టుబడుతున్నా స్మగ్లింగ్‌ కొనసాగుతూనే ఉంది. కొవిడ్‌ నిబంధనల సడలింపుతో శంషాబాద్‌ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో బంగారం అక్రమ రవాణా కేసులు కూడా పెరుగుతున్నాయి. నిఘా సంస్థలు గట్టిగా ఉన్నప్పటికీ వారిని బురిడీ కొట్టించేందుకు అక్రమార్కులు రోజుకో ఎత్తు వేస్తున్నారు.

గల్ఫ్‌ దేశాల్లో బంగారం ధర భారత్‌ కంటే తక్కువగా ఉండటం, అక్కడ ఎలాంటి నియంత్రణలు లేకపోవడంతో వారికి కలసివస్తోంది. గల్ఫ్‌ దేశాలనుంచి బంగారాన్ని పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల కళ్లుగప్పేందుకు బంగారాన్ని బిస్కెట్ల రూపంలోగానీ, నగల రూపంలోగానీ తీసుకురావడం లేదు. పేస్ట్‌లా మార్చేసుకొని లోదుస్తుల్లో దాచుకోవడం, యంత్ర సామగ్రి విడిభాగాల్లో దాయడం, పల్చటి రేకుల్లా మార్చి తెస్తున్నారు. మరో అడుగు ముందుకేసి కడుపులోగానీ, మూత్రనాళంలో ఉంచి తీసుకురావడంతో స్కానింగ్‌కు దొరక్కుండా బయటపడుతున్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర విభాగాలైన కస్టమ్స్‌, సీఐఎస్‌ఎఫ్‌, డీఆర్‌ఐలకు చెందిన అధికారులు నిఘా పెడతారు. అయినప్పటికీ బంగారం అక్రమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నించి అక్రమార్కులు దొరికిపోతున్నారు. గల్ఫ్‌ దేశాలైన దుబాయ్‌, కువైట్‌, ఖతార్‌, సౌదీ అరేబియా నుంచి ఎక్కువ బంగారం రవాణా అవుతోంది. గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు 11.43 కిలోల బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకోగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి మార్చి చివరి నాటికి 10.55 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

అంతర్జాతీయ విమానాల రాకపోకలు కూడా యథావిధిగా ఉండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. దొరికితే జైలుపాలు అవుతామనే భయం రవాణాదారుల్లో ఏమాత్రం కనిపించడంలేదు. అక్రమార్కులు ఇచ్చే కమీషన్‌కు కక్కుర్తి పడుతున్నారు. చెప్పిన చోటుకు వెళుతున్నారు. ఇచ్చిన పార్సిల్‌ తీసుకొస్తున్నారు. ఎవరికంటా పడకుండా బయటపడితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కమీషన్‌ ముట్టచెబుతారు. విమానాశ్రయంలో దొరికితే తమ పేర్లు మాత్రం బయటపెట్టవద్దని ముందే మాట తీసుకుంటున్నారు.  అక్రమార్కులు ఇలా రవాణాదారులకు భరోసా కల్పిస్తుండటంతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లి బంగారాన్ని తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని