close

తాజా వార్తలు

ఇవి గొల్లపూడి మాటలు కావు.. ఓ ఆశాజీవి కబుర్లు

ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు(80) గురువారం కన్నుమూశారు. ఆయన 250కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన రచయితగా పలు పుస్తకాలు, కథలు, చిత్రాలకు సంభాషణలను రాశారు. 1965,89,91ల్లో ఆయన రచించిన సంభాషణలు, సినీ కథలకు నంది అవార్డులు లభించాయి.  సినిమాల్లోకి రాకముందు ఆయన నాటకాలు, కథలు, నవలలు రాసేవారు. ఇటీవల ఆయన ఈనాడు‘హాయ్‌’తో తన మనసులో మాటలను పంచుకొన్నారు. నేడు వాటిని మరో సారి ఆయన మాటల్లోనే గుర్తుచేసుకుందాం.

‘‘14వ ఏట... ఆశాజీవిగా మొదటి అడుగు వేశాను.. 

16వ ఏట... అనంత నాటక ప్రస్థానం మొదలుపెట్టాను..

23వ ఏట... దృక్ఫథం మార్చుకున్నాను.. 

స్క్రీన్‌ప్లేలు రాశాను, మాటలు రాశాను, నటించాను, నటిస్తూనే ఉన్నాను...

కానీ రోజూ కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాను’’ 

ఇవి గొల్లపూడి మాటలు కావు... ఓ ఆశాజీవి కబుర్లు!

గొల్లపూడి మారుతీరావు. పరిచయం అక్కర్లేని పేరు. కథ, నాటకం, నవల, రేడియో, సినిమా.. రంగం ఏదైనా గానీ అన్నింటా ఆయనదో విలక్షణమైన శైలి. రచయిత, నటుడు, ప్రయోక్త, సంపాదకుడు, వక్త, కాలమిస్టు.. తరచి చూస్తే ఇలా ఆయనలో ఎన్నో కోణాలు. ఒక్క మాట విరుపుతో పలు అర్థాలు ధ్వనింపజేసే ఆయన తన ఎనభై ఏళ్ల జీవన ప్రస్థానంలోని మలుపులను ‘హాయ్‌’తో పంచుకున్నారు. నేటి సినిమా, యువతరం ధోరణులపై అభిప్రాయాలూ వెలిబుచ్చారు.

మొదటి బహుమతి రూ.100

పదహారు, పదిహేడేళ్ల వయసులో మొదటిసారి ‘అనంతం’ నాటకం రాసి, వేశా. అప్పట్లో  నాటకాలు వృత్తులు కాకపోవడం వల్ల రాబడి ఏమీ వచ్చేది కాదు. కొందరు నాటకాలు వేసేవారిని దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు. స్థానం నరసింహారావు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, మాధవపెద్ది వెంకట్రామయ్య గార్ల వంటి మహామహులకే నాటకాలు వేయటం చెల్లింది. నాటకాల్లో వేషం అనగానే చాలామంది ముక్కున వేలేసుకునేవారు. ఇళ్లలో పెద్దవాళ్లు ఒప్పుకొనేవారు కాదు. అయినా, అంతర్‌ కళాశాలల పోటీల్లో నా నాటకం ఉత్తమ రచనగా ఎంపికైంది. దిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో అప్పటి సమాచార, ప్రసారశాఖ మంత్రి బి.వి.కేస్కర్‌ గారి చేతుల మీదుగా రూ.100 బహుమతి అందుకున్నా. ఈ గుర్తింపే ఆకాశవాణిలో ఉద్యోగానికి అర్హుణ్ణి చేసింది. 20 ఏళ్లు తిరిగేసరికి అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ స్థాయిలో ఉండగా రాజీనామా చేశాను.

ఎగిరి...పడ్డాను!

రేడియోలో చేరడానికి కొద్దిరోజుల ముందు భారత్‌పై చైనా దురాక్రమణ నేపథ్యంలో ఒక నాటిక రాయమని కలెక్టర్‌ బి.కె.రావు గారు నన్ను ప్రోత్సహించారు. దానికి ‘వందేమాతరం’ అనే పేరునూ సూచించారు. చిత్తూరు, తిరుపతి, నగరి, మదనపల్లిలో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. తిరుపతిలో నేను అనుకున్నట్లు ఏర్పాట్లు చేయలేదు. దీంతో రావుగారి సమక్షంలోనే అక్కడి తహసీల్దారు మీద, మిగతా ఉద్యోగుల మీద ఎగిరిపడ్డాను.  అప్పడు బీకే రావు ‘‘నీ వెనక కలెక్టర్‌ లేకుంటే ఇందాక నువ్వు నా ముందు విమర్శించిన తహసీల్దారును నీ అంతట నువ్వు కలుసుకోవాలంటే సాధ్యపడదు. ఎప్పుడూ నీ దృష్టితో సమస్యలను చూడకు. ఎదుటివాడి దృష్టితో చూసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. నువ్వేం గొప్ప రచయితవి కాలేదు. కానీ అయ్యే సామర్థ్యం, ప్రతిభా నీలో ఉన్నాయి. భగవంతుడు మంచి వాక్యం రాసే ప్రతిభని నీకిచ్చాడు. అదింకా సానబెట్టాలి. ఈసారి నిన్ను కలిసినప్పుడు కొత్త మారుతీరావుని చూస్తానని ఆశిస్తాను’ అన్నారు. ఆనాటి సంఘటన నా జీవితంలో మరచిపోలేను. అది నా దృక్ఫథాన్ని మార్చింది. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది.

రేనాటి నుంచి ఈనాటి దాకా...

నా జీవితం స్ట్రెయిట్‌ లైన్‌ కాదు. ఈ ఎనభై ఏళ్లలో చాలా మలుపులే ఉన్నాయి. నేను కథా రచయితగా ప్రస్థానం మొదలుపెట్టింది పద్నాలుగో ఏట. నా క్లాస్‌మేట్‌ అన్నయ్య, అలాగే నాక్కూడా మిత్రుడు అయిన భైరి కొండలరావు రచనలు ‘రేనాడు’ అనే ప్రొద్దుటూరు పత్రికలో వస్తుండేవి. నా క్లాస్‌మేట్‌ వాటిని కాగితాల మీద అంటించి పుస్తకాలుగా చేసుకొనేవాడు. అది చూసే నాకూ పుంఖానుపుంఖాలుగా రాయాలనే కోరిక పుట్టింది. అలా నా మొదటి కథ ‘ఆశాజీవి’ 1954 డిసెంబర్‌ 18న ఆ పత్రికలోనే వచ్చింది. నాకు రచయితగా జన్మనిచ్చింది అదే.

ఆంగ్లం నేర్పింది అంతా...

నా ఇన్‌స్టింక్ట్‌ థియేటరే. నా రచనల్లో థియేట్రిసిటీ కనిపిస్తుంది. బీఎస్సీ ఆనర్స్‌ (మాథమాటికల్‌ ఫిజిక్స్‌) చదవటం వల్ల దేనినైనా సాధికారికంగా, సోదాహరణంగా, తూకం వేసినట్టు ఆలోచించే శిక్షణ అబ్బింది. ఆచితూచి స్క్రీన్‌ప్లే రూపొందించడం, దాని వెనక గల హృదయాన్ని అంతే నిర్దుష్టంగా చెప్పగలగడం ఆ చదువు ఇచ్చిన వరమే. తెలుగు రచయితని కావాలనే లక్ష్యానికి ఇంగ్లీషు సాహిత్యం ఆటంకం అవుతుందని అప్పట్లో అనుకునేవాడిని. ఇది తప్పని నాకు  చెప్పేవాళ్లూ లేరు. అయినా జీవితమంతా  ఆంగ్ల సాహిత్య పఠనం, అభ్యాసంతోనే గడిచింది.

అదే కారణం

ఒక నైపుణ్యానికి మరో ఇరవయ్యో ముప్పయ్యో నైపుణ్యాలు కలిస్తేనే గొల్లపూడి అయ్యాడు. ఒక పని ఇంకొక పనిలోకి ప్రవేశం కల్పించింది. ఇలా రేడియో, టీవీ, నాటక, సినిమా రచయితగా, నటుడిగా, ప్రయోక్తగా, వక్తగా, కాలమిస్టుగా.. ఇంకా ముద్రణా రంగంలోనూ రాణించాను. ఈ విజయానికి కారణం అంకిత భావం. వృత్తికి, ఎదుటివారి నమ్మకానికి, నాకు పేరు తెచ్చిన కృషికి నేను కట్టుబడి ఉంటాను.

ట్రెండ్స్‌ మారుతున్నాయి

ఒకప్పుడు నాటకాలే సినిమాలుగా వచ్చేవి. అప్పట్లో కెమెరాతో కథ చెప్పడమనేది తెలిసేది కాదు. ఇప్పటివాళ్ళకి అది తెలుసు. సినిమాటిక్‌ ట్రెండ్స్‌ మారుతున్నాయి. సాంకేతికతలో ముందుంటున్నాయి. ఇక కథ అంటారా... కథా నేపథ్యం, చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు మారిపోతున్నప్పుడు చెప్పడం, వినడం కూడా మారతాయి. ఏ తరానికి కావలసిన కథలు ఆ తరంలో ఉంటూనే ఉన్నాయి.

నాటకం  నిలదొక్కుకుంటే..

మన నాటక రంగం లోపం.. ప్రతిభ లేకపోవడం కాదు. పదే పదే ప్రేక్షకుల్ని తన వైపు ఆకర్షించే వేదికలు లేకపోవటం. రుచి మరిగేదాకా నిలదొక్కుకునే వసతిని నాటకానికి కల్పించాలి. ప్రేక్షకుడికి వ్యసనం అయ్యే దశకు నాటకాన్ని తీసుకురాగలగాలి. అప్పుడు నాటకరంగం దేనికీ తీసిపోదు.

ప్రతి మాటా రేడియో డైలాగే

నేను మామూలుగా మాట్లాడినా రేడియో డైలాగుల్లా అనిపిస్తాయని అంటుంటారు. మొదటి నుంచీ ఇంతే. నా మాట నా అలవాటు. అది వినడం మీ అలవాటు. ఈతరం పిల్లలు నా మాటలు అనుకోకుండా విన్నా కూడా చివర్లో ‘తాతగారూ, మీతో ఒక సెల్ఫీ కావాలి’ అంటున్నారంటే కారణం అదే. అలవాట్లు, అభిరుచులూ కాలంతో పాటు వికసిస్తూ ఉంటాయి.

నమ్మిన కళను కొనసాగించాలి

భవిష్యత్‌ తరానికి నేను చెప్పగలిగేది ఒకటే. బాగా చదువుకోండి. సాధన చేయండి. నమ్మిన కళని కొనసాగించండి. ఇప్పటికిప్పుడు ఫలితం రాకపోయినా పట్టుదలతో, నిజాయితీతో పనిచేస్తే ఏ పనైనా నెరవేరుతుంది. మీరు చేసే పని క్రమంగా ఫలితాన్ని అందిస్తుంది.

కాళిదాసు కవిత్వం రుచి చూపట్లేదు

షేక్స్పియర్‌ను ఈతరమూ చదువుతోంది. కాళిదాసు అంటే  మాత్రం తెలియటం లేదు. కారణమేంటి? మనం చిన్నప్పటి  నుంచీ పిల్లలకు బొబ్బట్లు పెట్టలేదు. ఇరవయ్యేళ్ళ తర్వాత పెడితే రెండే సమాధానాలు రాగలవు. బాగుందనో బాగాలేదనో. అదే ముందు నుంచే పెడుతూంటే అప్పుడప్పుడు వాళ్లే చేసిపెట్టమని అడుగుతారు.  అమెరికాలో ప్రచురణ తగ్గిపోయి ఆడియో బుక్స్‌ ఊపందుకున్నాయి. మరి మనమెటో!

నా చుట్టూ వాళ్లే...

నా జీవితంలో నాకు దక్కిన అదృష్టం- చిన్నతనం నుంచీ నాకంటే అన్నివిధాలా పెద్దలతో సాంగత్యం లభించటం. ఏ విధంగా చూసినా గర్వపడనక్కరలేనంతటి ప్రతిభా వ్యుత్పత్తులు నా సమక్షంలోనే ఉండటం. ఈ వాతావరణం ఎప్పుడూ నాకు వినయాన్నీ, విచక్షణనీ, సంయమనాన్నీ నేర్పుతూ వచ్చింది. ఆ రోజుల్లో ప్రతి వ్యక్తీ నాకో ఉపాధ్యాయుడు. ప్రతి రోజూ ఓ కొత్త పాఠం. రోజుకి 20 గంటల పాటు జీవితం, సాహిత్యం, నాటకం అనే పాఠశాలలో తర్ఫీదు. వెరసి ఇవాల్టి నేను.

యువతను షటప్‌ అనలేను

ఇప్పటి పిల్లలు అన్నింటా, మార్పును ఆదుకోవడంలో ముందే ఉన్నారు కూడా. నాకు తెలిసిన ప్రపంచం కన్నా వాళ్లకు తెలిసిందే ఎక్కువ. అందుకే ఎవరూ సందేశాలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. చదువన్నది ఉపాధి కోసం కాదు. చదువన్నది జ్ఞానం. జీవితాన్ని సఫలీకృతం చేసేది చదువు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలి. నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి. అప్పుడే ప్రపంచం విసిరే సవాళ్లను అధిగమించటం సాధ్యమవుతుంది.

ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తుండగానే నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుగారి చేయూతతో, మిత్రుడు దాశరథి ప్రోత్సాహంతో డాక్టర్‌ చక్రవర్తి సినిమాకు మొదటి స్క్రీన్‌ ప్లే రాశాను. ఆంధ్రా యూనివర్సిటీలో బెస్ట్‌ యాక్టర్‌గా నిలిచినప్పటికీ ఉద్యోగం చేస్తుండటం వల్ల సినిమాలలో నటించలేదు. ఉద్యోగానికి 1982లో రాజీనామా చేశాక ఒక ‘ఫూలిష్‌’ నిర్మాత, ఒక ‘నెర్వస్‌’ దర్శకుడు (ప్రేమాస్పదంగా) ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో నాతో నటింపజేశారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.