Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు - good night news at nine pm
close
Published : 18/09/2021 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. న్యాయవ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించాలి

దేశ న్యాయ వ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న వలస నియమాలు భారతీయుల అవసరాలకు అనుగుణంగా లేవని అభిప్రాయపడ్డారు. బెంగళూరులో సుప్రీంకోర్టు దివంగత న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం శాంతనుగౌడర్‌కు నివాళి అర్పించే కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా న్యాయవ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

అమరావతి ఎస్సీ ఐకాస నేతపై వైకాపా ఎంపీ అనుచరుల దాడి

2. విశాఖలో 29 మంది కౌంటింగ్‌ ఏజెంట్లకు కరోనా

విశాఖ జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపింది. ఆదివారం జరగనున్న ప్రాదేశిక ఓట్ల లెక్కింపులో పాల్గొననున్న కౌంటింగ్‌ ఏజెంట్లు కరోనా బారిన పడ్డారు. 90 మంది కౌంటింగ్‌ ఏజెంట్లకు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించగా 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా వచ్చిన వారిని వెంటనే ఐసొలేట్‌ చేయాలని విశాఖ జేసీ ఆదేశించారు. రెండు డోసుల టీకా తీసుకున్న వారినే కౌంటింగ్‌ ఏజెంట్లుగా తీసుకుంటామని వెల్లడించారు. ర్యాపిడ్‌ టెస్టులో నెగిటివ్‌ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్‌ ఏంజెట్లుగా అనుమతిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. 

3. రాష్ట్రంలో భాజపా రెండుగా చీలిపోయింది: రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో భాజపా రెండుగా చీలి పోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్‌ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా భాజపా చీలిపోయిందన్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని జైలుకు పంపుతామని పదే పదే చెబుతున్న బండి సంజయ్‌.. కేసీఆర్‌ అవినీతి చిట్టాను నిన్న హో మంత్రి అమిత్‌షాకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నిర్మల్‌లో భాజపా సభతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

4. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధం: అయ్యన్నపాత్రుడు

ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే ఉంటామని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ‘‘గుంటూరు జిల్లాకు వెళ్తే ప్రజలు ఘన స్వాగతం పలికారు. రెండున్నరేళ్లలో ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ప్రజల్లో వచ్చిన మార్పు చూసి వైకాపా నేతలకు భయం పట్టుకుంది. వైకాపా బెదిరింపులకు మేం భయపడం. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నాం’’ అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

5. తితిదే బోర్డులో సభ్యత్వం కోసం ఎవరినీ సిఫారసు చేయలేదు: కిషన్‌రెడ్డి

తితిదే జంబో బోర్డు ఏర్పాటుపై మొదలైన రాజకీయ దుమారం కొత్త మలుపు తిరిగింది. ఈవిషయంపై ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. తితిదే బోర్డులో సభ్యత్వం కోసం తాను ఎవరినీ సిఫారసు చేయలేదని స్పష్టం చేశారు. తితిదే ప్రత్యేక ఆహ్వానితులు వై.రవిప్రసాద్‌ పేరును తాను సిఫారసు చేయలేదని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా కానీ, పర్యాటకశాఖ తరఫున గానీ... ఎవరినీ సూచించలేదని లేఖలో పేర్కొన్నారు. 

6. సిద్ధూకి పాక్‌తో సంబంధాలు.. సీఎంని చేస్తే దేశానికే ప్రమాదం!

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూపై ఆ పార్టీ సీనియర్‌ నేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధూ ఓ అసమర్థుడని.. అతడిని తదుపరి సీఎంగా ప్రతిపాదిస్తే తాను అంగీకరించబోనన్నారు. అతడికి పాక్‌తో సంబంధాలు ఉన్నాయని, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జావేద్‌ బజ్వాలతో స్నేహం ఉందని చెప్పారు. సిద్ధూ సీఎం అయితే, దేశ భద్రతకే ముప్పు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ ఓ విపత్తుగా మారే అవకాశం ఉందంటూ కెప్టెన్‌ హెచ్చరించారు. తాను కేటాయించిన ఒక్క మంత్రి పదవిని కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారన్నారు.

అవమానాలు ఇక భరించలేను.. అందుకే రాజీనామా..!

7. గడిచిన నెల జీఎస్‌టీ రిటర్నులు దాఖలు చేయకుంటే..

గడిచిన నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్‌-3బీ రిటర్నులను దాఖలు చేయని వ్యాపారులు జనవరి 1 నుంచి జీఎస్‌టీఆర్‌-1లో బయటకు పంపే సరఫరాలను నమోదు చేయడానికి వీలుండదని జీఎస్‌టీఎన్‌ స్పష్టం చేసింది. ఏదైనా నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్‌-1ను దాఖలు చేయడానికి తర్వాతి నెలలో 11వ రోజు వరకు గడువు ఉంటుంది. ఇక జీఎస్‌టీఆర్‌-3బీ(పన్ను చెల్లింపుల ఫారమ్‌) రిటర్నులను తర్వాతి నెలలో 20-24 రోజుల మధ్యలో చేస్తారన్న సంగతి తెలిసిందే. జీఎస్‌టీఆర్‌-1 రిటర్నులను దాఖలు చేయడంలో పరిమితిని విధించే సెంట్రల్‌ జీఎస్‌టీ నిబంధనల్లోని రూల్‌-59(6) జనవరి 1, 2021 నుంచి అమల్లోకి వస్తుందని జీఎస్‌టీకి సాంకేతికత సహకారం అందిస్తున్న జీఎస్‌టీఎన్‌ స్పష్టం చేసింది.

8. ‘నన్ను బలిపశువును చేశారు.. ఛార్జ్‌షీట్‌లో ఒక్క ఆధారమూ లేదు’

అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా.. శనివారం కోర్టులో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అనుబంధ ఛార్జ్‌షీట్‌లో తనపై ఒక్క ఆధారం కూడా లేదని, తనను ఈ కేసులో బలిపశువుగా మార్చారని ఆయన దరఖాస్తులో వాపోయారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబయి క్రైమ్ బ్రాంచ్.. ఇటీవల రాజ్ కుంద్రా, మరో ముగ్గురిపై అనుబంధ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. సినిమా అవకాశాల కోసం ముంబయికి వచ్చే యువతులను వంచించి రాజ్‌కుంద్రా పెద్దఎత్తున ఆర్జించినట్లు అందులో పేర్కొన్నారు. 

9. వెండితెరపై ‘దాదా’గా ఆ హీరోకి ఛాన్స్‌ ఇవ్వండి!

టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ‘దాదా బయోపిక్‌’ రాబోతుందంటూ ఇటీవలే లవ్‌ఫిల్మ్స్‌ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి వెండితెర దాదాగా తెరపై ఎవరు కనిపించనున్నారనే ఆత్రుత గంగూలీ ఫ్యాన్స్‌లో మొదలైంది. గతంలో గంగూలీ ఓ సందర్భంలో తన బయోపిక్‌లో హృతిక్‌రోషన్‌, రణ్‌బీర్‌ నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే ప్రశ్నను ఆయన అభిమానులను అడిగితే మాత్రం వీరు కాకుండా.. బెంగాలీ నటుడు పరంబ్రత ఛటర్జీ నటిస్తే బాగుంటుందని ఆయనకు అవకాశం ఇస్తే ఆ పాత్రకు న్యాయం చేస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

10. Crimes linked to love: దేశంలో 3,031 ‘ప్రేమ’ హత్యలు

దేశంలో ప్రతిరోజు సగటున దాదాపు 80 హత్యలు జరుగుతున్నాయి. ఇందులో భూ వివాదాలు, కుటుంబీకుల మధ్య మనస్పర్థలు, గొడవలు అనంతరం హత్యలు ఇలా చాలానే ఉన్నాయి. అయితే దేశంలో జరుగుతున్న హత్యల్లో ఎక్కవ శాతం ‘ప్రేమ’తో ముడిపడి ఉన్నవే. ఓ హత్య జరిగిందంటే దాని వెనుక ప్రేమ వ్యవహారమో, లేక అక్రమ సంబంధ పరిణామాలో ఉండే అవకాశాలే ఎక్కువ. ఏదైనా హత్య జరిగితే మొదట పోలీసుల దర్యాప్తు సైతం ఆ కోణంలోనే సాగుతుంది. ప్రేమ విఫలైందని కోపంతో ప్రియురాలి హత్య, ఇతరులతో సన్నిహితంగా మెలుగుతోందని కక్ష పెంచుకొని హత్య, ఇష్టం లేని వ్యక్తితో వెళ్లిపోయిందని అమానుషం. ఇవేకాకుండా దేశంలో అక్రమ సంబంధాల హత్యలు కూడా అధికమే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని