సీటీమార్, విరాటపర్వం, ఎఫ్‌3 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ - gopi chand seetimaar rana viraataparvam release date announced
close
Published : 28/01/2021 19:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీటీమార్, విరాటపర్వం, ఎఫ్‌3 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

హైదరాబాద్‌: రాబోయే రెండు, మూడు నెలలు సినీ అభిమానులకు పండగే. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన చిత్రీకరణలు ఊపందుకోవడంతో శరవేగంగా షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తోంది. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’, ‘గని’ చిత్రాల విడుదల తేదీలు ప్రకటించగా, తాజాగా ఈ జాబితాలోకి గోపీ చంద్‌ ‘సీటీమార్‌’, రానా ‘విరాటపర్వం’, వెంకటేశ్‌-వరుణ్‌ల ‘ఎఫ్‌3’ సినిమాలు వచ్చి చేరాయి.

గోపీచంద్‌ కథానాయకుడిగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘సీటీమార్‌’. తమన్నా కథానాయిక. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న  ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 2న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటిస్తూ గోపీచంద్‌ మాస్‌ లుక్‌ను అభిమానులతో పంచుకుంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. క్రీడా నేపథ్యంతో పాటు, గుండెలను పిండేసే భావోద్వేగాలను సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది.

క్రామేడ్‌ రవన్న వచ్చేది ఆరోజే!

రానా, సాయి పల్లవి కీలక పాత్రల్లో వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ప్రియమణి, నవీన్‌ చంద్ర, నందితా దాస్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 30న థియేటర్‌లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ తెలిపింది.

ఆగస్టులో ‘కో-బ్రదర్స్‌’ సందడి

ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ అంటూ ‘ఎఫ్‌2’లో సందడి చేశారు కో-బ్రదర్స్‌ వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎఫ్‌3’ వస్తోంది. ఇటీవలే షూటింగ్‌ మొదలు కాగా, తాజా విడుదల తేదీని ప్రకటించారు. ఆగస్టు 27న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని