ఇలా చేస్తే అందరూ ఫ్రెండ్స్ అవ్వాల్సిందే! - habits of people who make friends easily in telugu
close
Published : 16/09/2021 18:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇలా చేస్తే అందరూ ఫ్రెండ్స్ అవ్వాల్సిందే!

'ట్రెండు మారినా.. ఫ్రెండు మారడు..' అంటూ స్నేహితులతో కలిసి సరదాగా ఆడిపాడాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే మన చుట్టూ ఉన్న కొంతమంది మాత్రం 'నాకు అసలు స్నేహితులే లేరు.. నాతో ఎవరూ స్నేహం చేయరు..' అంటూ నిరాశ, నిస్పృహలతో మాట్లాడుతూ ఉంటారు. మీరూ అంతేనా?? అయితే కొన్ని అలవాట్లు చేసుకుంటే చాలు.. మీ స్నేహం కోసం అవతలివారే పరుగులు పెట్టుకుంటూ వస్తారంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ అలవాట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

బాధైనా, సంతోషమైనా.. ఏదైనా సరే.. మనస్ఫూర్తిగా పంచుకోవాలంటే అది స్నేహితులతోనే! అందుకే ప్రతిఒక్కరి జీవితంలోనూ స్నేహానిది చాలా ముఖ్యమైన పాత్ర అని చెప్పచ్చు. అయితే మనతో స్నేహం చేసేలా ఇతరుల్ని ఆకర్షించాలన్నా లేదా వారి దృష్టి మనపై మళ్లాలన్నా అందుకు మనం కొన్ని విషయాలను అవరచుకోవడం చాలా అవసరం..!

చిరునవ్వుతో పలకరించండి..

కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్నవారిని గమనిస్తే కొందరు మనల్ని చూసి నవ్వుతారు.. ఇంకొందరు చూసి కూడా పట్టించుకోనట్లు ఉంటారు.. మరికొందరు తమ పని మీదే దృష్టి పెడతారు తప్ప పరిసరాల్లో ఏం జరుగుతోందో కూడా గమనించరు.. అయితే వీరిలో మనల్ని చూసి చిరునవ్వు నవ్విన వారిని చూడగానే వారిపై మనకి తెలియకుండానే మనలో ఒక సానుకూలమైన భావన ఏర్పడుతుంది. దానికి కారణం వారి అధరాలపై మెరిసిన చిరునవ్వు. అవునండీ.. మన పెదవులపై ఉండే చిరునవ్వే చుట్టూ ఉన్నవారికి మనల్ని చేరువ చేస్తుంది. అలాగే వారి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. నిత్యం సంతోషంగా గడిపే వ్యక్తితో ఎవరికి మాత్రం స్నేహం చేయాలని ఉండదు చెప్పండి?

ఇష్టమైన పనులు చేయండి..

మీకు ఏం చేయడం అంటే ఇష్టం? పాటలు పాడతారా? డ్యాన్స్ చేస్తారా?? మీ అభిరుచి ఏదైనా సరే.. దానిని వెంటనే ఆచరణలో పెట్టేయండి. దానిని ఎంజాయ్ చేస్తూనే అదే అభిరుచి గల వ్యక్తులను మీతో సమయం గడిపేందుకు ఆహ్వానించండి. అందుకు సామాజిక మాధ్యమాలను కూడా వినియోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఒకే అభిరుచి కలిగిన వ్యక్తులు ఒక దగ్గరకు చేరతారు. ఫలితంగా ఆ ఆసక్తి/ అభిరుచి గురించి చర్చించుకుంటూ కలిసి సమయం గడపడం ద్వారా మీ మధ్య స్నేహబంధం ఏర్పడే అవకాశాలుంటాయి. కాబట్టి ఇక మీదట మీకు ఇష్టమైన పనులు మీరు చేస్తూనే ఇతరులను కూడా ఆహ్వానించి చూడండి..

సానుకూల స్పందన..!

సాధారణంగా ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడేటప్పుడు రకరకాల అంశాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. వాటి గురించి మనం వీలైనంత మేరకు సానుకూలంగానే స్పందించాలి. అప్పుడే వారికి మనపై సదభిప్రాయం ఏర్పడే అవకాశాలుంటాయి. 'ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్' అని పెద్దలు వూరికే అన్నారా చెప్పండి..! అదీకాకుండా ప్రతికూలంగా స్పందించడం వల్ల వారి గురించి కూడా వేరే వ్యక్తుల దగ్గర మాట్లాడేటప్పుడు ఇలా నెగెటివ్‌గా మాట్లాడతామేమోనని వారు పొరపడే అవకాశాలు లేకపోలేవు. కాబట్టి చర్చించే అంశాన్ని బట్టి మీ స్పందనని వారికి సానుకూలంగానే తెలియజేయడం ఉత్తమం.

ఉత్సాహంగా ఉండండి..

ఏదైనా ఒక పని చేయాలంటే ఎవరికోసమో ఎదురుచూస్తూ కూర్చోవడం కాకుండా మీరే ఉత్సాహంగా ముందడుగు వేయండి. మీకు మీరుగా ఆలోచించి ఒక పక్కా ప్రణాళిక వేసి వారికి వివరించండి. దానిని సక్సెస్‌ఫుల్‌గా అమలుపరిచి వారికి చూపించండి. దీని వల్ల ఎదుటివారికి మీ తెలివితేటలు, సామర్థ్యంపై ఒక అవగాహన ఏర్పడుతుంది. అలాగే మీరు ప్లాన్ చేసే క్రమంలో లేదా పని చేసే క్రమంలో చుట్టూ ఉన్నవారిని కూడా భాగస్వాములను చేయండి. ఇలా ఉత్సాహంగా ఉండే వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలని ఎవరూ అనుకోరు కాబట్టి తప్పకుండా వారు కూడా మీతో స్నేహం చేసేందుకు ముందుకు వస్తారు.

విశ్లేషణా సామర్థ్యం..

ఏదైనా ఒక పని చేసేటప్పుడు లేదా నిర్ణయం తీసుకునేటప్పుడు దాని ద్వారా జరిగే మంచి, చెడులను విశ్లేషించగలగడం చాలా ముఖ్యం. అప్పుడే దాని వల్ల ఇతరులకు మేలు జరుగుతుందా లేదా కీడు వాటిల్లుతుందా అనే విషయం తెలుస్తుంది. ఇలా విశ్లేషించగల సామర్థ్యం మీకు ఉందా? అయితే ఈ స్వభావమే ఇతరులను మీకు స్నేహితులయ్యేలా చేయచ్చు.

అంతేకాదు.. ఒకసారి స్నేహం చేయడం ప్రారంభించాక వారి క్షేమ సమాచారంతో పాటు బాగోగుల గురించి కూడా కనుక్కుంటూ ఉండడం, సమస్యల్లో ఉన్నప్పుడు సాయపడడం, అవసరమైతే చెడు అలవాట్ల నుంచి వారిని దూరం చేయడం.. మొదలైనవి చుట్టూ ఉన్నవారిని మన స్నేహితులుగా మార్చేస్తాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని