Team India కోసం ఏదైనా చేస్తా: విహారి - hanuma vihari says i can do anything for team
close
Published : 14/05/2021 21:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Team India కోసం ఏదైనా చేస్తా: విహారి

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కోసం తాను ఏదైనా చేస్తానని మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లిష్‌ క్రికెట్‌ కౌంటీలో వార్‌విక్‌షైర్‌ తరఫున ఆడుతున్న అతడు తాజాగా పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా రాబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌, ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌పై స్పందించాడు. జట్టు యాజమాన్యం ఏదడిగినా చేస్తానన్నాడు. తన కెరీర్‌లో ఎక్కువసార్లు టాప్‌ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌ చేశానని, కాబట్టి ఆ సవాళ్లకు అలవాటు పడ్డానని చెప్పాడు.

ఇక ఆస్ట్రేలియా పర్యటనలో కీలకమైన సిడ్నీ టెస్టులో ఒకవైపు గాయం నొప్పిని భరిస్తూనే మరోవైపు మూడున్నర గంటల పాటు అశ్విన్‌తో కలిసి బ్యాటింగ్‌ చేసిన విహారి మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. దాంతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. అనంతరం గాయం కారణంగా అతడు నాలుగో టెస్టులో ఆడకపోవడంతో వాషింగ్టన్‌ సుందర్‌ తుదిజట్టులో చోటుదక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకొని జట్టులో ఆల్‌రౌండర్‌ సేవలు అందిస్తున్నాడు. దీనిపై స్పందించిన విహారి.. సుందర్‌ తన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందన్నాడు. అయితే, ఇప్పుడు తన ఆటపై దృష్టిసారించినట్లు చెప్పాడు.

చివరిగా ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడటంపై స్పందించిన విహారి.. ప్రస్తుత శీతాకాల పరిస్థితుల్లో అక్కడ ఆడటం మంచి అనుభవంగా పనికొస్తుందని చెప్పాడు. అక్కడి వాతావరణం, పిచ్‌లకు అలవాటు పడటమే తన ఉద్దేశమని అన్నాడు. అది న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కూ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌లో క్రికెట్‌ ఆడటం బాగుంటుందని, అక్కడి సవాళ్లను ఎదుర్కోవడం అంటే తనకెంతో ఇష్టమని వివరించాడు. ప్రస్తుతం అక్కడ శీతాకాలం అని, చాలా కష్టంగా ఉందని చెప్పాడు. అయినా ఇది కూడా ఓ అనుభవపూర్వకమని పేర్కొన్నాడు. కాగా, ఈ కౌంటీ క్రికెట్‌ మ్యాచ్‌ల తర్వాత విహారి వచ్చేనెల 2న టీమ్‌ఇండియాతో కలిసిపోతాడు. జూన్‌ 18 నుంచి కివీస్‌తో భారత్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తలపడనుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని