క్యాస్టింగ్‌ కౌచ్‌ని ఎదిరించి.. సినిమాల్లో రాణించి..! - happy birthday varalakshmi sarathkumar
close
Updated : 05/03/2021 12:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్యాస్టింగ్‌ కౌచ్‌ని ఎదిరించి.. సినిమాల్లో రాణించి..!

బర్త్‌డే స్పెషల్‌: నటి వరలక్ష్మి గురించి కొన్ని విశేషాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: జీవితం ఎప్పుడూ పూలబాట కాదు..! అంటారు పెద్దలు. కోలీవుడ్‌ ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తె వరలక్ష్మి కెరీర్‌ని చూస్తే అది నిజమేననిపిస్తుంది. తన తండ్రి బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నప్పటికీ స్వతహాగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. కెరీర్‌ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఖరికి.. పేరుపొందిన హీరో కుమార్తె అయినప్పటికీ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఇబ్బందులను సైతం ఆమె చవిచూశారు. ఎదురైన ప్రతి సమస్యతో ధైర్యంగా పోరాడి.. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌ స్టార్‌ నటిగా అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులోనూ రాణిస్తున్నారు. శుక్రవారం ‘జయమ్మ’ పుట్టినరోజు సందర్భంగా తన లైఫ్‌ గురించి పలు సందర్భాల్లో ఆమె ఇలా చెప్పుకొచ్చారు..!

సువర్ణావకాశం చేజారిపోయే..!

‘‘దక్షిణాదిలో పేరుపొందిన దర్శకుల్లో ఒకరైన శంకర్‌ సినిమాలో నటించే అవకాశం నన్ను వరించింది. ఆయన దర్శకత్వం వహించిన ‘బాయ్స్‌’ చిత్రానికి మొదట నన్నే ఎంపిక చేశారు. నటన మీద ఉన్న ఆసక్తితో ఆడిషన్స్‌కూ వెళ్లాను. సెలక్ట్‌ అయ్యాను. కాకపోతే అప్పుడు నాకు 17 సంవత్సరాలే. దాంతో సినిమాల్లోకి వెళ్తానంటే నాన్న ఒప్పుకోలేదు. అదే సమయంలో ‘ప్రేమిస్తే’ ఆఫర్‌ కూడా వదులుకోవాల్సి వచ్చింది’’

క్యాస్టింగ్‌ కౌచ్‌ తప్పలేదు.!

‘‘నటిగా రాణించాలనే ఉద్దేశంతో సినిమాల్లోకి రాకముందు ముంబయిలోని ఓ ప్రముఖ యాక్టింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాను. శింబు కథానాయకుడిగా నటించిన ‘పోడా పోడి’తో తెరంగేట్రం చేశాను. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల కొంత ఆలస్యమైంది. అయితే, అప్పుడే కెరీర్‌ ప్రారంభించడంతో సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది వ్యక్తులు నాతో అసభ్యంగా ప్రవర్తించారు. అలా, కెరీర్‌ ఆరంభంలోనే క్యాస్టింగ్‌ కౌచ్‌ చవిచూశా. నేను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాను. క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడడం వల్ల సినిమా ఆఫర్స్‌ కొంత తగ్గవచ్చు. కానీ తప్పకుండా మనం ఏదో ఒక సమయంలో విజయం సాధించి తీరతాం. క్యాస్టింగ్‌ కౌచ్‌ తర్వాత ఇప్పటివరకూ నేను దాదాపు 29 సినిమాల్లో నటించా. అందరూ మంచి వ్యక్తులే’’

యాక్టర్‌ అంటే కథ వేరే ఉంటది..!

‘‘నటి, నటుడు అంటే కేవలం ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకూడదు. నా ఉద్దేశంలో నటన అంటే అన్నిరకాల పాత్రలు చేయాలి. విభిన్నమైన పాత్రల్లో నటించాలని పరిశ్రమలోకి అడుగుపెట్టిన మొదటిరోజే ఫిక్స్‌ అయ్యాను. అందుకు అనుగుణంగానే కేవలం హీరోయిన్‌ పాత్రలు మాత్రమే కాకుండా విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.. ఇలా అన్నిరకాల పాత్రల్లో రాణిస్తున్నాను. నా దృష్టిలో నటన అనేది ఒక ఉద్యోగం. మనం విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తే.. ఫలితం కూడా అదే స్థాయిలో ఉంటుంది.’’

మొదట్లో నో.. ఇప్పుడు హ్యాపీ..!

‘‘ఇండస్ట్రీలో నటీనటులు ఎదుర్కొనే ఇబ్బందులు నాన్నకు బాగా తెలుసు. అందుచేతనే.. నేను ఇండస్ట్రీలోకి వెళ్తానని చెప్పగానే నాన్న ‘నో’ చెప్పారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత కూడా నటనపై ఆసక్తి ఉందని చెప్పాను. నా ఇష్టాన్ని కాదనలేక ‘ఓకే’ చెప్పారు. అలా, మొదటిసారి ‘పోడాపోడి’తో నటిగా ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు వెండితెరపై నా సినిమాలు చూసి ఆయన ఎంతో సంతోషిస్తున్నారు’’

అభిమానం మరోస్థాయిలో..

‘‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ తెలుగులో నా మొదటి చిత్రం. ఇందులో ప్రతినాయకురాలిగా నటించాను. ఆ తర్వాత ఈ ఏడాది విడుదలైన ‘క్రాక్‌’తో ‘జయమ్మ’గా మాస్‌ ప్రియుల్ని అలరించాను. ఆ పాత్ర అందరికీ ఎంతో నచ్చింది. ‘క్రాక్‌’ సినిమా చూసి చాలామంది నాన్నకు ఫోన్‌ చేసి ప్రశంసించారు. ‘క్రాక్‌’ తర్వాత విడుదలైన ‘నాంది’ కూడా విజయం సాధించడంతో నాకు మరింత ఆనందంగా ఉంది. నాపై తెలుగు వారు చూపిస్తున్న అభిమానం వేరే లెవల్‌లో ఉంది’’

రాధిక.. ఓ ఫ్రెండ్లీ ఆంటీ..!

‘‘రాధికను నేను ఆంటీ అనే పిలుస్తాను. నాన్న ఆమెను పెళ్లి చేసుకోని, సంతోషంగా ఉండడం పట్ల నాకెలాంటి ఇబ్బందిలేదు. అంతేకాదు, ఆంటీ నేనూ సరదాగా ఉంటాం. చాలా విషయాల గురించి మేమిద్దరం చర్చించుకుని జోక్స్‌ వేసుకుంటాం. ఫ్యాషన్‌ పట్ల ఆమె చూపించే చొరవ నాకు బాగా నచ్చుతుంది. నేను నటించిన సినిమాలు చూసి అప్పుడప్పుడూ ఆమె మెచ్చుకుంటారు కూడా’’

అమ్మ కన్నీళ్లు..!

‘‘నేను కథానాయికగా నటించిన ‘తారై తప్పట్టై’ అనే తమిళ చిత్రం చూసి మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత ఏ చిత్రానికీ ఆమె బాధపడలేదు. ఇటీవల విడుదలైన ‘నాంది’ చూసి ఆమె బాగా ఎమోషనల్‌ అయ్యారు. ఆ సమయంలో అమ్మని చూస్తే నాక్కూడా బాధగా అనిపించింది. ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న చిత్రమిది’’

బేకింగ్‌ వ్యాపారం..!

‘‘ఓసారి నా ఫ్రెండ్‌తో కలిసి ఓ మాల్‌కి వెళ్తే చీజ్‌టార్ట్స్‌ చేస్తున్న వాసన వచ్చింది. దాన్ని తిన్నాక నేనూ అలాంటి రుచికోసం ఇంట్లో ప్రయోగాలు చేశా. చివరకు గతేడాది ఏడాది జూన్‌లో ఓ హాబీలా ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ పేరుతో చిన్న బేకింగ్‌ కంపెనీని ప్రారంభించి వాటిని తయారుచేస్తున్నా. ఇది స్టార్టప్‌ కాబట్టి బేకింగ్‌ నుంచి ఆర్డర్లు ప్యాక్‌ చేయడం వరకూ అన్నీ నేనే చేస్తున్నా. ఆర్డర్లు బాగానే వస్తున్నాయి’’


మరికొన్ని ఆసక్తికర విషయాలు:

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌-ఛాయా దంపతుల పెద్ద కుమార్తె నటి వరలక్ష్మి.

వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ఓ తమ్ముడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

వరలక్ష్మికి ప్రభాస్‌ అంటే ఎంతో ఇష్టమట. ఆయనతో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఓకే చేస్తానని ఓ సందర్భంలో తెలిపారు.

వీధి కుక్కలను కాపాడడం కోసం ‘సేవ్‌శక్తి’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు.

నటిగా కాకపోయినా డ్యాన్సర్‌గా స్థిరపడాలని ఆమె అనుకున్నారట. అందుకు అనుగుణంగానే భరతనాట్యం, జాజ్‌, హిప్‌హాప్‌.. నేర్చుకున్నారట ఈ భామ.

ప్రజలకు సాయం చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారట ఈ ముద్దుగుమ్మ.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని