ఐసీసీ.. ఇదెలా ఔటని అంటావు?: భజ్జీ - harbhajan singh asks icc hows that out of gunathilakas wicket
close
Updated : 11/03/2021 14:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐసీసీ.. ఇదెలా ఔటని అంటావు?: భజ్జీ

ఇంటర్నెట్‌డెస్క్‌: గతరాత్రి వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్‌ గుణతిలక (55; 61 బంతుల్లో 7x4)ను వివాదాస్పద రీతిలో అంపైర్లు ఔటివ్వడంపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్‌ సైతం స్పందించాడు. ట్విటర్‌ వేదికగా గుణతిలక ఔటైన వీడియోను పంచుకొని తన సందేహాన్ని వ్యక్తం చేశాడు. అదెలా ఔట్‌ అంటూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలిని నిలదీశాడు.

అసలేం జరిగిందంటే.. బుధవారం రాత్రి వెస్టిండీస్‌, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, లంక తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ గుణతిలక అర్ధశతకం సాధించాక వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. పొలార్డ్‌ వేసిన 21.1 ఓవర్‌కు లంక ఓపెనర్‌ డిఫెన్స్‌ ఆడాడు. ఆ బంతి అతడి కాళ్ల వద్దే ఆగిపోవడంతో సింగిల్‌ తీద్దామని ముందుకెళ్లాడు. దాంతో బౌలింగ్‌ చేస్తున్న పొలార్డ్‌ వెంటనే స్పందించి రనౌట్‌ చేయడానికి దూసుకొచ్చాడు. అది గమనించిన గుణతిలక మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ను పరుగు కోసం రావొద్దని చెప్పాడు. అదే సమయంలో అతడు కూడా క్రీజులోకి వెనక్కి వెళుతూ అనుకోకుండా బంతిని కాలితో తన్నాడు. అప్పటికే పొలార్డ్‌ రనౌట్‌ చేయడానికి బంతి దగ్గరికి రాగా, గుణతిలక క్రీజులోకి వెళ్లిపోయాడు. దాంతో లంక బ్యాట్స్‌మన్‌ తమ ఫీల్డింగ్‌కు అడ్డుగా వచ్చాడని విండీస్‌ అప్పీల్‌ చేయడంతో విషయం థర్డ్‌ అంపైర్‌కు చేరింది. అక్కడ రీప్లే చూసిన అంపైర్లు గుణతిలకను ఔటిచ్చారు.

అయితే, ఆ వీడియోలో గుణతిలక కావాలని అడ్డు వచ్చినట్లు లేదనే విషయం స్పష్టంగా కనిపించింది. దాంతో నెటిజెన్లు ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని జరిగిన తప్పును ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే హర్భజన్‌ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఐసీసీకి ట్వీట్‌ చేశాడు. ఓ క్రీడా ఛానెల్‌ పంచుకున్న వీడియోకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలిని ట్యాగ్‌చేసి ఇదేలా ఔటని ప్రశ్నించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ చేసి 232 పరుగులు చేయగా, అనంతరం విండీస్‌ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విండీస్‌ ఓపెనర్‌ షై హోప్‌(110; 133 బంతుల్లో 12x4, 1x6) సెంచరీతో చెలరేగాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం పొలార్డ్‌.. గుణతిలకను కలిసి క్షమాపణ చెప్పినట్లు లంక బోర్డు ట్వీట్‌ చేయడం గమనార్హం. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని