కరోనా: ఆసుపత్రుల్లో మళ్లీ రద్దీ - hospitals against filling fastly with patients as corona cases surge in andhra pradesh
close
Published : 07/04/2021 11:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా: ఆసుపత్రుల్లో మళ్లీ రద్దీ

చాపకింద నీరులా విస్తరిస్తోన్న మహమ్మారి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి అలజడి రేపుతోంది. సోమవారం ఒక్కరోజే రెండువేల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గుంటూరు, చిత్తూరు, విశాఖ, నెల్లూరు, కృష్ణ జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది. 70 శాతానికి పైగా కేసులు ఈ ఐదు జిల్లాల నుంచి నమోదు కావడం భయాందోళన కలగజేస్తోంది. అధిక కేసులు బయటపడుతుండటంతో ఆయా జిల్లాల ఆసుపత్రులకు రోగుల తాకిడి అధికమై కరోనా బ్లాక్‌లను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విజయవాడలోని జీజీహెచ్‌లో 150 పడకలు నిండిపోగా రెండో బ్లాక్‌ను ప్రారంభించారు. గుంటూరులోని జీజీహెచ్‌లో దాదాపు 800 పడకలు అందుబాటులో ఉండగా 450కిపైగా రోగులు చికిత్స పొందుతున్నారు. నెల్లూరు జీజీహెచ్‌లో బెడ్లు నిండిపోయే పరిస్థితి ఏర్పడగా 868 మంచాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ జిల్లాలోని నారాయణ ఆసుపత్రిలో 400 మంది రోగులకు సేవలందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుపతి స్విమ్స్‌లో 450 పడకలు ఉండగా 221 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. విశాఖ కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో 500 వరకు బెడ్లు ఉండగా ఇప్పటికే 250 మంది చేరారు. పడకలు నిండితే విమ్స్‌లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా రెండో దశ విజృంభణలో చాలామంది హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే వీరికి మందులు అందకపోవడంతోపాటు పరిస్థితి తెలుసుకునేందుకు ఆరోగ్య సిబ్బంది సక్రమంగా రావడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా కిట్లు అందలేదని, పర్యవేక్షణ కరవైందని బాధితులు వాపోతున్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కరోనా కేసులు నమోదవుతున్నా.. బహిర్గతం చేయడం లేదు. ఇలాంటి ఘటనలతో తెలియకుండానే వైరస్‌ వ్యాప్తి చాపకింద నీరులా విస్తరిస్తోంది.

శుభకార్యాలకు వెళ్లే ప్రతి 200 మందిలో 40 మందికి వైరస్‌ వ్యాప్తి చెందుతోందని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. జిల్లాలో పెరుగుతున్న కేసులను పరిశీలిస్తే ఈ అంశం బయటపడిందని తెలిపారు. గుంటూరు జిల్లా గుగ్గిరాల మండలం చింతలపూడిలో కొవిడ్‌తో ఒక్కరోజే ముగ్గురు మృతిచెందారు. గ్రామంలో 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని