ప్లీజ్‌.. లాక్‌డౌన్‌ పెట్టకండి.. జాబ్స్‌ కాపాడండి!   - hoteliers protest against restrictions in mumbai
close
Published : 01/04/2021 18:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్లీజ్‌.. లాక్‌డౌన్‌ పెట్టకండి.. జాబ్స్‌ కాపాడండి! 

ముంబయిలో పలు హోటళ్లు, రెస్టారెంట్ల సిబ్బంది నిరసన

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో హోటళ్ల పరిశ్రమ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముంబయిలోని జోగేశ్వరి (వెస్ట్‌), ఒషివారాలలోని పలు హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు, సిబ్బంది కొవిడ్‌ ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ముంబయిలో గతేడాది పెట్టిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ వల్లే తీవ్రంగా నష్టపోవడంతో మరోసారి అలా చేయొద్దని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘‘లాక్‌డౌన్‌ పెట్టొద్దు.. ప్లీజ్‌- మా ఉద్యోగాలు కాపాడండి..; ఆకలి చావుల బారినపడకుండా రక్షించండి; రాత్రి 8గంటల తర్వాత హోటళ్లు మూసివేయడమంటే వ్యాపారాలు మూసివేయడమే’’ అనే సందేశాలతో రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సంజయ్‌ నిరుపమ్‌ మద్దతు తెలిపారు. రాత్రిపూట కర్ఫ్యూతో తలెత్తుతున్న సమస్యలను వివరించేందుకు ఆయన హోటళ్ల ప్రతినిధులను ఓషివారా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సంజయ్‌ నిరుపమ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా లాక్‌డౌన్‌ విధించాలనుకుంటోందని విమర్శించారు. లాక్‌డౌన్‌తో చిన్న వ్యాపారులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు సైతం పాల్గొన్నారు.

మరోవైపు, ముంబయిలో గత కొన్ని రోజులుగా 5వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ సహా పలు ఆంక్షలు అమలు చేస్తోంది. రాష్ట్రంలో సినిమా థియేటర్లు, ఆడిటోరియాలు, రెస్టారెంట్లను రాత్రి 8గటల నుంచి ఉదయం 7గంటల వరకు మూసివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.  మరోవైపు, ప్రజల ప్రాణాలు కాపాడటమే తమ  ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే వెల్లడించారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన చర్యలకు ప్రజలు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని