విపరీతమైన ప్రేమ.. ఈ లవ్ డిజార్డర్ మీలోనూ ఉందేమో చెక్ చేసుకోండి! - how affect obsessive love disorder in relationships in telugu
close
Updated : 16/06/2021 20:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విపరీతమైన ప్రేమ.. ఈ లవ్ డిజార్డర్ మీలోనూ ఉందేమో చెక్ చేసుకోండి!

అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్ (OCD) చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం.. సరిగ్గా చేశామా లేదా అని పదే పదే  చెక్ చేసుకోవడం.. దాని గురించే ఆలోచించడం.. బహుశా ఇది చాలామందికి తెలిసే ఉంటుంది! మరి, ‘అబ్సెసివ్‌ లవ్‌ డిజార్డర్ (OLD)’ గురించి మీకు తెలుసా? మనతో ప్రేమలో ఉన్నారని భావించే వ్యక్తి గురించి అధికంగా ఆలోచించడం, వారి గురించి ఎక్కువ కేర్‌ తీసుకోవడమే దీని అర్థమంటున్నారు నిపుణులు. అయితే ఈ అతి ప్రేమే ముందు ముందు మానసిక సమస్యల్ని తెచ్చిపెట్టచ్చని హెచ్చరిస్తున్నారు. అందుకే దాన్నే ఎదుటివారిపై తాము చూపిస్తోన్న ప్రేమ అని వదిలేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మానసిక నిపుణుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిదంటున్నారు. లేదంటే ఈ సమస్య అనుబంధాల్లోనే చిచ్చు పెట్టచ్చని చెబుతున్నారు. మరి, ఇంతకీ ఈ OLDని ఎలా గుర్తించాలి? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? దాన్నుంచి బయటపడేదెలా? తెలుసుకుందాం రండి..
సాధారణంగా ఒకసారి ఒక వ్యక్తికి మనసిచ్చి వారినే ఆరాధిస్తుంటారు మహిళలు. అయితే OLD బారిన పడే వారిలోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రేమ బంధంలో కలిగే ప్రయోజనాల కంటే ఈ డిజార్డర్‌తో బాధపడుతోన్న వారిలో మానసిక సమస్యలే ఎక్కువని, దాన్ని కొన్ని సాధారణ లక్షణాల ద్వారా గుర్తించచ్చని నిపుణులు చెబుతున్నారు.


ఈ లక్షణాలుంటే..!
* మీతో ప్రేమలో ఉన్నారని భావించే వ్యక్తి పట్ల విపరీతమైన ఆకర్షణకు గురవడం.
* నిరంతరం ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలే మనసులోకి రావడం.
* మూడో వ్యక్తి దృష్టి కూడా వారిపై పడకూడదన్నంత అతి జాగ్రత్త తీసుకోవడం.
* ఆ వ్యక్తి తనకే సొంతం అన్నట్లుగా ఆలోచించడం, చేతల్లోనూ ఇలాగే ప్రవర్తించడం.
* మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మరెవరితోనూ మాట్లాడకూడదనుకోవడం.. ఒకవేళ మాట్లాడితే విపరీతంగా అసూయపడడం..
* ఆత్మ గౌరవం తగ్గిపోవడం.. అంటే నిరంతరం ఎదుటి వ్యక్తి ఆలోచనల్లో పడిపోయి మిమ్మల్ని మీరు పట్టించుకోకపోవడం.
* ఇతరులతో కలవలేకపోవడం..
* మీరు ఇష్టపడే వ్యక్తి మీ దగ్గర లేకపోయినా వారికి పదే పదే ఫోన్‌ చేయడం, సందేశాలు పంపడం.. ఇలా నిరంతరం వారితో టచ్‌లో ఉండడం..
* వారి రోజువారీ పనుల్ని, కదలికల్ని క్షుణ్ణంగా పరిశీలించడమే పనిగా పెట్టుకోవడం.
* వారు చేసే పనుల్ని తమ అధీనంలో ఉంచుకోవాలనుకోవడం.. మొదలైనవి


కీడెంచి మేలెంచాలి!
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం.. దాన్ని ఎదుటివారిపై మీరు చూపించే అపార ప్రేమ అని అనుకోకుండా.. మానసిక సమస్యగా పరిగణించి నిపుణుల్ని సంప్రదించడం మంచిదట! ఈ క్రమంలో వారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడగచ్చు. మీలోని లక్షణాలు, మీ రిలేషన్‌షిప్‌, ఇదివరకే మీ కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి మానసిక సమస్య ఉందా?.. వంటి విషయాల గురించి వారు మీకు ప్రశ్నలు వేసి దాని ద్వారా మీకు OLD ఉందా? లేదా? అనేది నిర్ణయిస్తారు. అలాగే దీని వల్ల మరే ఇతర మానసిక సమస్యనైనా ఎదుర్కొంటున్నారా అనే విషయం కూడా పసిగడతారు. ఇక మీ సమస్యను బట్టి మానసిక ప్రశాంతతను చేకూర్చే మందులు సూచిస్తారు. అలాగే కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ, టాక్‌ థెరపీ వంటి చికిత్సల ద్వారా ఈ మానసిక సమస్యను దూరం చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఇలా వైద్యులు సూచించిన మందులు వాడే క్రమంలో కొంతమందిలో తలనొప్పి, వికారం, బరువు పెరగడం, అలసట, నిద్రలేమి.. వంటి లక్షణాలు కనిపించచ్చట! అలాంటప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణుల్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవాలన్న విషయం మర్చిపోవద్దు.

                                                                వదిలించుకోకపోతే అనర్థమే!
ఇలా ఎదుటి వ్యక్తిపై మీరు కురిపించే అతి ప్రేమ మీ జీవనశైలిపై, రోజువారీ పనులపై కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఒకవేళ ఆ వ్యక్తి మిమ్మల్ని కాదని మీతో విడిపోయినా.. దాన్ని మీరు అంగీకరించలేనంత బాధలోకి కూరుకుపోతారు. తద్వారా మీరు మానసికంగా మరింత కుంగిపోయే అవకాశం ఉంది.. కాబట్టి ఈ సమస్యను దూరం చేసుకోవడానికి వైద్యులు సూచించిన మందులు, థెరపీలతో పాటు జీవనశైలిలోనూ పలు మార్పులు-చేర్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..!
* ఒకరిని మనం విపరీతంగా ఇష్టపడ్డామంటే మన గురించి వారు ఏం చెబుతారో, ఎలాంటి కితాబిస్తారో అని పదే పదే తెలుసుకోవాలనుకుంటాం. OLD ఉన్న వారూ ఇందుకు అతీతులు కారు. అయితే దీన్ని వదిలించుకోవాలంటే ఈ ఆలోచనల్ని మనసులో నుంచి తుడిచేయాలి. ఈ క్రమంలో ఇతరుల అభిప్రాయాలతో పని లేకుండా ఎవరిని వారు ప్రేమించుకోవడం చాలా ముఖ్యం.
* ఈ మానసిక సమస్య నుంచి బయటపడాలంటే ఒంటరిగా, మీరు ప్రేమించిన వారితో కాకుండా.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేలా చూసుకోవాలి. తద్వారా భాగస్వామి గురించిన ఆలోచనలు మనసులోకి రాకుండా జాగ్రత్తపడచ్చు. అవసరమైతే మీ సమస్యను వారికి తెలియజేసి వారి సపోర్ట్‌ తీసుకోవడానికీ సందేహించద్దు.
* ‘వారే నా సర్వస్వం’ అని కాకుండా ‘వారు నా జీవితంలో ఒక భాగం మాత్రమే’ అన్న విషయాన్ని గ్రహించాలి. అప్పుడే అటు ఎదుటివారిపై ప్రేమ హద్దుల్లో ఉంటుంది.. మీకంటూ కాస్త సమయం కేటాయించుకోగలుగుతారు. OLDని వదిలించుకోవడానికి ఇదీ ఓ మార్గమే!
* ఇప్పటిదాకా ఎదుటివారి ఆలోచనల్లో గడిపిన మీరు.. ఇకపై ఆ ఆలోచనల్ని మీకు నచ్చిన అంశాల పైకి మళ్లించచ్చు. ఈ క్రమంలో కొత్త కోర్సులు నేర్చుకోవడం, మీ అభిరుచుల్ని ఆచరణలో పెట్టడం.. వంటివి అందులో కొన్ని!
* ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని కళ్లు మూసుకొని కాసేపు ధ్యానం చేయడం, శ్వాస సంబంధిత వ్యాయామాలు.. వంటివి మనసులోని ప్రతికూల ఆలోచనల్ని తొలగించి ప్రశాంతత వైపు అడుగులేయిస్తాయి. తద్వారా మెదడుకి కూడా ఆలోచనల్ని అదుపు చేసే సామర్థ్యం పెరుగుతుంది.

అతి ఏదైనా అనర్థదాయకమే! ప్రేమించడం తప్పు కాదు.. కానీ ఎదుటివారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేదో.. వారు మీతో జీవితాంతం కలిసుండాలనుకుంటున్నారో లేదో తెలుసుకోకుండా.. వారి ధ్యాసలో పడిపోయి మిమ్మల్ని మీరు మర్చిపోతే మాత్రం అటు మానసికంగా, ఇటు రిలేషన్‌షిప్‌ పరంగా రెండు విధాలా నష్టమే! కాబట్టి మీలోనూ OLDకి సంబంధించిన ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. ఆలస్యం చేయకుండా మానసిక నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.
అలాగే ఈపాటికే ఇలాంటి సమస్యతో బాధపడి దాన్నుంచి బయటపడ్డవారు దానిని ఎలా అధిగమించగలిగారో మీ అనుభవాలను పంచుకోండి.. ఇదే సమస్యతో బాధపడే మరికొంతమందికి అవి ఎంతగానో ఉపయోగపడవచ్చు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని