రూట్‌.. రైట్‌ రైట్‌! కోహ్లీ ఆపగలడా? - how team india will beat joe root
close
Published : 27/01/2021 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూట్‌.. రైట్‌ రైట్‌! కోహ్లీ ఆపగలడా?

స్వీప్‌ షాట్‌తో మాయ చేస్తున్న ఇంగ్లాండ్‌ సారథి

అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే క్రికెట్‌పై పట్టు సాధించాడు. మరికొన్నేళ్లకే జట్టుకు నాయకుడిగా ఎదిగాడు. సంప్రదాయ క్రికెటింగ్‌ షాట్లు ఆడటంలో సిద్ధహస్తుడు. ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనా తొణకని వీరుడు. స్పిన్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌ అన్న తేడా లేకుండా కొన్ని రోజుల ముందే శ్రీలంకపై పరుగుల వరద పారించాడు. ఇప్పుడు టీమ్‌ఇండియాతో ఢీ అంటున్నాడు. అతడే ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌. కోహ్లీసేనతో సమరానికి రైట్‌.. రైట్‌ అంటున్న అతడి జోరుకు అడ్డుకట్ట వేసేదెలా? ఉపఖండంలో అతడి పరిస్థితి ఏంటి?


బిగ్‌-4.. పోరుపై ఉత్కంఠ

సమకాలీన క్రికెట్‌ ప్రపంచంలో ‘బిగ్‌ 4’ అంటే విరాట్‌ కోహ్లీ, విలియమ్సన్‌, స్టీవ్‌స్మిత్‌, జోరూట్‌. దాదాపుగా వీరి వయసు, ఆటతీరు, జట్టులో ప్రాముఖ్యం ఒకేలా ఉంటుంది. మూడు ఫార్మాట్లు ఆడుతున్నా టెస్టు క్రికెట్‌కే మరింత ప్రాధాన్యం ఇస్తారు. నాయకులుగా తమ జట్లపై తమదైన ముద్రవేశారు. ఈ నలుగురిలో ఏ ఇద్దరు మైదానంలో తలపడ్డా ఆసక్తికరంగా ఉంటుంది. అభిమానులు, విశ్లేషకుల్లో ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో అన్న ఉత్కంఠ కలుగుతుంది. ఫిబ్రవరి 5 నుంచి ఉపఖండంలో కోహ్లీ, జో రూటు ఎదురుపడనున్నారు. తండ్రైన ఆనందంలో విరాట్‌ ఉంటే లంకేయులపై విధ్వంసకర శతకాలు చేసి 2-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన సంతోషంలో రూట్‌ ఉన్నాడు. అతడిని ఆపడం టీమ్‌ఇండియాకు అత్యంత అవసరం. లేదంటే నిలకడ, పట్టుదలకు మారుపేరైన అతడు భారత్‌లోనూ పరుగుల వరద పారించడం ఖాయం.


ద్విశతకం.. శతకం

అదేంటో శ్రీలంక అంటే చాలు జోరూట్‌ విరుచుకుపడుతున్నాడు. అతడి నేతృత్వంలో గత పర్యటనలో 3-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన ఇంగ్లాండ్‌ ఈ సారీ 2-0తో సిరీసును ఊడ్చేయడం గమనార్హం. ముఖ్యంగా ప్రస్తుత విజయాల్లో కీలక పాత్ర పోషించింది కెప్టెన్‌ జో రూట్‌ అనడంలో సందేహమే లేదు. 4 ఇన్నింగ్సుల్లో 106.50 సగటు, 65.63 స్ట్రైక్‌రేట్‌తో 649 బంతులు ఎదుర్కొని 426 పరుగులు చేశాడు. ఇందులో రెండు భారీ శతకాలు ఉండటం ప్రత్యేకం. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతడు 321 బంతులు ఎదుర్కొని 71.03 స్ట్రైక్‌రేట్‌తో 228 పరుగులు చేశాడు. ద్విశతకంతో ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టాడు. ఇందుకోసం దాదాపుగా ఎనిమిది గంటలు క్రీజులో నిలిచాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ రూట్‌ 309 బంతులాడి 186 పరుగులు చేశాడు. రూట్‌ను ఔట్‌ చేసేందుకు లంకేయులు ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. అలసిపోవడంతో రూట్‌ వికెట్‌ ఇచ్చాడే గానీ అంత సులువగా ఔటవ్వలేదు.


స్వీప్‌ షాట్‌తో 25% పరుగులు

స్పిన్‌ ప్రభావం చూపించే శ్రీలంకలో జో రూట్‌ 426 పరుగులు చేశాడంటే కారణం ‘స్వీప్ ‌షాట్‌’. సాధారణంగా టర్న్‌ అయ్యే బంతుల్ని ఎదుర్కొనేందుకు బ్యాట్స్‌మెన్‌ వాడే ప్రధాన అస్త్రం స్వీప్‌. అయితే అందరూ దీన్నంత సమర్థంగా ఆడలేరు. రూట్‌ హిట్టవ్వడానికి మిగతా ఆటగాళ్లు విఫలమవ్వడానికి కారణమిదే. అతనాడినంత సమయోచితంగా, కచ్చితత్వంతో ఇంగ్లాండ్‌లోని ఇతర ఆటగాళ్లు ఆడలేకపోయారు. లంక సిరీసులో రూట్‌ 37 బౌండరీలు, 1 సిక్సర్‌ బాదాడు. అందులో 16 బౌండరీలు స్వీప్‌ షాట్‌ ద్వారానే లభించాయి. మొత్తంగా 105 పరుగులు స్వీప్‌ ద్వారా రాబట్టాడు. దాదాపు 25% పరుగులు ఇలానే వచ్చాయి. టీమ్ఇండియాతో ఇంగ్లాండ్‌ తలపడే తొలి రెండు టెస్టులకు వేదిక చెపాక్‌. దాదాపుగా ఇక్కడి వాతావరణ పరిస్థితులు గాలెకు మరీ భిన్నంగా ఏమీ ఉండవు. పిచ్‌ సైతం మందకొడిగా ఉంటుంది. స్పిన్నర్లే ప్రభావం చూపుతారు. ఇక్కడా రూట్‌ ప్రధాన అస్త్రం స్వీప్‌షాటే కానుంది.


భారత్‌పై మెరుగే

భారత్‌లో రూట్‌ ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడాడు. 49.24 స్ట్రైక్‌రేట్‌, 53.09 సగటుతో 584 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌ సగటు 49.39తో పోలిస్తే ఉపఖండంలోనే సగటు ఎక్కువ. 2016 పర్యటనలో రాజ్‌కోట్‌లో శతకం (124) బాదేశాడు. నాగ్‌పుర్‌ (73), విశాఖపట్నం (53), మొహాలి (78), ముంబయి (77), చెన్నై (88)లో అర్ధశతకాలు సాధించాడు. ఆడిన ప్రతి మైదానంలో ఏదో ఒక ఇన్నింగ్స్‌లో అర్ధశతకం చేస్తుండటం రూట్‌ ప్రత్యేకత. గతంలో జట్టు సభ్యుడిగా వచ్చిన అతడు ఈ సారి నాయకుడిగా అడుగుపెడుతున్నాడు. లంకలో స్పిన్‌ను చక్కగా ఎదుర్కొన్న అతడు ఇక్కడా అదే పనిచేస్తాడని చాలామంది అంచనా వేస్తున్నారు.


క్యాచులు ఇచ్చేలా వ్యూహం

క్రీజులో నిలిస్తే వికెట్‌ ఇవ్వని రూట్‌ ఎక్కువగా క్యాచ్‌ (61)లు ఇచ్చి వెనుదిరిగాడు. కీపర్‌ క్యాచుల ద్వారా 48 సార్లు పెవిలియన్‌ చేరాడు. 27 సార్లు వికెట్ల ముందు దొరికపోతే 23 సార్లు బౌల్డ్‌ అయ్యాడు. 8 సార్లు రనౌట్‌ అయ్యాడు. టీమ్‌ఇండియాపైనా అతడి పరిస్థితి ఇదే. క్యాచుల ద్వారా 10, కీపర్ క్యాచుల ద్వారా 4, ఎల్బీడబ్ల్యూ ద్వారా 8, రనౌట్‌ ద్వారా 2, బౌల్డ్‌ ద్వారా ఒకసారి పెవిలియన్‌ చేరుకున్నాడు. రవీంద్ర జడేజా అతడిని అత్యధిక సార్లు ఔట్‌ చేశాడు. 20 ఇన్నింగ్సుల్లో 5 సార్లు పెవిలియన్‌ పంపించాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో రూట్‌ మూడుసార్లు క్యాచులు ఇచ్చాడు. బుమ్రా 6 ఇన్నింగ్సుల్లోనే 2 సార్లు ఔట్‌ చేయడం గమనార్హం. జయంత్‌ యాదవ్‌ 2, ఇషాంత్‌ శర్మ 2, మహ్మద్‌ షమి 2 సార్లు పెవిలియన్‌ పంపించారు. మొత్తంగా పేసర్ల బౌలింగ్‌లో రూట్‌ వికెట్ల ముందు దొరికిపోతున్నాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో కీపర్‌ లేదా ఫీల్డర్లకు క్యాచ్‌ ఇస్తున్నాడు. కొన్నిసార్లు సమన్వయ లోపం, గందరగోళంతో రనౌట్‌ అవుతుంటాడు. త్వరలో జరగబోయే సిరీసులో టీమ్‌ఇండియా వీటిని జాగ్రత్తగా గమనించి వ్యూహాలు రచిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. సొంత మైదానంలో అశ్విన్‌, పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కీలకమవుతారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని