Mask must: మాస్క్‌ ఇలాగే వాడుతున్నారా? - how to use masks spl video
close
Published : 11/06/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mask must: మాస్క్‌ ఇలాగే వాడుతున్నారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఊసరవెల్లిలా పలు రకాలుగా విరుచుకుపడుతున్న కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దాదాపు ఏడాదిన్నరకి పైగా ప్రభుత్వాలు/ ప్రజలు ఈ కనిపించని శత్రువుతో పోరాడుతూనే ఉన్నారు. ఈ మహమ్మారిపై పోరాటంలో ప్రస్తుతం మన ముందున్న అస్త్రాలు మాస్క్‌లు.. టీకాలే. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నప్పటికీ.. అందరికీ టీకా అందాలంటే చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్‌లు సరిగా, తప్పనిసరిగా ధరించాలని ఆరోగ్య రంగ నిపుణులు, ప్రభుత్వాధినేతలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. మాస్క్‌ను సరిగా ధరిస్తే ఏ వేరియంట్‌ వైరస్‌నైనా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, మన దేశంలో మాస్క్‌ పెట్టుకుంటున్నవారిలో 86శాతం మంది సరిగా ధరించడంలేదని గత నెలలో ఓ సర్వేలో తేలిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలు మాస్క్‌లు ఎలా వాడాలో సూచిస్తూ హైదరాబాద్‌లోని సీసీఎంబీ ఓ వీడియోను రూపొందించింది.

కరోనా కట్టడి కోసం మార్కెట్లో అనేక వెరైటీల మాస్క్‌లు లభిస్తున్నాయి. క్లాత్‌ మాస్క్‌.. సర్జికల్‌ మాస్క్‌.. ఎన్‌ 95 మాస్క్‌.. ఇలా ఏ మాస్క్‌ను ఎలా ధరించాలి? ఇవి ఎంత మేరకు వైరస్‌ నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి? ఎప్పుడు వాటిని డిస్పోజ్‌ చేయాలి? తదితర కీలక అంశాలపై అవగాహన కల్పిస్తూ సీసీఎంబీ-సీఎస్‌ఐఆర్‌ ప్రత్యేక వీడియోను తయారుచేసింది. కరోనా వైరస్‌ అన్ని వేరియంట్ల నుంచి మనల్ని మనం రక్షించుకొనేందుకు సులభమైన పద్ధతి మాస్క్‌ ధరించడమేనని, తద్వారా కరోనా బారినుంచి రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

క్లాత్‌ మాస్క్‌: వైరస్‌ వ్యాప్తి నుంచి ఈ మాస్క్‌లు 60శాతం రక్షణ కల్పిస్తాయి. ఎక్కువ పొరలు జోడించడంతో రక్షణ పరిధి పెరుగుతుంది. 100శాతం పత్తి నుంచి తయారైన మాస్క్‌లు ఉత్తమమైనవి. 

సర్జికల్‌ మాస్క్‌: ఈ మాస్క్‌లు బయటి నుంచి ఫ్లూయిడ్‌తో కూడిన లేయర్‌తో లోపలి భాగంలో పీల్చుకొనే లక్షణం కలిగిన లేయర్‌తో మూడు లేయర్లుగా ఉంటాయి. రెస్పిరేటరీ డ్రాప్‌లెట్స్‌, ఏరోసోల్స్‌ను నిరోధిస్తాయి. వైరస్‌ నుంచి 70 శాతం వరకు రక్షణ అందిస్తాయి.  

ఎన్‌ 95 మాస్క్‌లు: ఇవి వైరస్‌ వ్యాప్తి నుంచి 95శాతం రక్షణ కల్పిస్తాయి. వీటిని ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, కరోనా రోగులతో సంబంధం ఉన్న వ్యక్తులు వినియోగిస్తారు. 

డబుల్‌ మాస్కింగ్‌: మొదట సర్జికల్‌ మాస్క్‌, తర్వాత క్లాత్ మాస్క్‌ను వాడటం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుందని పరిశోధనల్లో తేలింది.  

మాస్క్‌లు ఎలా వాడాలి? 

ఎల్లప్పుడూ కొత్త, కడిగిన మాస్క్‌నే వాడండి. మాస్క్‌ పాడైనా, మురికిగా ఉన్నా పారేయండి. మాస్క్‌ను తాకడానికి ముందు చేతులను శుభ్రం చేసుకోండి. లేదా శానిటైజ్‌ చేయండి. మాస్క్‌ని దానిలో ఇన్నర్‌ లూపులు, స్ట్రాప్‌లతో మాత్రమే హ్యాండిల్‌ చేయాలి. మాస్క్‌ మీ ముక్కు, నోరు, గడ్డం భాగాలను పూర్తిగా కవర్‌ చేసేలా జాగ్రత్త వహించాలి. మెరుగైన ఫిట్టింగ్‌ కోసం ఇయర్‌ లూప్‌లను ముడి వేయవచ్చు. అనవసరంగా మాస్క్‌ తాకవద్దు. కొంత సమయం మీ మాస్క్‌ను తొలగించాలనుకుంటే చెవి లూప్‌లను పట్టుకొని తీయండి. మీ ముఖానికి తాకే ఉపరితలాన్ని మీరు తాకొద్దు. మాస్క్‌ను శుభ్రమైన ఉపరితలంపై ఉంచడం ద్వారా దాన్ని మళ్లీ వాడొచ్చు.

12గంటల కన్నా ఎక్కువ సేపు ఒకే మాస్క్‌ వాడొద్దు. మీరు వాడే మాస్క్‌ను బట్టి వాటిని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. క్లాత్‌ మాస్క్‌అయితే కడిగిన తర్వాత తిరిగి వాడొచ్చు. డిటర్జెంట్‌తో కడగవచ్చు లేదా కొంత సమయం పాటు బ్లీచింగ్‌లో నానబెట్టి ఎండలో ఆరబెట్టవచ్చు. మాస్క్‌ వాడిన ప్రతిసారి లేదా 12గంటల ఉపయోగం తర్వాత పారేయండి. సర్జికల్‌ మాస్క్‌లు డిస్పోజబుల్‌. వాటిని ఒకసారి మాత్రమే ధరించాలి.

సీడీసీ సూచించినట్టుగా ఎన్‌ 95 మాస్క్‌లు ఐదు సార్లు వరకూ వాడొచ్చు. వీటిని కడగలేం. కడగడం ద్వారా వాటిలో ఫిల్టరింగ్‌ సామర్థ్యం తగ్గిపోతుంది. ఒకసారి వాడిన తర్వాత తిరిగి వాడేందుకు ముందు వాటిని కనీసం 24గంటల పాటు శుభ్రమైన, పొడి ప్రదేశంలో ఉంచాలి. వాడేసిన సర్జికల్‌ లేదా ఎన్‌ 95 మాస్క్‌లను పారేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపయోగించిన మాస్క్‌ను ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో ఉంచాలి. సాధారణ వ్యక్తి వాడిన మాస్క్‌ను అయితే చెత్తబుట్టలో, కొవిడ్ పాజిటివ్‌ వ్యక్తి వాడితే దాన్ని బయో మెడికల్‌ వేస్ట్‌బిన్‌లో వేయాలి. తర్వాత చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని