WTC Final: వారి విమర్శల వల్లే నేనిక్కడ.. ఇలా! - i have reached here because of criticism says rahane
close
Updated : 17/06/2021 11:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WTC Final: వారి విమర్శల వల్లే నేనిక్కడ.. ఇలా!

సెంచరీలు కాదు గెలుపు పరుగులు చేయడమే కీలకం: రహానె

సౌథాంప్టన్‌: విమర్శలను తాను పట్టించుకోనని టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె అంటున్నాడు. నిజానికి వాటివల్లే తానీ స్థాయిలో ఉండగలిగానని పేర్కొన్నాడు. తన నియంత్రణలో లేని వాటిపై దృష్టి పెట్టనని వివరించాడు. జట్టు విజయానికి అవసరమైన పరుగులు చేయడమే ముఖ్యమని.. సెంచరీలు కాదని వెల్లడించాడు. ఐసీసీ ప్రవేశపెట్టిన టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 17 మ్యాచులాడిన అతడు 1095 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఫామ్‌ పరంగా ఒడుదొడుకులు ఎదుర్కొన్నా భారత్‌లో ఎక్కువ పరుగులు చేసింది అతడే.

‘ఎక్కువ పరుగులు చేయడం ప్రత్యేకమే! కానీ, జట్టు విజయం కోసం ఎన్ని పరుగులు చేశామన్నదే నాకు ముఖ్యం. ప్రతిసారీ నేనదే ఆలోచిస్తాను. విమర్శలకు నేను సంతోషిస్తాను. వాస్తవంగా వాటివల్లే నేనిక్కడ ఉన్నాను. విమర్శలు వచ్చినా రాకున్నా అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నిస్తాను. నిజానికి వాటిని నేను పట్టించుకోను. ఒక బ్యాట్స్‌మన్‌గా లేదా ఫీల్డర్‌గా దేశం కోసం కష్టపడతాను’ అని రహానె అన్నాడు.

‘విమర్శలు చేయడం విమర్శకుల పని. అందుకే, నా నియంత్రణలో లేని వాటి గురించి ఆలోచించను. నా బ్యాటింగ్‌ ప్రక్రియపై దృష్టి పెట్టి పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తాను. నేనెప్పుడూ నా సహజ శైలిలోనే ఆడతాను. నేను వంద చేసినా చేయకపోయినా జట్టు గెలవడమే మాకు ముఖ్యం. అందుకే ప్రతిసారీ శతకం చేయాలన్న ఒత్తిడి నాపై ఉంచుకోను. గెలుపునకు ఉపయోగపడే 30 లేదా 40 పరుగులు చేసినా ఆనందమే’ అని జింక్స్‌ తెలిపాడు.

గతంలో ఇంగ్లాండ్‌లో పర్యటించిన అనుభవం రహానెకు ఉంది. 2014, 18లో అక్కడ టెస్టులు ఆడాడు. అంతేకాకుండా 2019లో హాంప్‌షైర్‌ కౌంటీ తరఫున ఆడాడు. దాంతో ఇంగ్లిష్‌ పరిస్థితులపై అతడికి మంచి అవగాహన ఉంది. అందరికన్నా ఎక్కువ పరుగులు చేశాడు. అయితే గతం గురించి ఆలోచించకుండా వర్తమానంలో బతకడం తనకిష్టమని జింక్స్‌ చెబుతున్నాడు.

‘ఇక్కడి పరిస్థితులు నాకు తెలుసు. వాటికి అలవాటు పడటం కీలకం. ఇక్కడ నేను ఎక్కువ పరుగులు చేశానన్నది గతం. వాటివల్ల ఒత్తిడి పెంచుకోకుండా స్వేచ్ఛగా ఆడాలని అనుకుంటున్నా. ఫైనల్‌కు మానసికంగా సన్నద్ధమవ్వడం ముఖ్యం. ఇదీ అన్ని మ్యాచుల్లాగే ఒక టెస్టు. రిషభ్, శుభ్‌మన్‌ బాగా ఆడుతున్నారు. వారికి నేనేమీ సలహాలు ఇవ్వను. స్వేచ్ఛగా, తమ సామర్థ్యం మేరకు ఆడాలని చెబుతాను. ఇంగ్లాండ్‌ పిచ్‌లు బౌలర్లకు సహకరిస్తాయి. కాబట్టి బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడంపైనే విజయం ఆధారపడి ఉంటుంది’ అని రహానె వెల్లడించాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని