60 శాతం మంది ఆక్సిజన్‌ పడకలపైనే.. - india posts world record covid cases with oxygen running out
close
Published : 23/04/2021 11:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

60 శాతం మంది ఆక్సిజన్‌ పడకలపైనే..

ప్రాణవాయువు కొరతతో అల్లాడుతున్న రోగులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా దెబ్బకు ప్రాణవాయువు కోసం పాకులాడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కరోనా రెండో దశలో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. వ్యాధి ప్రభావం అధికంగా ఉండి నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుండటంతో, ఊపిరాడక బాధితులు ప్రాణవాయువు కోసం కొట్టుమిట్టాడుతున్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో వ్యాధి బారిన పడుతున్న వారిలో దాదాపు 60 నుంచి 70 శాతం మందికి ఆక్సిజన్‌ అవసరమవుతోంది. బాధితుల్లో ఆక్సిజన్‌ సాచ్యురేషన్ 94 శాతం కన్నా తక్కువగా ఉన్నప్పుడు బయటినుంచి కృత్రిమ ఆక్సిజన్‌ అందించాల్సి ఉంటుంది. 

గతంలో కన్నా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటం.. ఊపిరితిత్తులకు నేరుగా నష్టం కలిగిస్తుండటంతో ఆక్సిజన్‌ అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారికి మహమ్మారి సోకగానే ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి చేరి ఆయాసం రావడంతో బాధితులకు ఆక్సిజన్‌ ఇవ్వాల్సిన అవసరం పెరుగుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడటంతో కేవలం దానికోసమే ప్రభుత్వాసుత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గురువారం రాత్రి వరకు 700 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతుండగా వీరిలో 90 శాతం మందికి ఆక్సిజన్‌ అందిస్తున్నారు. మరో 40 మంది ప్రాణవాయువు కోసం ఎదురుచూస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో 720 మంది కరోనా రోగులు ఉండగా వీరిలో 130 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారితోపాటు మరో 500 మందికి ఆక్సిజన్‌ పెడుతున్నారు. విశాఖ కేజీహెచ్‌లో ఐసీయూలో 300 మంది, ప్రాణవాయువు అందించే పడకలపై మరో 1000 మంది ఉన్నారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో 622 మంది చికిత్స పొందుతుండగా.. ఐసీయూలో 61 మంది, ఆక్సిజన్‌ పడకలపై 368 మంది ఉన్నారు. ఒంగోలు రిమ్స్‌లోని 800 మందిలో 100 మంది ఐసీయూలోనూ మరో 320 మంది ఆక్సిజన్‌ పడకలపైనే చికిత్స పొందుతున్నారు.

మలిదశలో వైరస్‌ ఉద్ధృతంగా ఉండటంతో చాలా మందిలో లక్షణాలు ఉన్నా.. సకాలంలో పరీక్షలు చేయించుకోకపోవడం, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కూడా సమయానికి వైద్యులను సంప్రదించకపోవడం వల్లే ప్రాణవాయువు అవసరాలు పెరుగుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. గతంలో కన్నా ఈసారి యువకులకు ఆక్సిజన్‌ అవసరం ఎక్కువగా ఉంటోందని అంటున్నారు. ఊపిరి అందని పరిస్థితుల్లో ఆక్సిజన్‌ కోసం ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగి చివరకు ప్రభుత్వ ఆసుపత్రులకు చేరుకుంటున్నారని తెలిపారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని