ఒక్కరోజే లక్ష కేసులు.. యూఎస్‌ తర్వాత మనమే - india records 1 lakh cases in 24 hours second country after us
close
Updated : 05/04/2021 11:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్కరోజే లక్ష కేసులు.. యూఎస్‌ తర్వాత మనమే

వారంలో 5.45లక్షల మందికి పాజిటివ్‌

భారత్‌లో మళ్లీ పడగవిప్పిన కరోనా

ఇంటర్నెట్‌డెస్క్‌: జనవరి 30, 2020.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించిన రోజు.. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన రోజు.. ఆ తర్వాత నుంచి రోజుకు పదులు, వందలు, వేల సంఖ్యలో ప్రజలు కొవిడ్‌ బారినపడ్డారు. ఇప్పుడు ఈ సంఖ్య ఏకంగా లక్ష దాటింది. కేవలం 24 గంటల వ్యవధిలో దేశంలో 1,03,558 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత రోజువారీ కేసులు ఈ స్థాయిలో రావడం ఇదే తొలిసారి. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో లక్షకు పైగా కొత్త కేసులు నమోదైన రెండో దేశం భారత్‌ కావడం గమనార్హం. ఇక తాజాగా నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఒక్క మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి.

అగ్రస్థానంలో.. అగ్రరాజ్యం

24 గంటల వ్యవధిలో లక్షకు పైగా కేసులు నమోదైన తొలి దేశం అమెరికా. అక్కడ ఈ ఏడాది జనవరి 8న అత్యధికంగా 3.08లక్షల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అమెరికా తర్వాత భారత్‌లోనే రోజువారీ కేసులు అత్యధికంగా ఉన్నాయి. తాజాగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు మన దేశంలో 1.03లక్షల మందికి వైరస్‌ సోకింది. అమెరికా, భారత్‌ మినహా ఏ దేశంలోనూ ఇప్పటివరకు ఒక రోజులో లక్షకు పైగా కేసులు నమోదు కాలేదు. 

నెల రోజుల్లో ఆరింతలై..

దేశంలో ప్రస్తుతం కేసుల నమోదులో గతేడాది సెప్టెంబరు నాటి పరిస్థితి నెలకొంది.  అప్పుడు రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువ కాగా.. ఇప్పుడు ఏకంగా లక్ష దాటి ప్రజలను భయాందోళనలోకి నెట్టేస్తోంది. గతేడాది సెప్టెంబరు 16న దేశంలో ఒకరోజే 97,894 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఆ తర్వాత అత్యధిక రోజువారీ కేసులు మళ్లీ ఇప్పుడే. అయితే గతేడాది అక్టోబరు తర్వాత నుంచి తగ్గుముఖం పట్టిన మహమ్మారి.. ఇటీవల మళ్లీ కొమ్ములెత్తుతోంది. సరిగ్గా నెల రోజుల కింద రోజువారీ కొత్త కేసులు 15వేల నుంచి 16వేల మధ్య ఉండగా.. ఇప్పుడు ఏకంగా ఆరు రెట్లు పెరగడం గమనార్హం. 

విజృంభణకు కారణాలివే..

గతేడాది జనవరి చివర్లో దేశంలో తొలి కేసు నమోదైన తర్వాత మే 18 నాటికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది. కానీ, ఇప్పుడు ఒక్కరోజు కేసులే లక్షకు మించాయి. ఇందుకు ప్రజల్లో నెలకొన్న నిర్లక్ష్యతే ప్రధాన కారణంగా కన్పిస్తోంది. దేశంలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కొవిడ్‌ నిబంధనల పట్ల ప్రజల్లో నిర్లిప్తత పెరిగింది. మాస్క్‌లు, సామాజికదూరం వంటివి పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే వైరస్‌ మళ్లీ వేగంగా విజృంభిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. దీంతో పాటు క్షేత్రస్థాయిలో కంటైన్‌మెంట్‌ ప్రాంతాలను సరిగా గుర్తించలేకపోవడం, అక్కడ నిబంధనల అమల్లో వైఫల్యమే ఉద్ధృతికి కారణంగా కన్పిస్తోంది. 

మరణాలు అదుపులోనే..

అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రికవరీలు కూడా దాదాపు అదే స్థాయిలో ఉంటుండటం కాస్త ఊరటనిస్తోంది. గతేడాది సెప్టెంబరు నాటి పరిస్థితిని చూస్తే.. ఆ నెలలో రోజువారీ మరణాలు వెయ్యికి పైనే నమోదయ్యాయి. అత్యధికంగా గతేడాది సెప్టెంబర్‌15న 1,283 మంది బలయ్యారు. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరణాల సంఖ్య తక్కువగానే ఉంటోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 478 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. 

కేసుల పెరుగుదల ఇలా..

దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.25కోట్లు దాటింది. వీరిలో 1.16కోట్ల మంది వైరస్‌ను జయించగా.. ప్రస్తుతం 7.41లక్షల క్రియాశీల కేసులున్నాయి. అయితే దేశంలో కరోనా కేసుల పెరుగుదలను ఒకసారి పరిశీలిస్తే..

* ఆగస్టు 7, 2020 - 20లక్షలు

* ఆగస్టు 23, 2020 - 30లక్షలు

* సెప్టెంబరు 5, 2020 - 40 లక్షలు

* సెప్టెంబరు 16, 2020 - 50లక్షలు 

* సెప్టెంబరు 28, 2020 - 60 లక్షలు

* అక్టోబరు 11, 2020 - 70 లక్షలు 

* అక్టోబరు 29, 2020 - 80 లక్షలు

* నవంబరు 20, 2020 - 90 లక్షలు

* డిసెంబరు 19, 2020 - కోటి

* మార్చి 28, 2021 - 1.20 కోట్లు మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని