Corona: గంటకు 10వేల కేసులు.. 60మరణాలు - india records 10000 new cases per hour on an average
close
Published : 20/04/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: గంటకు 10వేల కేసులు.. 60మరణాలు

దిల్లీ: కరోనా మహమ్మారి ధాటికి యావత్‌ దేశం మరోసారి విలవిల్లాడుతోంది. మునుపటి కంటే రెట్టింపు వేగంతో విరుచుకుపడుతూ వణికిస్తోంది. గత ఆరు రోజులుగా దేశంలో రోజుకు 2లక్షలకు పైనే కొత్త కేసులు బయటపడుతుండటం వైరస్‌ తీవ్రతను కళ్లకు కడుతోంది. దేశంలో గత కొద్ది రోజుల నుంచి సగటున గంటకు 10వేలకు పైనే కొత్త కేసులు.. 60 మరణాలు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. 

ఏప్రిల్‌ 1న దేశవ్యాప్తంగా 72వేలపైన కొత్త కేసులు రాగా.. 459 మరణాలు సంభవించాయి. అంటే ఆ రోజు సగటున గంటకు 3వేల కొత్త కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. అయితే గత ఆదివారం నాటికి ఈ సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరగడం గమనార్హం. గత ఆదివారం దేశంలో సగటున గంటకు 10,895 కొత్త కేసులు బయటపడగా.. గంటకు 60 మందికి పైగా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్యశాఖ గణంకాలు చెబుతున్నాయి. 

సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 2,59,170 కొత్త కేసులు వెలుగుచూశాయి. అంటే సగటున గంటకు 10,798 కేసులు వస్తున్నాయి. ఇక మరణాలు కూడా భారీగానే పెరుగుతుండటం కలవరపెడుతోంది.  

41 రోజులుగా పెరుగుతూనే..

గతేడాది సెప్టెంబరులో కరోనా తీవ్ర రూపం దాల్చిన సమయంలో రోజువారీ కేసులు గరిష్ఠంగా 97వేలుగా నమోదయ్యాయి. అక్టోబరు తర్వాత నుంచి వైరస్‌ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కన్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక దశలో రోజువారీ కేసులు 10వేల లోపునకు పడిపోవడంతో హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారంతా..! కానీ ఆ ఉపశమనం ఎన్నో రోజులు లేదు. ఫిబ్రవరి రెండో వారం తర్వాత నుంచి క్రమక్రమంగా రోజువారీ కేసులు పెరగడం మొదలుపెట్టాయి.

గత 41 రోజులుగా కొత్త కేసులు స్థిరంగా పెరుగుతూ 2లక్షల మార్క్‌ దాటాయి. అమెరికా తర్వాత ప్రపంచంలోనే రోజుకు 2లక్షల పైనే కేసులు నమోదైన రెండో దేశం మనదే కావడం విచారకరం. మరోవైపు కొత్త కేసులు రికార్డు స్థాయిలో బయటపడుతుండటంతో దేశంలో క్రియాశీల కేసులు అమాంతం పెరిగి 20లక్షల మార్క్‌ను దాటాయి. దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా పాజిటివల్‌ సంఖ్య 1.53కోట్లు దాటింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని