ప్రపంచ దేశాలకు ఆశాజ్యోతిగా భారత్‌ టీకా - indias covid vaccine rollout rescued the world from pandemic report
close
Published : 09/03/2021 17:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రపంచ దేశాలకు ఆశాజ్యోతిగా భారత్‌ టీకా

3.3కోట్ల కొవిడ్‌ టీకాల ఎగుమతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ టీకా కేంద్రంగా భారత్‌ ఆవిర్భవిస్తోంది. ఔషధ రంగంలో రారాజుగా వెలుగొందుతూ అందుకు అనుగుణంగానే కరోనా టీకాల విషయంలో ముందుకు సాగుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ధనిక, పేద దేశాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు విశేషంగా కృషి చేస్తోంది. అమెరికాలో అభివృద్ధి చేసిన ఫైజర్‌, మోడెర్నా వంటి టీకాలు కేవలం ధనిక దేశాలకే పరిమితమవుతున్న నేపథ్యంలో పేద, మధ్య ఆదాయ దేశాలకు అతి చౌకగా టీకాలను ఎగుమతి చేస్తూ కొండంత అండగా నిలుస్తోంది. ఇప్పటికే 3.3 కోట్ల కొవిడ్‌ టీకాలను భారత్‌ విదేశాలకు ఎగుమతి చేసింది.

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పడ్డ అంతర్జాతీయ కూటమి గవీ-కొవాక్స్‌లో భారత్‌ సభ్యత్వం కలిగి ఉంది. కొవాక్స్‌ కార్యక్రమం ద్వారా 2021 చివరి నాటికి 200 కోట్ల టీకాలను పేద, మధ్య ఆదాయ దేశాలకు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా భారత్‌ ఇప్పటికే 3.3 కోట్ల కొవిడ్‌ డోసులను విదేశాలకు ఎగుమతి చేసింది. భారత్‌లో పంపిణీ చేసిన టీకాలతో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువని ఆసియన్‌ సొసైటీ ఫర్‌ ఎమర్జెన్సీ మెడిసన్‌ వైద్యులు తమురిష్‌ కోలే పేర్కొన్నారు. పేద, మధ్య ఆదాయ దేశాల ఆరోగ్య రక్షణకు భారత్‌ చేస్తోన్న కృషికి ఇది అద్దం పడుతోందని ఆయన విశ్లేషించారు.

గవీ-కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 2న ఘనా దేశానికి 6లక్షల టీకా డోసులను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఎగుమతి చేసింది. ఐవరీ కోస్టుకు 5 లక్షల టీకాలను భారత్‌ సరఫరా చేసింది. ఇలా పలు పేద, మధ్య ఆదాయ దేశాలకు కొవిడ్‌ టీకాలను చేరువ చేస్తూ భారత్‌ పెద్దన్న పాత్ర పోషిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్‌ 92 పేద, మధ్య ఆదాయ దేశాలలోని ఆరోగ్య కార్యకర్తల కోసం టీకాలను సరఫరా చేసింది. అందులో 82 దేశాలకు భారత్‌ నుంచే వ్యాక్సిన్లను సరఫరా చేసింది. దీనిని బట్టి చూస్తే ధనిక, పేద దేశాలకు టీకా పంపిణీలో నెలకొన్న అంతరాన్ని తొలగించేందుకు భారత్‌ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా అందరూ ఊహించినట్లుగానే పేద దేశాల ఆశాజ్యోతిగా భారత్‌ నిలిచింది. ఆయా దేశాల్లోని ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తనవంతు పాత్ర పోషిస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని