IPL 2021: సెప్టెంబర్‌లో ఐపీఎల్‌ కొనసాగింపు? - ipl remaining matches will be played in uae third week of september confirms bcci
close
Updated : 25/05/2021 19:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL 2021: సెప్టెంబర్‌లో ఐపీఎల్‌ కొనసాగింపు?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల భారత్‌లో నిర్వహించిన ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో మెగా టోర్నీని నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 29 మ్యాచ్‌లు జరగ్గా ఇంకా 31 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ మూడో వారంలో యూఏఈలో తిరిగి కొనసాగించాలని బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఓ అధికారి పీటీఐతో మాట్లాడుతూ ఆ విషయాన్ని తెలిపారు.

సెప్టెంబర్‌ 18, 19 తేదీలు వారంతం కావడంతో ఆ రెండు రోజుల్లో ఎప్పుడైనా తిరిగి ప్రారంభించేందుకు చూస్తున్నామని, అందుకోసం మూడు వారాల సమయం కేటాయించామని ఆయన చెప్పారు. అలా అక్టోబర్‌ 9 లేదా 10వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ జరిగే అవకాశం ఉందన్నారు. ఈ సవరించిన తేదీల్లో 31 మ్యాచ్‌లు పూర్తి చేయాల్సి రావడంతో పదిసార్లు డబుల్‌ హెడర్స్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటన సెప్టెంబర్‌ 14న ముగుస్తుందని, దాంతో ఆ రెండు జట్లను ప్రత్యేక ఫ్లైట్‌లో యూఏఈకి తరలిస్తామని చెప్పారు. మిగతా దేశాల ఆటగాళ్లకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆటగాళ్లందరికీ అక్కడ మూడు రోజుల క్వారంటైన్‌ ఉంటుందన్నారు. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్‌ను బీసీసీఐ వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో సఫారీలతో తొలుత పొట్టి సిరీస్‌ నిర్వహించాలని బీసీసీఐ భావించింది. ఇప్పుడు ఐపీఎల్‌కు మించిన ప్రాక్టీస్‌ ఏదీ లేదని ఆ అధికారి పేర్కొన్నారు. అలాగే నవంబర్‌లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగాల్సిన రెండు టెస్టుల సిరీస్‌లోనూ తేదీల మార్పు ఉంటుందని ఆయన అన్నారు. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో దిల్లీ క్యాపిటల్స్‌ ఆరు విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై, బెంగళూరు ఐదు విజయాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ముంబయి ఇండియన్స్‌ నాలుగు  విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. మరి ఈసారి విజేతగా ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని